స్థానిక ఎన్నికల నామినేషన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలపై గవర్నర్ జస్టిస్ నజీర్‌కు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఉద్యోగులు, పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు
రాష్ట్రంలో ఎనిమిది మున్సిపాలిటీల్లో నామినేషన్లే వేయనివ్వలేదు
పోలీసులే సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేసి బాధితులపైనే ఎదురు కేసులు
ఆన్‌లైన్‌లో నామినేషన్లు దాఖలుకు అవకాశం ఇవ్వాలి..
పారా మిలటరీ బలగాలను రప్పించాలి
అన్ని చోట్లా సీసీ కెమెరాలతో ప్రజలు లైవ్ చూసే ఏర్పాటు చేయాలి
ఇప్పుడు వాళ్ల టైం.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ రాదు
2029లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోలీసులు, చిన్న స్థాయి ఉద్యోగులు, ప్రజలు అంతా తిరగబడాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ‘ప్రతి కార్యకర్తకూ చెబుతున్నా.. టైం వాళ్లది కాబట్టి కొడతారు.. కొట్టించుకుందాం.. 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ వస్తుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. గట్టిగా నిలబడండి’ అంటూ ధైర్యం చెప్పారు. ఆదివారం ఆయన లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య ఉల్లంఘనలు, 8 మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు కాని పరిస్థితి, పలుచోట్ల నామినేషన్ పత్రాలను చింపి వేయడం, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకోవడం, అక్రమ కేసులు పెట్టడం వంటి అంశాలను గవర్నర్‌కు వివరించారు. పోలీసు వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఎంపీ మిథున్ రెడ్డిపై హత్యాయత్నం, ఎంపీలు అవినాష్ రెడ్డి, గురుమూర్తిలపై అక్రమ కేసుల గురించి గవర్నర్‌కు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లో లేదా కేంద్రీకృత విధానంలో నిర్వహించాలని, పోలింగ్ బూత్‌లు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేయాలని, 17సీ ఫారాల పరిశీలనలోనూ పారదర్శకత పాటించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ
ఏమన్నారంటే.. నామినేషన్లు వేసే పరిస్థితి లేదు
‘రాష్ట్రంలో ఇప్పుడున్న ఇంతటి దారుణమైన అప్రజాస్వామ్య పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడా ఉండదు. రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వావిుక ఎన్నికల ప్రక్రియపై గవర్నర్‌కు ఆధారాలతో సుదీర్ఘంగా వివరించాం. రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్, చైర్మన్ పదవులకు అసలు నామినేషన్లే పడని పరిస్థితి కల్పించారు. ఏడు చోట్ల పూర్తిగా జీరో నామినేషన్లు. ఇంకో చోట కేవలం 3 నామినేషన్లు మాత్రమే పడ్డాయి. మరో 19 చోట్ల కేవలం 36 శాతం మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. అభ్యర్థుల దగ్గర అక్నాలెడ్జ్‌మెంట్లు ఉన్నా.. 6 ఆఫీసుల్లో ఆర్వోల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను చించేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు కూడా వేసే పరిస్థితి లేదు. నామినేషన్ల దశలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రేపు పోలింగ్ రోజు ఇంకెంతటి ఘోరాలు జరుగుతాయో ప్రజలంతా ఆలోచించాలి.
ప్రభుత్వంతో ఎన్నికల సంఘం కుమ్మక్కు
అర్బన్ లోకల్ బాడీస్‌లోనే ఇలా ఉంటే.. బుధవారం నుంచి ప్రారంభమయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిస్థితి ఏమిటి? కనీసం ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతున్నారంటే చంద్రబాబుకు గెలుస్తానన్న నమ్మకమే లేదు. మంచి చేశానని నమ్మకం ఉన్న ఏ ముఖ్యమంత్రీ ప్రతిపక్షాలను పోటీ చేయనివ్వకుండా అడ్డుకోవాలని చూడరు. ఎన్నికల్లో పోటీ ఉంటే తమకు ఓట్లు పడవనే భయంతో వణికి పోతున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని చూస్తున్నాం. ఎన్నికలను ధర్మబద్ధంగా నడిపించాలి్సన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వంతో పూర్తిగా కుమ్మక్కై రాజీ పడింది. 2019 ఎన్నికల వేళ సీఈసీ ఆదేశాలను బేఖాతరు చేసినందుకే అనిల్ చంద్ర పునేఠను కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ పదవి నుంచి తప్పించింది. సీఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నాడు కోర్టు మొట్టికాయలు వేసినా.. రిటైర్డ్ అయిన అదే వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు ఎస్‌ఈసీగా కూర్చోబెట్టారు.
మీరైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
పోలీస్ వ్యవస్థలో డీఐజీలు, డీఎస్పీలు, సీఐలు పూర్తిగా చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తున్నారు. ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్ వంటి కింది స్థాయి సిబ్బందికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. కనీసం మీరైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. అభ్యర్థులను పోటీ చేయనివ్వక పోవడం, ఓటర్లను ఓటు వేయనివ్వక పోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని మన చేతులతో మనమే ఖూనీ చేయడమే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోలీసులు, చిన్న స్థాయి ఉద్యోగులు, ప్రజలంతా గట్టిగా తిరగబడాలి.
బాధితులపైనే తప్పుడు కేసులు
నామినేషన్లు వేయకుండా ఆర్వో కార్యాలయాల్లోకే వందల సంఖ్యలో టీడీపీ గూండాలను మారణాయుధాలతో అనుమతిస్తున్నారు. టీడీపీ మూకలను ఆఫీసుల్లో వదిలేసి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కేవలం 1+3 మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఆర్వో కార్యాలయాల్లోకి ధైర్యంగా వెళ్లిన మా అభ్యర్థుల చేతుల్లోంచి నామినేషన్ పత్రాలు లాక్కుని చించేస్తున్నారు. వాళ్లే అరాచకాలు, తప్పులు చేస్తూ.. వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పులివెందులలో 40 వార్డులకు గాను తొలిరోజు 21 చోట్ల మాత్రమే నామినేషన్లు వేయగలిగాం. మిగిలిన 19 చోట్ల నామినేషన్లే వేయనివ్వలేదు. పులివెందులలో డీఎస్పీ, సీఐలపై హత్యాయత్నం చేశారంటూ మా వారిపై సెక్షన్ 307 కింద అక్రమ కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ‘50 ప్లస్ అని. 500 మంది అదర్స్’ అని పెట్టి.. నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులందరినీ జైలుకు పంపాలని చూస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయ్యేలోపు వైఎస్సార్‌సీపీ తరఫున ఎవరూ లేకుండా అందరినీ అరెస్ట్ చేయాలనేదే వీరి కుట్ర.
రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు
నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ చేయాలి. లేదా కలెక్టరేట్లు, ఎస్‌ఈసీ ఆఫీసుల్లో సెంట్రలైజ్ చేసి స్వీకరించాలి. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పారా మిలిటరీ, కేంద్ర బలగాలను రప్పించాలి. పోలింగ్ బూత్‌ల లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి లైవ్ ఫుటేజీని ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. బ్యాలెట్ బాక్సులు ట్యాంపరింగ్ కాకుండా స్ట్రాంగ్ రూమ్‌లలో సీసీ కెమెరాలు పెట్టి లైవ్ పర్యవేక్షణ కల్పించాలి. కౌంటింగ్ హాల్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఫారం–17సి పై ఏజెంట్ల సంతకాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
అధికారం చేతిలో ఉందని విర్రవీగితే కుదరదు. దేవుడు చూస్తున్నాడు.. ప్రజలు గమనిస్తున్నారు.. కచ్చితంగా మొట్టికాయలు వేస్తారు. ఈరోజు వాళ్ల సమయం కాబట్టి దాడులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తారు. 2029లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది’ అని వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్‌తో పాటు గవర్నర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, శాసన మండలి డిప్యూటి ఛైర్మన్ తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, కల్పలత రెడ్డి, రుహుల్లా, డాక్టర్ మధుసూదన్, మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు ఉన్నారు.
⇒ ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడికి సంబంధించిన ఫొటోలను గవర్నర్‌కు చూపించాం. బాధ్యతాయుతమైన హైకోర్టు సైతం ఈ దారుణాలపై జోక్యం చేసుకోకుండా చూసీచూడనట్లు వదిలేయడం అత్యంత బాధాకరం. ప్రజాస్వామ్యం ఇంత దారుణంగా దిగజారిపోయి న్యాయం జరగనప్పుడే సమాజంలో నక్సలిజం పుడుతుంది. కాక్రోచ్‌లు వస్తాయి. ఎన్నికల అరాచకాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. న్యాయస్థానంలో కచ్చితంగా పిటిషన్లు దాఖలు చేస్తాం.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
గవర్నర్‌కు పూర్తిగా వివరించాం
ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎంపీ అవినాష్ రెడ్డిలపై జరిగిన దాడులు, దౌర్జన్యాల వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. సీఆర్‌పీఎఫ్ బలగాల సమక్షంలోనే ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి చేసి కార్లను బోల్తా కొట్టించారు. బోల్తా పడిన కారులో మద్యం సీసాలు నిటారుగా నిలబడేలా పెట్టి పోలీసులు తప్పుడు సాక్ష్యాలు సృష్టించిన ఫొటోలను గవర్నర్‌కు చూపించాం. బాధ్యతాయుతమైన హైకోర్టు సైతం ఈ దారుణాలపై జోక్యం చేసుకోకుండా చూసీచూడనట్లు వదిలేయడం అత్యంత బాధాకరం. ప్రజాస్వామ్యం ఇంత దారుణంగా దిగజారిపోయి న్యాయం జరగనప్పుడే సమాజంలో నక్సలిజం పుడుతుంది. కాక్రోచ్‌లు వస్తాయి. ఎన్నికల అరాచకాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. కచ్చితంగా పిటిషన్లు దాఖలు చేస్తాం.


