బీజేఎల్పీ నేత ఎవరు? | Sakshi
Sakshi News home page

బీజేఎల్పీ నేత ఎవరు?

Published Tue, Feb 6 2024 12:49 AM

who is bjlp leader in telangana assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ శాసనసభాపక్షనేత ఎన్నికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు దగ్గరపడుతున్నా, బీజేపీ నేతలు ఎటూ తేల్చలేకపోతున్నారు. గత డిసెంబర్‌లోనే కేంద్రహోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడే బీజేఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించారు. అయితే అప్పుడు తగిన సమయం లేకపోవడంతో తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కొద్దిరోజులకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్‌ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయసేకరణ నిర్వహించారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించాక బీజేఎల్పీ నేతను ప్రకటిస్తామన్నారు. ఇది జరిగి కొద్దిరోజులు గడుస్తున్నా బీజేఎల్పీనేత ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేఎల్పీనేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై రాజకీయంగా, పార్టీలో చర్చనీయాంశమవుతోంది. శాసనసభ కార్యకలాపాలపై అవగాహన, వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీ వేదికపై చోటుచేసుకునే ఆయా పరిణామాలకు తగ్గట్టుగా చురుగ్గా స్పందించగలిగే వారికి ఈ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నట్టు సమాచారం. 

► వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ ఈ పదవి కోరుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డితోపాటు  పాయల్‌ శంకర్, ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా, పైడి రాకేష్‌రెడ్డిలు కూడా బీజేఎల్పీ నేత పదవిని ఆశిస్తున్నారు.

► గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బీసీ నేతను సీఎం చేస్తామని నాయ కత్వం ప్రకటించిందని, కనీసం బీజేఎల్పీ నేతగా బీసీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌ కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. 

► ఈ నెల 8న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌  ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి వివిధ రాజకీయపక్షాల తరఫున నేతలు హాజరై ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి లేదా బీఏసీ భేటీ జరిగే నాటికి బీజేఎల్పీనేతను ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే బీఏసీ భేటీకి శాసనసభాపక్షం ఎవరో ఒకరిని నామినేట్‌ చేసినా సరిపోతుందని, అందువల్ల దానితో బీజేఎల్పీనేత ఎన్నికకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు.

Advertisement
 
Advertisement