టీపీసీసీ కొత్త బాస్​ ఎవరు?.. హైకమాండ్‌ నిర్ణయం ఏంటి? | Who Is The New President Of Tpcc | Sakshi
Sakshi News home page

టీపీసీసీ కొత్త బాస్​ ఎవరు?.. హైకమాండ్‌ నిర్ణయం ఏంటి?

Published Thu, Jun 13 2024 6:07 PM | Last Updated on Thu, Jun 13 2024 6:14 PM

Who Is The New President Of Tpcc

తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగియడం, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి పదవీకాలం కూడా ఈ నెలలో ముగుస్తుండటంతో గాంధీభవన్‌కు కొత్త బాస్ నియామకం అనివార్యమైంది. టీ.పీసీసీ చీఫ్‌ పదవి కోసం చాలా మంది సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏఐసీసీ పెట్టిన నిబంధన వారికి తలనొప్పిగా మారిందట. ఇంతకీ కాంగ్రెస్ హైకమాండ్‌ పీసీసీ చీఫ్ పదవికి పెట్టిన నిబంధన ఏంటి? పీసీసీ చీఫ్‌ పదవి ఆశిస్తున్న నాయకులు ఎవరు?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డిని సీఎం పదవి వరించింది. అయితే లోక్‌సభ ఎన్నికలు కూడా దగ్గర్లోనే ఉండటంతో ఆయన్నే పీసీసీ చీఫ్‌గా కొనసాగించారు. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. అదే సమయంలో రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కూడా ఈ నెల 27తో ముగియబోతోంది.

దీంతో జోడు గుర్రాలపై ఉన్న రేవంత్‌రెడ్డికి పార్టీ బాధ్యతల నుంచి విముక్తి కలిగించి, ఆయన పూర్తిగా పాలన మీదే దృష్టి సారించేలా చూడాలని పార్టీ నాయకత్వం నిర్ణయిచింది. అందుకే ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయగలిగే నేతను పీసీసీ చీఫ్‌గా నియమించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. 

పీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో విస్తృతంగా జరుగుతోంది. గాంధీభవన్‌ బాస్‌గా హై కమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారట. పార్టీని ప్రతిపక్షం నుంచి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్ఠానం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే నేతలందరినీ కలుపుకొని వెళ్ళగలరు అనే దానిపై హై కమాండ్ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అనేక పలువురు సీనియర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

పీసీసీ చీఫ్ పదవిపై చాలా మంది సీనియర్‌ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలారోజుల నుండి అడుగుతున్నారు. ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఇద్దరు కుమారులకు సీట్లు ఇప్పించుకుని గెలిపించుకున్న సీనియర్ నేత జానారెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోరుతున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పదవి కావాలని హైకమాండ్ ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వరనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్‌టీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. తాను విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు. మరో బీసీ నేత మధుయాష్కీ గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్‌ సైతం ఆ పదవి తనకి వస్తుందనే ధీమాలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించినా సంపత్‌కు టిక్కెట్ దక్కలేదు. అందుకే ఆయన పీసీసీ పదవి విషయంలో పట్టుపడుతున్నారు. ఎస్టీ సామాజికవర్గాల నుంచి మంత్రి సీతక్క, బలరాం నాయక్ కూడా పీసీసీ చీఫ్‌ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.

చాలా మంది పీసీసీ చీఫ్ రేసులో ఉన్నప్పటికీ ఒక్కరికి ఓకే పదవి అనే నిబంధన ఏఐసీసీ పెట్టడంతో చాలా మంది సీనియర్లు అసంతృప్తి కి లోనవుతున్నారట. పీసీసీ పదవి ఆశిస్తున్న పలువురు నేతలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. దీంతో వీరందరికీ ఏఐసీసీ నిబంధన ఇబ్బందికరంగా మారిందట. కర్నాటక రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌.. పీసీసీ చీఫ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. పక్క రాష్ట్రంలో లేని నిబంధన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అంటూ ఇక్కడి సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా పీసీసీ చీఫ్‌ పదవి ఆశిస్తున్న మంత్రులు అధికార పదవి వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఈ నిబంధనను వ్యతిరేకిస్తున్నారు. అయితే కొందరు నేతలు మాత్రం చట్టసభల్లో లేనివారు, ప్రభుత్వంలో భాగస్వామ్యం లేనివారికి పీసీసీ చీఫ్‌ పదవి ఇస్తే పార్టీకి ఎక్కువ సమయం ఇస్తారని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement