అరాచకాలు సాగిస్తున్న టీడీపీ గూండాలకు, అధికారులకు వైఎస్ జగన్ హెచ్చరిక
చట్టం ముందు దోషులుగా నిలబెడతాం
టైమ్ మీది నడుస్తుండవచ్చు కానీ మా టైమ్ కూడా వస్తుంది
ఇప్పటికైనా న్యాయం, ధర్మం వైపు గట్టిగా నిలబడమని చెబుతున్నా
ఖాకీ తూటాలకు, గూండాల దాడులకు భయపడని వైఎస్సార్‌సీపీ కార్యర్తలందరికీ సెల్యూట్ చేస్తున్నా
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు సాగిస్తున్న ఈ అప్రజాస్వామిక పాలన, ఈ మోసపూరిత, అబద్ధాల పాలన ఎంతో కాలం నిలబడదు. చూస్తుండగానే దాదాపు మూడేళ్లు. కళ్లు మూసుకుని తెరిచేలోగా మరో రెండేళ్లు. కానీ, ఇప్పుడు చంద్రబాబు నాటే ఈ విష విత్తనాలు రేపొద్దున చెట్లు అవుతాయి. ఎవరెవరైతే ఇప్పుడు తప్పు చేస్తున్నారో.. అన్నీ పక్కా సాక్ష్యాలున్నాయి కాబట్టి, చట్టం ముందర వాళ్లందరినీ దోషులుగా నిలబెట్టే పరిస్థితి త్వరలోనే వస్తుంది.’’అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఏదో ఇప్పుడు మేము చేసేస్తున్నాం కదా అని అనుకుంటున్నారేమో. ప్రతి అధికారికీ నేను చెబుతున్నా. అన్యాయం చేసిన ప్రతి అధికారికీ చెబుతున్నా. అన్యాయం చేస్తున్న ప్రతి వెన్నుపోటు పార్టీ నాయకుడికి చెబుతున్నా. టైమ్ మీది నడుస్తుండవచ్చు. కానీ మా టైమ్ కూడా వస్తుంది. మా టైమ్ వచి్చనప్పుడు మీరు చేసిన ఈ అక్రమాలే మీకు తిరిగి చుట్టుకుంటాయి.’’ అని జగన్ హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష పడేటట్లు చేస్తాం
‘ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గనుక ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు తీసుకోకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్తలు నేను చెప్పినా వినరు. మీరు చేసే ఈ తప్పుడు పనులను గుర్తు పెట్టుకోమని చంద్రబాబుని హెచ్చరిస్తున్నా. తప్పుడు సాంప్రదాయాలను, తప్పుడు పద్ధతులను ప్రోత్సహించకండి అని గట్టిగా హెచ్చరిస్తున్నాను. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ చట్టం ముందు నిలబడతారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఉన్నా పిలిపించి శిక్ష పడేటట్లు చేస్తాం. ఇది మాత్రం నేను గట్టిగా చెప్తా ఉన్నా.
ఇప్పటికైనా సర్దుకోండి. ఇప్పటికైనా న్యాయం, ధర్మం వైపు గట్టిగా నిలబడమని చెబుతున్నా. ఎస్‌ఈసీకి మరీ ముఖ్యంగా చెప్తున్నా. చంద్రబాబునాయుడు కాదు మీకు పదవి ఇచ్చింది. ఎస్‌ఈసీ అన్న వ్యవస్థకు ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడే కార్యక్రమం ఎస్‌ఈసీ చేయకపోతే, ఆ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం పోతుంది. పోలీసులందరికీ నేను చెబుతున్నా. చంద్రబాబు కాదు మీకు జీతాలు ఇచ్చేది. మీ నెత్తిన ఉన్న ముూడు సింహాలు ఆయనకు శాల్యూట్ చేయడానికి కాదు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి శాల్యూట్ చేయడానికి. అందుకే ప్రతి పోలీసుకూ చెబుతున్నా. ఇలాంటి అక్రమాలు, తప్పులు చేయకండి.
ఇది ఆరంభం మాత్రమే
నామినేషన్లు వేసిన ప్రతిచోటా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది. ప్రజల తరఫున గట్టిగా నిలబడే కార్యక్రమం కూడా చేస్తుంది. ఈ ఎన్నికల్లో ఇది కేవలం ఆరంభం మాత్రమే. 2029 జనరల్ ఎలక్షన్స్ అన్నది ఫినిషింగ్ లైన్. మీరు చేసే ప్రతి తప్పు ఆ ఫినిషింగ్ లైన్‌లో మాకు ఇంకా విజయానికి దగ్గరగా తీసుకెళ్లేలా చేస్తుంది. మా కార్యకర్తల్లో ప్రతి ఒక్కరిలోనూ కసి పెరుగుతుంది. ఆ కసి చంద్రబాబు ప్రభుత్వాన్ని రేపు పొద్దున గద్దె దించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని గట్టిగా చెబుతున్నా. ప్రజల సమక్షంలో ప్రజలకు మంచి చేసి, ప్రజల ఓట్లు అడగాలే తప్ప, ప్రజలను భయపెట్టి, అబద్ధాలతోనూ, మోసాలతోనూ ఈ మాదిరిగా అధికారాన్ని చెలాయించడం అన్నది ధర్మం కాదని మరొకసారి గట్టిగా మీ అందరి ద్వారా చంద్రబాబుకు
తెలియజేస్తున్నా.
వారందరికీ నా శాల్యూట్... హ్యాట్సాఫ్
నేను ఇవాళ ఒకటే మాట చెబుతున్నాను. నామినేషన్ల గడువు (మ. 3 గం.) ముగిసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పరిస్థితుల్లో.. సాక్షాత్తు ప్రభుత్వం, ఎస్‌ఈసీ, పోలీసులు అన్ని వ్యవస్థలు ఒక్కటై అధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే.. ప్రజల తరఫున, ప్రజల గొంతుకై వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. ప్రజలు, పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా నిలబడుతుంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్యబద్ధంగా, గట్టిగా చంద్రబాబు వెన్నుపోటు పార్టీని ఎదుర్కొనే కార్యక్రమం చేస్తుంది. ఇంతవరకు ఇన్ని కష్టాలను ఓర్చి నిలబడ్డ ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు, చంద్రబాబు తుపాకీ తూటాలకు వెరవకుండా, పోలీసుల లాఠీలకు భయపడకుండా, చంద్రబాబు గూండాల దాడికి బెదరకుండా, వెన్ను చూపకుండా ఎదురొడ్డి నిలిచిన ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు, ప్రతి ప్రజాస్వామ్యవాదికి శాల్యూట్ చేస్తున్నాను. హ్యాట్సాఫ్ చెబుతున్నాను.
వ్యవస్థల్లో మార్పు రావాలి
2024 ఎన్నికల్లోనూ ఫలితాలు తారుమారయ్యాయి. దాన్ని నేను ఆనాడే ప్రస్తావించాను. కోర్టులకూ కొందరు వెళ్లారు. కానీ వ్యవస్థలో మార్పులు రానంత కాలం మనం ఏమీ చేయలేం. ఎస్‌ఈసీ, సీఈసీని అధికార పార్టీ నామినేట్ చేయడం సరికాదు. ఇంతకు ముందు కేంద్రంలో ఇలా అధికార పార్టీనే నామినేట్ చేసే ప్రక్రియకు వైఎస్సార్‌సీపీ అప్పట్లో మద్దతిచి్చంది. అందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాం. ఎందుకంటే ఇలా అధికారంలో ఉన్న ప్రభుత్వమే ఎస్‌ఈసీ, సీఈసీలను నియమిస్తే అది విద్యార్థులే ఎగ్జామినర్‌ను నియమించినట్లుగా ఉంటుంది.
సీఈసీ, ఎస్‌ఈసీ నియామక విధానం మారాలి
సీఈసీ ఎంపిక విధానం ఇప్పుడున్నది సరికాదు. ఆ మేరకు సీఈసీ. ఎస్‌ఈసీ నియామకాల్లో మార్పులు రావాలి. అందుకు ఒక న్యూట్రల్ బాడీ మళ్ళీ రావాలి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్, సీజేఐ (సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి), ప్రధాని ముగ్గురూ కలిసి ఓటు హక్కు వినియోగించి ఎన్నుకోవాలి. అప్పుడు సీజేఐ ఆ కమిటీలో ఉంటారు కాబట్టి అది ఒక న్యూట్రల్ బాడీ కింద కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో కూడా అదే సంస్కరణ రావాలి. ఎస్‌ఈసీని సీఎం లేదా అధికార పార్టీ నియమించకూడదు. ఇక్కడా న్యూట్రల్ వ్యవస్థ రావాలి. అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్, హైకోర్టు చీఫ్ జస్టిస్, ముఖ్యమంత్రి ముగ్గురూ కలిసి అపాయింట్ చేసే పరిస్థితి రావాలి. ఈ మార్పులు వస్తే.. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.


