రెండు చోట్ల ఎందుకు పోటీచేస్తారు? 

Why compete in two places - Sakshi

ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థి రెండు, మూడుచోట్ల అసెంబ్లీ/లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎందుకు పోటీచేస్తారు? దానివల్ల లాభనష్టాలేంటి? తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఈ అంశం చర్చకొచ్చింది. ఇక్కడ అత్యంత ఆసక్తికర అంశమేమి టంటే ముగ్గురు సీఎం అభ్యర్ధులు రెండేసి చోట్ల పోటీలో ఉండటం, పరస్పరం పోటీ పడుతుండటం. ఇలా గతంలో ఉమ్మడి ఏపీలో ఎన్నడూ జరగలేదు. ఆ మాటకొస్తే ఇతర రాష్ట్రాల్లోనూ చాలా అరుదుగా జరుగుతుంటుంది.

గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండేసి నియోజకవర్గాలకు పోటీచేసే అంశాన్ని నియంత్రించాల ని ప్రతిపాదించారు. దీనివల్ల ఉప ఎన్నికలు జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడి అనవసర వ్యయ భారం పడుతోంద ని భావించేవారు. ఈ ఖర్చును సంబంధిత అభ్యర్థి నుంచి వసూలు చేయాలని కూడా కొందరు వాదించేవారు. 1996కి ముందు మూడుచోట్ల పోటీ చేయడానికీ అవకా శం ఉండేది. అలా కొంతమంది చేశారు కూడా.

ఆ తర్వా త దానిని రెండు నియోజకవర్గాలకు పరిమితం చేశారు. ఇలా రెండేసి చోట్ల పోటీచేసే వారిలో ప్రముఖ నేతలే ఎక్కువ. తమకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి, ఒకచోట పోటీ చేస్తే ఓడిపోతామని అనుమానం వచ్చినా జాగ్రత్తపడటానికి, ఇతరత్రా రాజకీయ కారణాలతోనూ రెండేసి చోట్ల పోటీచేస్తుంటారు. కానీ ఈసారి తెలంగాణలో ఏకంగా ముగ్గురు నేతలు రెండేసి చోట్ల పోటీ చేయడం, పైగా వారు ముగ్గురు ఒకరిపై ఒకరు పోటీ పడటం ఈసారి ప్రత్యేకత అని చెప్పాలి.  
 
కేసీఆర్‌ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయడం తొలిసారి.. 
తెలంగాణ సీఎం కేసీఆర్‌ గజ్వేల్, కామారెడ్డి నియోజక వర్గాల నుంచి రంగంలో దిగారు. గతంలో కేసీఆర్‌ రెండుసార్లు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు పోటీ చేసి రికార్డు సృష్టించారు. కానీ ఇలా రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకేసారి పోటీచేయలేదు. కేసీఆర్‌పై కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగుతుండ గా, గజ్వేల్‌లో బీజేపీ అగ్రనేత, ఒకప్పుడు కేసీఆర్‌ మంత్రివర్గంలో సభ్యుడైన ఈటల రాజేందర్‌ బరిలోకి దిగుతున్నారు. రేవంత్, ఈటల ఇద్దరూ తమ పార్టీల తరపు న ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే పరిగణనలో ఉన్నారు.

కొడంగల్‌ సభలో రేవంత్‌ ఆ విషయం ప్రజలకు తెలియచెప్పగా, ప్రధాని మోదీ పర్యటన సందర్భంలో బీజేపీ గెలిస్తే ఈటలను ముఖ్యమంత్రిని చేస్తామన్నారని వార్త లు వచ్చాయి. దానిని ధ్రువీకరిస్తూ ఈటల బహిరంగంగానే చెప్పేశారు. సాధారణంగా ఈ స్థాయి నేతలు ఇలా ఒకరిపై ఒకరు తలపడరు. ఎందుకంటే వారి రాజకీయ భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ వీరిద్ద రూ తమకు పట్టున్న వేరే నియోజకవర్గాల్లోనూ పోటీలో ఉన్నందున అసెంబ్లీకి ఎన్నికయ్యే అవకాశాన్ని పదిలపరచుకున్నారని భావించవచ్చు.

రేవంత్‌ కొడంగల్‌ నుంచి, ఈటల హుజూరాబాద్‌ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. కేసీఆర్‌ గజ్వేల్, కామారెడ్డిలో పోటీచేయడంలో ఉద్దేశం గజ్వేల్‌లో ఓటమి భయంతోనే అని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నా, అంత ఓడిపోయే పరిస్థితి ఉంద ని చెప్పలేం. నిజంగానే అలా జరిగితే బీఆర్‌ఎస్‌ అధికా రంలోకి రావడం కష్టమవుతుంది.పైగా గతంలో కేసీఆర్‌కు కాస్త పోటీ ఇచ్చిన ఒంటేరు ప్రతాపరెడ్డి ఇప్పుడు కేసీఆర్‌ పక్షానే ఉన్నారు.

రెండో సీటుకు పోటీ చేయడం ద్వారా ఆ పరిసర నియోజకవర్గ ప్రజలపై ప్రభావం చూపే లక్ష్యం కూడా ఉంటుంది. ఉదాహరణకు 1983 శాసనసభ ఎన్నికల్లో కొత్తగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ గుడివాడతో పాటు తిరుపతిలో పోటీచేస్తారన్న సమాచారం రావడంతో ఆ ప్రాంతంలో విపరీత ప్రభా వం చూపి ప్రత్యర్థి కాంగ్రెస్‌ తీవ్రంగా నష్టపోయింది.  
 
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాపై ప్రభావం చూపడానికేనా?  
మూడు దశాబ్దాల తర్వాత తెలుగు నాయకుడొకరు రెండుచోట్ల పోటీ చేయడం అదే మొదలు కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బహుశా కేసీఆర్‌ కూడా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాపై కొంత ప్రభావం చూపడానికి కామారెడ్డి నుంచి కూడా రంగంలో దిగి ఉండొచ్చు. కామారెడ్డిలో ఇంతవరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్‌ తప్పుకుని కేసీఆర్‌కు అవకాశం ఇచ్చారు. సీఎం ఈ సీటును గెలిచాక ఆయనకు అవకాశం ఇస్తారా? లేక తన కుమార్తె కవితకు ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది.

కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ ఈసారి కామారెడ్డిలో విజయం సాధించే పరిస్థితి ఉందన్న వార్తలు వస్తుండేవి. ఎప్పుడైతే కేసీఆర్‌ పోటీ చేస్తారని వార్తలొచ్చాయో సహజంగానే ఆయన విజయావకాశాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఆయనను నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి పంపి, రేవంత్‌రెడ్డి రిస్కు తీసుకుంటున్నారు. తాను పోటీచేయడం ద్వారా కేసీఆర్‌ను కొంతమేర కామారెడ్డికి పరిమితం చేయొచ్చన్న ఆలోచన ఉండొచ్చు.

కానీ కేసీఆర్‌ దానిని పట్టించుకోకుండా ,ఈ నెలాఖరు వరకు దాదాపు 94 నియోజకవర్గాల్లో ప్రచారానికి షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు. రేవంత్‌ నిజానికి గత ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ తదుపరి మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి పోటీచేసి పుంజుకోగలిగారు. తనను గెలిపిస్తే సీఎం చాన్స్‌ ఉంటుందని చెప్పడంతోపాటు స్థానికంగా కొన్ని ఏర్పాట్లు చేసుకుని వివిధ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయాల్సి ఉంటుంది.  
 
రేవంత్‌ తలనొప్పి తెచ్చుకోవడమే... 
రేవంత్‌ కామారెడ్డి నుంచి పోటీచేయడం వల్ల కేసీఆర్‌కు ఎంత ఇబ్బందో తెలియదు గానీ, ఆయన మాత్రం తలనొప్పి తెచ్చుకోవడమే. ఎందుకంటే కేసీఆర్‌పై గెలిస్తే సంచలనమే అవుతుంది. కానీ ఓటమిపాలై అది కూడా భారీ తేడాతో అయితే ప్రతిష్ట దెబ్బతింటుంది. అదే సమయంలో కొడంగల్‌కు ఎక్కువ టైమ్‌ కేటాయించలేకపోతే ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొడంగల్‌లో తనను ఓడించడానికి కుట్ర జరుగుతోందని ఆయనే ఆరోపించారు.

అలాగే ఈటల హుజూరాబాద్‌లో ఆరుసార్లు టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) నుంచి, ఒకసారి బీజేపీ పక్షాన గెలిచారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశాక జరిగిన ఉప ఎన్నికలో భారీ విజయం సాధించడం ఆయనకు ప్రతిష్ట తెచ్చింది. అదే ఊపుతో గజ్వేల్‌ నుంచి కూడా ఆయన రంగంలో దిగారు. ఇక్కడ కేసీఆర్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. అయినా ఒక చాన్స్‌ తీసుకుంటున్నారు. అదే టైమ్‌లో హుజూరాబాద్‌లో తన బేస్‌ను కూడా రక్షించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే రెంటికి చెడ్డ రేవిడి అయ్యే పరిస్థితి వస్తుంది.  
 
ఓడిన ఘట్టాలు 
రెండుచోట్ల పోటీచేసిన నేతలు గతంలో గెలిచిన సందర్భాలతోపాటు ఓడిన ఘట్టాలూ ఉన్నాయి. ఈ విషయంలో ఎన్టీఆర్‌ది ఒక రికార్డు అని చెప్పాలి. ఆయన 1983లో గుడివాడ, తిరుపతి, 1985లో నల్లగొండ, హిందూపూర్, గుడివాడ నుంచి పోటీచేసి చరిత్ర సృష్టించారు. కానీ 1989లో కల్వకుర్తి, హిందూపూర్‌ నుంచి పోటీచేసి కల్వకుర్తిలో ఓడిపోయారు. అప్పుడు పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. 1994లో టెక్కలి, హిందూపూర్‌ నుంచి గెలిచారు. ఆ తర్వాత చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీచేసి తిరుపతిలో మాత్రమే గెలవగలిగారు.

ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి రెండుచోట్లా ఓడిపోయారు. తెలంగాణలో పెండ్యాల రాఘవరావు అనే కమ్యూనిస్టు నేత 1952లో హన్మకొండ, వర్దన్నపేట అసెంబ్లీ సీట్లకు, వరంగల్‌ లోక్‌సభ సీటుకు పోటీచేసి మూడుచోట్లా గెలిచారు. ఆ తర్వాత అసెంబ్లీ సీట్లు వదులుకుని లోక్‌సభను ఎంపిక చేసుకున్నారు. మరోనేత రాంగోపాల్‌ రెడ్డి 1962లో బోధన్, మేడారం నుంచి ఇండిపెండెంట్‌గా ఎన్నికవడం విశేషం. లోక్‌సభకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఎన్నికలో రెండుచోట్ల పోటీచేసిన నేతలు లేరనే చెప్పాలి.

ఏదేమైనా తెలంగాణలో ఈసారి ముగ్గురు సీఎం అభ్యర్ధులు ఎన్నికల గోదాలో దిగడం సంచలనమే. ఒక్కోసారి పెద్ద నేతలు చిన్న నేతల చేతిలో ఓడిపోతుండటం కూడా జరగవచ్చు. ఉదాహరణకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ నాడార్‌ ఎవరికీ పెద్దగా తెలియని శ్రీనివాసన్‌ చేతిలో ఓడిపోయారు. ఇందిరాగాంధీ రాయ్‌బరేలీలో రాజ్‌ నారాయణ అనే చిన్న నేత చేతిలో పరాజయం పాలయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు టి.అంజయ్య ముషీరాబాద్‌లో కార్మిక నేత నాయిని నరసింహారెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత కాలంలో ఆయనకు సీఎం అవకాశం వచ్చినప్పుడు ఏకగ్రీవంగా నెగ్గారు.

ఎన్టీఆర్‌ను చిత్తరంజన్‌ దాస్‌ అనే కాంగ్రెస్‌ నేత కల్వకుర్తిలో ఓడించారు. ప్రఖ్యాత నేతలు ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి వంటివారు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలే. సంజీవరెడ్డి స్వయంగా తన బావమరిది తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇలా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పలు చిత్రాలు కూడా జరుగుతుంటాయి. మరి తెలంగాణలో ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఎవరి భవిష్యత్తు ఎలా మారుతుందో చూద్దాం!  

- కొమ్మినేని శ్రీనివాసరావు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top