ఓటమి భయంతో ప్రజాస్వామ్యానికి పాతరేసిన చంద్రబాబు
ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదు.. స్వేచ్ఛగా నిర్వహించే సత్తా లేదు
బాబు తొత్తులుగా పోలీసులు.. ఎక్స్టెన్షన్ సంస్థగా తయారైన ఎస్ఈసీ
నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం ఎక్కడైనా చూశామా?
నామినేషన్ కేంద్రాల్లో వేలమంది గూండాలు.. పోలీసులేం చేస్తున్నట్లు?
మున్సిపల్ ఎన్నికల అరాచకాలు, దురాగతాలపై వైఎస్ జగన్ ఫైర్
రిటర్నింగ్ అధికారులే నామినేషన్ పత్రాలు తీసుకోవడం లేదంటే.. దాడులకు వాళ్లే అవకాశాలు కల్పిస్తున్నారంటే.. దానికి పోలీసులు కాపలా కాస్తున్నారంటే.. ఇవన్నీ
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి తెలిసినా స్పందించడం లేదంటే.. డీజీపీ, హోం సెక్రటరీ ఇద్దరూ నిద్ర పోతున్నారంటే.. ఇక రాష్ట్రంలో రాజ్యాంగం ఉన్నట్టా, లేనట్టా?
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎంత కుట్రపూరితంగా జరుగుతున్నాయనేది చూస్తే.. అడ్డగోలుగా వార్డులు విభజించారు. ఇష్టానుసారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. అవి వెల్లడించిన రెండో రోజే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ. అందుకు కేవలం మూడు రోజులు మాత్రమే ఇచ్చారు. అభ్యర్థులను వెతుక్కోవాలి. అధికార పార్టీకి రిజర్వేషన్ల గురించి ముందే తెలుసు కాబట్టి, ముందే సిద్ధమయ్యారు. ప్రతిపక్షానికి ఆ అవకాశం లేదు. అయినా విపక్షం సిద్ధమైతే, నామినేషన్లు వేయనీయ లేదు.
సాక్షి, అమరావతి: ‘రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో అధర్మ చరిత్ర, రక్తచరిత్ర రాస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే యథేచ్ఛగా అరాచకాలు సాగిస్తున్నాడు.. దురాగతాలకు పాల్పడుతున్నాడు.’’ అని మాజీ ముఖ్య మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘స్థానిక ఎన్నికల నిర్ణయం నుంచే కుట్రలు మొదలయ్యాయి. ఏకపక్షంగా వార్డుల విభజన, రిజర్వేషన్లు ఖరారు చేశారు. నామినేషన్ల పర్వంలో మూడ్రోజులు యథేచ్చగా అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలు చించేశారు. అభ్యర్థులపై అక్రమంగా కేసులు, అరెస్టులు, బైండోవర్లతో పోలీసులు భయపెట్టారు. అడ్డుకోవాల్సిన పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డిపై పుంగనూరులో హత్యాయత్నం. పులివెందులలో పోలీసుల బాష్పవాయు ప్రయోగం. గాలిలోకి కాల్పులు. నారాసుర రక్తచరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
ఎస్ఈసీ ఇకనైనా తమ పద్ధతి మార్చుకోవాలి.. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి.. ఏకపక్ష వైఖరి సరికాదంటూ హితవు పలికారు. ‘ఈ వ్యవస్థల్లో మార్పులు రావాలి.. సీఈసీ. ఎస్ఈసీ ఎంపిక విధానం మారాలి. ఏకపక్షనియామకాలు జరగకూడదు. సీజేఐ(సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి) విపక్షనేత, ప్ర«ధాని కలిసి సీఈసీని నియమించాలి. హైకోర్టు సీజే, సీఎం, విపక్షనేత కలిసి ఎస్ఈసీని నిర్ణయించాలి..అప్పుడే ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుంది. ఈ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. పురపాలక ఎన్నికల నామినేషన్లపర్వంలో శుక్రవారం, శనివారం వెన్నుపోటుపార్టీ సాగించిన దురాగతాలు.. పోలీసుల ఆకృత్యాలు.. ఎస్ఈసీ బాధ్యతారాహిత్యాన్ని వీడియోలు, ఆడియోలు.. ఫోటోలు వంటి సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
రాష్ట్రంలో అధర్మ చరిత్ర, రక్తచరిత్ర
రాష్ట్రంలో అధర్మ చరిత్ర, రక్తచరిత్ర కొనసాగుతోంది. దాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు రాస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న సీఎం చంద్రబాబు యథేచ్ఛగా అక్రమాలు, ఉల్లంఘనలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నప్పటి నుంచే కుట్రలు అమలు చేస్తున్నారు. ఆ దిశలోనే ఏకపక్షంగా వార్డుల విభజన. రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆ తర్వాత ఒకేరోజులో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.
నామినేషన్లకు కేవలం మూడు రోజులే గడువు ఇచ్చారు. నామినేషన్ల పర్వంలో వరసగా మూడ్రోజులుగా అరాచకాలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. అభ్యర్థులపై అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేస్తున్న పోలీసులు.. బైండోవర్లతోనూ భయపెట్టాలని చూస్తున్నారు. అయితే ఎక్కడా వెనక్కి తగ్గబోమని, గట్టిగా నిలబడతామని, ప్రజల పక్షాన నిలబడతామని, వారికి అండగా ఉంటామని చెబుతున్నాం.
ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?
అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. రాజ్యాంగబద్ధమైన పాలనలో ఉన్నామా? అనిపిస్తోంది. చట్టం, న్యాయం ఎక్కడైనా మచ్చుకు కనిపిస్తుందా? ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి, నామినేషన్ కేంద్రాలకు వెళ్తే, వాటిని వేయనీయకుండా అడ్డు తగలడం, టీడీపీ మూకలు ముందుగానే అక్కడే ఉండడం, పోలీసులు వారికి సహకరించడం, చివరకు అధికారులు కూడా నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి నిరాకరించడం.. గతంలో ఎప్పుడూ చూడలేదు.
ఇది కేవలం వెన్నుపోటు పార్టీ నాయకుడు, గొడ్డళ్లు సరఫరా చేసే నాయకుడు చంద్రబాబు హయాంలో మాత్రమే సాధ్యం. అలా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఈ అధర్మ చరిత్ర, రక్త చరిత్ర రాస్తున్నాడు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా అనుకూల పరిస్థితి లేకపోతే, అసలు నామినేషన్లు వేయకుండా అడ్డు తగిలితే, ప్రభుత్వమే స్వయంగా దీన్ని ప్రోత్సహిస్తే.. ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్) అనేది కేవలం చంద్రబాబుగారి ఎక్స్టెన్షన్ గవర్నమెంట్ సంస్థగా ఉంటే, అసలు ప్రజాస్వామ్యమనేది ఉంటుందా?
స్థానిక ఎన్నికల ప్రక్రియ అంతా కుట్రపూరితం
రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఎంత కుట్రపూరితంగా జరుగుతున్నాయనేది చూస్తే.. అడ్డగోలుగా వార్డులు విభజించారు. ఇష్టానుసారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. అవి వెల్లడించిన రెండో రోజే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ. అందుకు కేవలం మూడు రోజులు మాత్రమే ఇచ్చారు. అభ్యర్థులను వెతుక్కోవాలి. అధికార పార్టీకి రిజర్వేషన్ల గురించి ముందే తెలుసు కాబట్టి, ముందే సిద్ధమయ్యారు. ప్రతిపక్షానికి ఆ అవకాశం లేదు. అయినా విపక్షం సిద్ధమైతే, నామినేషన్లు వేయనీయ లేదు. ఈ సందర్భంగా చంద్రబాబుని సూటిగా ఒకటే అడుగుతున్నాను.
మీకు నిజంగా ప్రజల మద్దతు ఉందని భావిస్తే, నామినేషన్లు ఎందుకు వేయనీయడం లేదు? ఎందుకు హత్యాయత్నాలు చేస్తున్నారు? పోలీసులతో అభ్యర్థులను ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? ఎందుకు దొంగ కేసులు పెడుతున్నారు? ఎందుకు మా పార్టీ వారిపై దాడి చేస్తున్నారు? నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు వెళ్తే, వారికి తోడుగా నిలబడి సహకరించాల్సింది పోయి, పోలీసులు వారిపై కాల్పులు జరపడం, లాఠీఛార్జ్ చేయడం ఏమిటి? ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడైనా చూశామా? అధికారులు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తీసుకోకపోవడం.. అందరి సమక్షంలో నామినేషన్ పత్రాలు లాక్కోవడం.. చించేయడం గతంలో ఏనాడైనా జరిగిందా? అసలు స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నప్పటి నుంచే, చంద్రబాబు కుట్రలు మొదలయ్యాయి. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ద్వారా రాష్ట్రంలో 46 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని తేల్చారు. ఓటర్ల తుది జాబితా వస్తుందని తెలుసు. అయినా అది రాక ముందే, చెల్లని ఆ ఓట్లతో ఎన్నికలకు పోవడంతోనే కుట్ర మొదలైంది.
ఇష్టానుసారంగా మార్పులు.. చేర్పులు
ఇష్టానుసారంగా డివిజన్లు విభజించారు. విశాఖపట్నం చూస్తే కొన్ని వార్డుల్లో కేవలం 5 వేల ఓట్లు ఉంటే, మరి కొన్నింటిలో 30 వేల ఓట్లు ఉన్నాయి. పూర్తిగా వారికి అనుకూలంగా డివిజన్లలో మార్పులు, చేర్పులు చేశారు. వైఎస్సార్సీపీ ఓటర్లు ఎక్కువగా ఉన్న వార్డులను చీల్చారు. ఓటరు ఉన్న చోట ఉన్న పోలింగ్ కేంద్రంలో కాక మరో కేంద్రానికి ఆ ఓటు మార్చారు. దూరంగా ఉండే ఇంకొక పోలింగ్ కేంద్రానికి వెళ్లేటట్టుగా చేశారు. ఇష్టానుసారంగా వాళ్లకు అనుకూలంగా రిజర్వేషన్ తీసుకొచ్చారు. వాళ్ళకి కావాల్సిన చోట వాళ్ళకి కావాల్సిన విధంగా రిజర్వేషన్ ఖరారు చేసుకున్నారు.
టెంటు సామాన్లు సరఫరా చేసినట్టుగా అభ్యర్థుల సరఫరా..
ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం చేసినా కూడా ఎన్నికలను సజావుగా నిర్వహించే ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకే పోలీసులను అడ్డు పెట్టుకొని బైండోవర్ పేరుతో అభ్యర్థులను పిలుస్తున్నారు. దొంగ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇంకా ఈ ఎన్నికల్లో కూడా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో తన భాగస్వామ్య పార్టీలకు చంద్రబాబే తన పార్టీ నుంచి టెంట్ సామాన్లు సరఫరా చేసినట్టుగా, తన పార్టీకి చెందిన వారిని ఆ పార్టీలోకి పంపి, అక్కడ వారి పేరుతో టికెట్లు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగితే, గెలుస్తామన్న ధైర్యం చంద్రబాబుకు లేదు.
అందుకే చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర రాస్తూ స్థానిక ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వమే హింసకు పాల్పడేలా చేస్తున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెల్చేందుకు అక్రమాలు, కుట్రలకు తెగబడుతున్నాడు. సాధారణంగా ఏ పోలీస్ అధికారినైనా రెండేళ్ల తర్వాత బదిలీ చేస్తారు. కానీ, కొందరిని చంద్రబాబు ఏళ్ల తరబడి అలాగే కొనసాగిస్తున్నాడు. అలా పైస్థాయి నుంచి కింది వరకు ఒక సిండికేట్‌గా వారిని తయారు చేశాడు. ఇసుక మొదలు మద్యం వరకు అంతా మాఫియాయే. ప్రతి చోటా దోపిడీ. చినబాబుకు ఇంత. పెదబాబుకు ఇంత. ఎమ్మెల్యేకు ఇంత అని దోచుకుంటున్నారు. చివరకు ఎన్నికలప్పుడు కూడా వారినే కొనసాగించి, మాఫియా రాజ్యం ఏలుతున్నారు.
వందలాది మంది మారణాయుధాలతో గుమిగూడినా పట్టించుకోరా?
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. నామినేషన్ సెంటర్ దగ్గర వందలాది వెన్నుపోటు పార్టీ గూండాలు మారణాయుధాలతో గుమిగూడినా పోలీసులు ఏమి చేయడం లేదు. అస్సలు పట్టించుకోరు. ఇదంతా కళ్ళ ముందే కనిపిస్తోంది. నామినేషన్ వేసేటప్పుడు ఆ సెంటర్లోకి అభ్యర్థితో సహా, కేవలం నలుగురికి మాత్రమే అనుమతి ఇస్తారు. కానీ, ఆ నామినేషన్ సెంటర్లలో వెన్నుపోటు పార్టీ వారు వందల మంది మారణాయుధాలతో గుమి గూడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మరోవైపు నిబంధనల ప్రకారం మా పార్టీ వారు నలుగురితో వెళ్ళినా పోలీసులు ఒప్పుకోవడం లేదు.
తీరా కష్టపడి నామినేషన్ సెంటర్‌కు వెళ్తే వెంటనే వెన్నుపోటు పార్టీ వాళ్ళు మా వాళ్ళ మీద పడి దాడులు చేసి నామినేషన్ పత్రాలను లాక్కుంటున్నారు. చించేస్తున్నారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా పోలీసులు ఏమీ చేయరు. పైగా వారికి సహకరిస్తారు. ఎలాగోలా రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) రూమ్ వరకు వెళ్లి నామినేషన్ పత్రాలు ఇస్తే అక్కడకు కూడా వెన్నుపోటు పార్టీ రౌడీలు వెళ్ళిపోయి అధికారుల చేతుల్లో నుంచి ఆ పత్రాలు లాగేసుకుంటున్నా పోలీసులు మాత్రం మాట్లాడరు.
డీజీపీ, హోం సెక్రటరీ నిద్రపోతున్నారు
చంద్రబాబును సూటిగా అడుగుతున్నా. మా పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్తే, పోలీసులు ఫైర్ చేయడం ఏమిటి? మా అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, అలా వ్యవహరించడం ఏమిటి? నామినేషన్ వేయడానికి వెళ్లిన అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం. ఫైర్ చేయడం గతంలో ఎక్కడైనా ఇలా చూశామా? ఏకంగా రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ)లే నామినేషన్ పత్రాలు తీసుకోవడం లేదంటే.. దాడులకు వాళ్లే అవకాశాలు కల్పిస్తున్నారంటే.. దానికి పోలీసులు కాపలా కాస్తున్నారంటే.. ఇవన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కి తెలిసినా స్పందించడం లేదంటే.. డీజీపీ, హోం సెక్రటరీ ఇద్దరూ నిద్ర పోతున్నారంటే.. ఇక రాష్ట్రంలో రాజ్యాంగం ఉన్నట్టా, లేనట్టా?. ఒకసారి గమనించమని కోరుతున్నాను.
చరిత్రలో ఎవరూ చూడని మార్పులు తీసుకొచ్చాం
అలాంటి ఎస్ఈసీ ఉన్నప్పుడు కూడా వైఎస్సార్సీపీ ఆ విజయం ఎందుకు సాధించిందంటే, మ్యానిఫెస్టోలో మా పార్టీ చెప్పిన వాటిలో, ఆ ఎన్నికల నాటికే 95 శాతం అమలు చేసింది. రాష్ట్రంలో ఎవరూ చూడని మార్పులు తీసుకొని రాగలిగాం. గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థ. ప్రతి 60–70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. ప్రతి పథకమూ పారదర్శకంగా అమలు. లంచానికి అవకాశం లేకుండా, వివక్షకు తావు లేకుండా ఇంటి గడప వద్దే పథకాలు అందించాం.
ఇంకా ఎప్పుడూ ఎవరూ చూడని విధంగా స్కూళ్లు మారాయి. ప్రైవేట్ స్కూళ్లు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడూ చూడని విధంగా వైద్య, విద్య రంగాల్లో మార్పులు. గ్రామాల్లోని విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీల రూపురేఖలు మారాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చింది. నాడు–నేడుతో హాస్పిటళ్ల రూపురేఖలు మారాయి. విద్య, వైద్యం, వ్యవసాయం. పారదర్శక ప్రభుత్వం. పాలనలో పూర్తి పారదర్శకత. అలా ఎవరూ చూడని విధంగా మార్పులు జరిగాయి. కాబట్టే వైఎస్సార్సీపీకి ఆ రకమైన తీర్పును ప్రజలు ఇచ్చారు.
అమ్మ ఒడి మొదలు..ఇళ్ల నిర్మాణం వరకు
మరొక వైపు అమ్మఒడి, విద్యాకానుక, రైతు భరోసా, రైతులకు సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా, వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, సున్నావడ్డీ, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, లా నేస్తం, చేదోడు, తోడు, పెన్షన్ కానుక, వైఎస్సార్ విద్యా దీవెన, వసతి దీవెన ఇలా చెప్పు కుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించాం. వాటిన్నింటితో పాటు, నా అక్క చెల్లెమ్మలందరికీ ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇచ్చేకార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చరిత్రలో చూడని విధంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చాం, ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. కాబట్టే ఆరోజు ఆ ఫలితాలు వచ్చాయి.
శాప్ ఛైర్మన్ బహిరంగంగా మాట్లాడినా!
అదే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) ఉన్న నామినేషన్ కేంద్రం వద్ద.. శాప్ ఛైర్మన్ రవినాయుడు (డీఎస్సీ స్కామ్‌లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి) వాహనం ఎక్కి, పోలీసుల మైక్ తీసుకుని, దాడులు చేస్తామని మాట్లాడుతున్నా.. పోలీసులు చూస్తూ ఊర్కున్నారు. (అంటూ ఆ వీడియో పీపీటీలో చూపారు)అది నామినేషన్ కేంద్రం. అయినా అక్కడ ఆయన అలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, వందల మంది గుమికూడినా పోలీసులు పట్టించుకోలేదు.
నాడు చంద్రబాబు మద్దతుదారుడైన నిమ్మగడ్డ నేతృత్వంలో స్థానిక ఎన్నికలు
గతంలో మా హయాంలోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించాం. అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) ఎవరో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ వెన్నుపోటు పార్టీకి కరుడగట్టిన తీవ్రవాదిలా అత్యంత సానుభూతిపరుడు. 2024 ఎన్నికల్లో మీరు గమనిస్తే ఆయన వెన్నుపోటు పార్టీ కోసం కాళ్లకు బలపం కట్టుకుని మరీ తిరిగాడు. అటువంటి సానుభూతిపరుడు ఎస్ఈసీగా ఉండగా, ఆయన ఆధ్వర్యంలో మేము స్థానిక ఎన్నికలు నిర్వహించాము. అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగానే, మొత్తం అధికారం తన చేతుల్లోకి వచ్చేసిందన్నట్టుగా వరుస పెట్టి చిత్తూరు, గుంటూరు కలెక్టర్లను జీవీఎంసీ కమిషనర్‌ను బదిలీ చేశారు.
తిరుపతి ఎస్పీతో పాటు పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలు, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. ఇంకా చిత్తూరు జిల్లాలో ఎంపీడీఓలను మూకుమ్మడిగా బదిలీ చేశారు. అలా ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినా.. ఆరోజు వైఎస్సార్సీపీ గెలుపు చూస్తే..13 మున్సిపల్ కార్పొరేషన్లకు 13 వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే 100 శాతం విజయఢంకా మోగించింది. ఆ కార్పొరేషన్ల పరిధిలో 724 డివిజన్లు ఉంటే వాటిలో 616 డివిజన్లు వైఎస్సార్సీపీ గెలుచుకుంది. అంటే 85% డివిజన్లు.
ఇంకా ఎన్నికలు జరిగిన 86 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. అంటే 98% మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. మొత్తం 2,397 వార్డుల్లో వైఎస్సార్సీపీ 1,939 వార్డులు గెలుచుకుంది, అంటే 81% వార్డులు గెలుచుకుంది. అలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 99 పట్టణ స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీ 97 స్థానిక సంస్థలను గెలుచుకుంది.
నామినేషన్ల పర్వంలో మూడు రోజుల్లో..
పుంగనూరులో మొన్న (శుక్రవారం) ఉదయం మా పార్టీకి చెందిన అభ్యర్థులతో కలిసి, మా ఎంపీ నామినేషన్ సెంటర్‌కు వెళ్తే, టీడీపీ వాళ్ళు నామినేషన్ కేంద్ర పరిధిలోనే దారుణమైన దాడులు చేశారు. మిథున్‌పై హత్యాయత్నం చేశారు. మిథున్‌కు సీఆర్ పీఎఫ్ సెక్యూరిటీ ఉంది. దీంతో వారు గాలిలో కాల్పులు జరిపారు. ఆ ఘటనలో మిథున్ సెక్యూరిటీకి ప్రాణహాని జరిగేంతగా దెబ్బలు తగిలాయి. ఆ తర్వాత ఎలాగోలా ఆర్ఓ కేంద్రానికి చేరుకున్న మిధున్‌రెడ్డి, అక్కడ మూడు గంటలు వేచి చూసినా, ఆ అధికారి (ఆర్వో) నామినేషన్ తీసుకోవడానికి నిరాకరించారు.(అంటూ పుంగనూరులో జరిగిన దాడి ఘటనల వీడియో పీపీటీలో చూపారు).
ఇక్కడ ప్రధానంగా నేను అడుగుతున్నా...
1. అంత మంది టీడీపీ గూండాలు మారణాయుధాలతో అక్కడ గుమిగూడడానికి పోలీసులు ఎలా అనుమతించారు?
2. కార్లను ధ్వంసం చేసిన తర్వాత వాటిలో మద్యం బాటిళ్లు పెట్టారు. కారు తిరగబడినా, ధ్వంసమైనా మద్యం బాటిళ్లు ఎలా నిటారుగా ఉన్నాయి?
3. ఎలాగోలా లోపలికి వెళ్లినా, 3 గంటలు వేచి చూసినా, ఆర్వో నామినేషన్లు ఎందుకు తీసుకోలేదు?
4. మిథున్ మద్యం సేవించడు. ఆయన కారులో మద్యం బాటిళ్లు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. పోలీసులే ఇలా మద్యం బాటిళ్లు పెట్టి, దుష్ప్రచారం చేస్తుంటే ఎలా?
మహిళలపైనా దాడి.. చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి
⇒ అదే పుంగనూరులో వైయస్సార్సీపీ పక్షాన నామినేషన్ వేయడానికి 9వ వార్డు ఎస్ఎం నయాజ్ తన భార్యతో కలిసి వెళ్తే, పోలీసుల సమక్షంలోనే ఆయన్ను కొట్టి నామినేషన్ పత్రాలు లాక్కున్నారు. అయినా పోలీసులు నియంత్రించలేదు. వారికి సహకరించారు. (అంటూ ఆ వీడియో కూడా చూపారు).
⇒ తిరుపతిలో మా పార్టీ మేయర్ అభ్యర్థి వాసూ యాదవ్. నామినేషన్ వేయడానికి వెళ్తే, చంపేస్తామని బెదిరించారు. ఆయన వెంట మా పార్టీ ఎంపీ గురుమూర్తి వెళ్తే, ఆయన్ను కూడా అడ్డుకున్నారు. ఇంకా ఆ పోలీసులే టీడీపీ మూకలు దాడి చేసి, వారి చేతి నుంచి నామినేషన్ పత్రాలు లాక్కునేలా చేశారు.(అంటూ ఆ వీడియో కూడా చూపారు. అందులో ఎంపీ ఎం.గురుమూర్తి వీడియో వాయిస్ కూడా ఉంది).
⇒ మళ్లీ మధ్యాహ్నం కూడా గురుమూర్తి వెళ్తే, అప్పుడు కూడా నామినేషన్ వేయనీయలేదు. చివరకు ఎస్పీని సెక్యూరిటీ కోరినా, ఎస్పీ పట్టించుకోలేదు. (అంటూ, వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో ఎస్పీని వేడుకుంటున్న ఫోటో చూపారు).
⇒ పోలీసులు ఎందుకింతగా వాచ్మెన్లుగా మారారు? ప్రజల కోసం కాకుండా, చంద్రబాబు వేసే బిస్కట్ల కోసం పని చేస్తున్నారు. తిరుపతిలో మా మేయర్ అభ్యర్థి వాసూ యాదవ్, నిన్నటి నుంచి తన అమ్మతో కలిసి కార్పొరేషన్ ఎదురుగా కూర్చుని ఆందోళన చేస్తున్నాడు. వర్షంలో తడిసి కూడా ఆ ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.(అంటూ ఆ వీడియో కూడా చూపారు.
అందులో ఆయన తల్లి మాటల వీడియో ప్రదర్శన).
⇒ మరోవైపు కడప కార్పొరేషన్. ఐదు నామినేషన్ సెంటర్లు కూడా పోలీసుల సహకారంతో టీడీపీ గూండాలు కబ్జా చేశారు. నామినేషన్ వేయడానికి వెళ్తే దాడులు చేశారు. కత్తులతో పొడిచారు. మాజీ కార్పొరేటర్ కుమారుడు మురాద్‌ను అలా కత్తితో పొడిచారు. (అంటూ ఆ వీడియో కూడా పీపీటీలో చూపారు) ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది అందరూ చూడాలి.
మహిళలనూ వదల్లేదు
నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులపై పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారు. చివరకు మహిళలను కూడా వదల్లేదు. మాజీ డిప్యూటీ మేయర్. తన మరదలు నామినేషన్ వేయడానికి తీసుకెళ్తే, ఆయన్ను కత్తితో పొడిచారు. నామినేషన్ వేయడానికి వస్తే, చంపేస్తామని కడప ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి బహిరంగంగా బెదిరించాడు. (అంటూ ఆ వీడియో కూడా చూపారు). ఇన్ని జరుగుతుంటే.. ఏం చర్యలు తీసుకున్నారు? ఎస్ఈసీ ఏం చేస్తోంది? పోలీసుల సమక్షంలోనే అన్నీ జరుగుతున్నాయి? ఎవరిని అరెస్టు చేశారు? అన్నీ పోలీసులు దగ్గరుండి చేయిస్తున్నారు.
బద్వేలులో మా పార్టీ వారు మొన్న వేసిన నామినేషన్లను, నిన్న ఆర్వో ఆఫీసులోకి చొరబడి, వాటిని తీసుకుని చింపేశారు. (అంటూ ఆ వీడియో కూడా చూపారు) ఇది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. వారు దగ్గరుండి సహకరించారు. రాజంపేట మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి. బీసీ మహిళ. ఆమె నామినేషన్ వేసి తిరిగి వస్తుండగా, దారుణంగా ఆమెపై, ఆమె తండ్రిపై దాడి చేశారు.
ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి ఇంటిపైనా దాడి చేశారు. (అంటూ, ఆ వీడియోలు కూడా చూపారు. మేయర్ అభ్యర్థి తండ్రి వీడియో చూపారు). మహిళల మీద కూడా ఇలా దాడి చేయించడానికి చంద్రబాబుకు నిజంగా సిగ్గుందా? ఇదేనా మహిళలకిచ్చే గౌరవం. మహిళలకు ఎప్పుడో కానీ, అవకాశాలు రావు. చంద్రబాబు సిగ్గుతో తలదించు కోవాలి. మరోవైపు దర్శిలో వైయస్సార్సీపీ వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. (అంటూ ఆ వీడియో కూడా చూపారు)
పులివెందులలో పోలీసులే గూండాలుగా మారారు
పులివెందులలో వేరే లెవల్. ఇప్పటిదాకా మనం చూసింది.. టీడీపీ గూండాలకి పోలీసులు సహకరించారు. పులివెందుల దగ్గరకు వచ్చేసరికి, పోలీసులే గుండాల్లా మారారు. నిన్న (శనివారం) ఉదయం నుంచే వైయస్సార్సీపీ వారు నామినేషన్లు వేయకుండా, టీడీపీ గూండాలను మోహరించారు. వారికి పోలీసుల సహకారం ఇచ్చారు. పరిస్థితిని ఎస్పీ, డీఐజీ దృష్టికి ఎంపీ అవినాష్ రెడ్డి వివరిస్తే, మధ్యాహ్నం 1.30 కి వచ్చి, నామినేషన్లు వేసుకోమని చెప్పారు. దాంతో ఆ టైమ్‌కు అవినాష్‌రెడ్డి వెళ్తే, పోలీసులే అడ్డుకున్నారు. లాఠీఛార్జ్ చేయడమే కాకుండా, పోలీసులు స్వయంగా ఏకే–47తో గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులే కార్లు ధ్వంసం చేశారు. పోలీసులే రాళ్లు విసిరారు. (అంటూ ఆ మొత్తం వీడియోలు చూపారు). ఇలా పోలీసులే టీడీపీ గూండాల పాత్ర పోషించారు.
రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం.. దాడులే
⇒ రాయచోటిలో మా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మా పార్టీ ఆఫీస్‌లో ఉండగానే, ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. బయట ఉన్న వాహనాల్ని కూడా తగలబెట్టారు. (అంటూ ఆ మొత్తం వీడియోలు కూడా చూపారు) అక్కడ మా పార్టీ ఛైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్‌పై వరసగా మూడు రోజుల నుంచి దాడి చేస్తున్నారు.
⇒ తిరుపతి కార్పొరేషన్‌కు ఒక్క నామినేషన్ కూడా పడలేదు. కాసేపటి క్రితం మేయర్ అభ్యర్థి అతి కష్టం మీద నామినేషన్ వేయగలిగాడు. రాత్రి నుంచి దీని కోసం ఆయన ఆందోళన చేశాడు. కడప కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉంటే, 10 డివిజన్లలో మాత్రమే నామినేషన్లు పడ్డాయి. పులివెందుల మున్సిపాలిటీలో 40 వార్డులకు 22 వార్డులకు మాత్రమే నామినేషన్లు పడ్డాయి.
⇒ మైదుకూరు మున్సిపాలిటీలో 32 వార్డులకు 4 వార్డుల్లో మాత్రమే నామినేషన్లు వేశారు. బద్వేలు మున్సిపాలిటీలో 40 వార్డుల్లో ఇంకా 14 వార్డులకు నామినేషన్ వేయాలి. నిజానికి అక్కడ మొన్న (శుక్రవారం) వేసిన నామినేషన్ పత్రాలన్నీ చింపేశారు.
⇒ కమలాపురం మున్సిపాలిటీలో చైర్మన్ సహా ఇప్పటివరకు ఒక్క నామినేషన్ వేయలేదు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థితో సహా, ఇప్పటివరకు ఒక్క నామినేషన్ వేయలేదు. జమ్మలమడుగు మున్సిపాలిటీలో 32 వార్డులకు 18 చోట్ల మాత్రమే నామినేషన్లు పడ్డాయి. ఛైర్మన్ అభ్యర్థి నామినేషన్ వేయలేదు. రాజంపేట మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులకు గాను ఈరోజు 7 వార్డుల్లో మాత్రమే నామినేషన్లు పడ్డాయి. చైర్మన్ పదవికి వేసిన నామినేషన్ పత్రాలు చించేశారు.
⇒ రాయచోటి మున్సిపాలిటీలో చైర్మన్ పదవి సహా 44 డివిజన్లకు గాను ఒక్క నామినేషన్ కూడా పడలేదు. పుంగనూరు మున్సిపాలిటీలో చైర్మన్ సహా 36 వార్డుల్లో ఒక్క చోట కూడా నామినేషన్ వేయనీయ లేదు. దర్శి మున్సిపాలిటీలో 28 వార్డులకు మూడు చోట్ల మాత్రమే నామినేషన్ వేయగలిగారు. ఛైర్మన్ అభ్యర్థి ఇంకా నామినేషన్ వేయలేదు.
⇒ గురజాల మున్సిపాలిటీలో చైర్మన్ సహా ఒక్క వార్డుకు నామినేషన్ వేయలేదు. దాచేపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ స్థానానికి సహా ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. పిడుగురాళ్లలో చైర్మన్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. అన్నిచోట్ల ఇదే పరిస్థితి.
⇒ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవీ. పల్నాడు జిల్లా దాచేపల్లిలో మా పార్టీ చైర్మన్ అభ్యర్థి ఇంట్లో తెలంగాణ లిక్కర్‌ను సాక్షాత్తు పోలీసులే పెట్టి, అక్రమ మద్యం అని చెప్పి ఆయనను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. పోలీసులే స్వయంగా పెట్టి ఇదంతా చేశారు.
⇒ పిడుగురాళ్లలో కూడా ఇలాగే అభ్యర్థులను పోలీసులే ఎత్తుకెళ్లారు. హైకోర్టు జోక్యం చేసుకుని వారిని విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి.. మూడు చోట్ల చైర్మన్ అభ్యర్థులను పోలీసుల చేత అరెస్ట్ చేయించారు. ఎన్నికలు సజావుగా జరిగితే ఓటమి తప్పదన్న భయంతోనే చంద్రబాబు ఇవన్నీ చేయిస్తున్నారు.
బాబుకు కరుడుగట్టిన తీవ్రవాది అనిల్ చంద్ర పునేఠ
ప్రజాస్వామ్యబద్ధంగా మేము నామినేషన్లు వేస్తామంటే కనీసం నామినేషన్లు తీసుకోలేని పరిస్థితి లేకుండా చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ ఎవరో తెలుసా మీకు? చంద్రబాబు ఈయనను చీఫ్ సెక్రటరీగా పెట్టుకుంటే 2019 ఎన్నికలు జరిగేటప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ముగ్గురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించమని ఈయన్ని ఆదేశించింది. వారిలో ఓ పోలీసు అధికారి ట్రాన్స్ఫర్ ఆర్డర్‌ను రద్దు చేసి మళ్ళీ పిలిపించుకున్నాడు. దీన్ని అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం తప్పు పడితే, అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు కోర్టును ఆశ్రయించారు.
కోర్టు కూడా దానికి ఒప్పుకోలేదు. దీంతో అప్పుడు సీఈసీ ఆ చీఫ్ సెక్రటరీ (అనిల్ చంద్ర పునేఠ)ని తొలగించింది. అలాంటి అనిల్‌చంద్ర పునేఠ.. చంద్రబాబుకు సపోర్ట్ చేయడంలో అంత కరుడుగట్టిన తీవ్రవాది లాంటి ఈ మనిషి. ఇలాంటి ఆయన్ను, రిటైర్మెంట్ తర్వాత చంద్రబాబు తిరిగి ఎస్ఈసీగా నియమించుకున్నారు. అలాంటి అధికారి నేతృత్వంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. అదే ఆరోజు మేము నిమ్మగడ్డ రమేష్ వంటి చంద్రబాబు లాయల్ అధికారి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే, ఈరోజు చంద్రబాబు తన విశ్వాసపాత్రుడైన అనిల్‌చంద్ర ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపిస్తున్నారు. న్యాయం ఎలా జరుగుతుంది?


