
సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్
రైతన్నలు తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా?
రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా స్పందించరా?
కేంద్రానికి ఓ లేఖ రాసి చేతులు దులుపుకోవడం సమంజసమేనా?
టీడీపీ నేతలు సిండికేట్‌గా మారి రైతులను దోచుకు తింటున్నారు
అమెరికా టారిఫ్ పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి.. ఇప్పటికైనా కళ్లు తెరిచి రొయ్యలకు ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి
కూటమి సర్కారు గద్దెనెక్కాక ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరల్లేవ్
మా హయాంలో కోవిడ్ వేళ ఆక్వా రైతులకు బాసటగా నిలిచాం
రాష్ట్ర చరిత్రలో తొలిసారి రొయ్యలకు ధరలు నిర్ణయించాం
ఆక్వా జోన్ పరిధిలో 54 వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందించాం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే.. ఆ పేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతులను దోచుకు తింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఆక్వా ధరలు రోజు రోజుకూ పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు..?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ‘ప్రభుత్వ స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించి గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?’ అని సూటిగా ప్రశ్నించారు.
‘రైతులంతా గగ్గోలు పెడితే.. మీడియా, వైఎస్సార్‌సీపీ నిలదీస్తే కేంద్రానికి ఓ లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? వంద కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200– 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్ హాలిడే మినహా వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?’ అని సీఎం చంద్రబాబును నిలదీస్తూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే..
⇒ చంద్రబాబూ..! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా.. ఇలా ప్రతి పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. దళారులు రైతుల కష్టాన్ని దోచుకు తింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలను ప్రస్తావిస్తే మీ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది గానీ ఎక్కడా బాధ్యత తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆక్వా విషయంలోనూ అంతే!
⇒ ఎగుమతుల్లోనూ, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వా రంగం దేశంలోనే నంబర్ వన్. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి మా హయాంలో ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాం. ఆక్వా సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించడంతోపాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తెచ్చాం. సిండికేట్‌గా మారి దోపిడీ చేసే విధానాలకు చెక్ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించాం.
దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ సమయంలో 100 కౌంట్‌కు కనీస ధరగా రూ.210 నిర్ణయించి ఆ విపత్తు రోజుల్లో రైతులకు బాసటగా నిలిచాం. మా ప్రభుత్వం అధికారంలో ఉండగా మూడుసార్లు ఫీడ్ ధరలు తగ్గించాం. ఇప్పుడు ఫిష్ ఆయిల్, సోయాబీన్ సహా ముడిసరుకుల దిగుమతులపై సుంకం దాదాపు 15 నుంచి 5 శాతం తగ్గినా ఈ కూటమి ప్రభుత్వంలో ఫీడ్ ధరలు ఒక్క పైసా కూడా తగ్గలేదు. మేం ఏర్పాటు చేసిన నియంత్రణ బోర్డు అందుబాటులో ఉన్నా సరే రేట్లు తగ్గడం లేదు.
⇒ గతంలో చంద్రబాబు హయాంలో ఆక్వాజోన్ పరిధిలో కేవలం 80 – 90 వేల ఎకరాలు మాత్రమే ఉంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 4.22 లక్షల ఎకరాలు ఆ జోన్ పరిధిలోకి తెచ్చాం. ఆక్వా రంగంలో మొత్తం 64 వేల విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో జోన్ పరిధిలో ఉన్న 54 వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందించాం. దీనికోసం రూ.3,640 కోట్లు సబ్సిడీ కింద ఖర్చు చేశాం.
ఆక్వా జోన్లలో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి ఎప్పుడు సమస్య తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కారం చూపించాం. ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థను నాశనం చేయడంతోపాటు అత్యధికంగా ఆర్జిస్తున్న రంగాన్ని దెబ్బ తీస్తున్నారు.
⇒ చంద్రబాబూ..! ఇప్పటికైనా కళ్లు తెరవండి. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి. అమెరికా టారిఫ్‌ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ టారిఫ్‌లు కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు. ఇక ముందు కూడా ఇవి కొనసాగుతాయి కాబట్టి ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం సరికాదు.