బండి సంజయ్‌ను మారుస్తారా?

What Is The Motive Behind Bandi Sanjays Long Visit To Delhi - Sakshi

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించారు. ఎన్నికలు తరుముకొస్తున్నందున నడ్డానే కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. మరి రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌ను కూడా కొనసాగిస్తారా? లేక ఆయన ప్లేస్‌లో ఇంకొకరిని నియమిస్తారా? బండి సుదీర్ఘ హస్తిన పర్యటన వెనుక ఉన్న కారణం ఏంటి?

భారతీయ జనతాపార్టీలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు అధ్యక్ష పదవి గడువు మూడేళ్ళు మాత్రమే. కాలపరిమితి పూర్తయ్యాక పరిస్తితులు, అవసరాలను బట్టి ఉన్న అధ్యక్షుడిని కొనసాగించడమా లేదంటే కొత్తవారిని నియమించడమో జరుగుతుంది. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాలపరిమితి పూర్తి కావడంతో ఆయన టర్మ్‌ను పొడిగిస్తూ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు.

వచ్చే లోక్సభ ఎన్నికల్లో నడ్డా నాయకత్వంలోనే పార్టీ పోరాడాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పదవి కాలాన్ని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించారు.  సంస్థాగత ఎన్నికలు జరగక పోవడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల వరకు వరసగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉండడంతో ఈ ఏడాది పార్టీ సంస్థాగత ఎన్నికల పై దృష్టి పెట్టే అవకాశం లేదు. అందువల్లే అవసరానికి అనుగుణంగా నడ్డాను కొనసాగించాలని కాషాయ పార్టీ అగ్రనాయకత్వం తీర్మానించింది.

ఆలిండియా చీఫ్ జేపీ నడ్డాను కొనసాగించాలని కమలం పార్టీ డిసైడ్ కావడంతో.. రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల పరిస్థితి ఎంటి అనే చర్చ జరుగుతోంది. చాలా రాష్ట్రాల అధ్యక్షుల పదవీ కాలం ముగిసింది. వారిని కొనసాగిస్తారా మార్చుతారా అనే దానిపై పార్టీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పదవి కాలం కూడా మరో రెండు నెలల్లో అంటే.. మార్చి మాసంతో ముగుస్తుంది. రాష్ట్ర అధ్యక్ష మార్పు అంశంపై రాష్ట్ర పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జెపి నడ్దా పదవీ కాలాన్ని పొడిగించడంతో రాష్ట్రాల అధ్యక్షులకు కూడా కొనసాగిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జాతీయ అధ్యక్షుడి కాలపరిమితిని పొడిగించినంత మాత్రాన రాష్ట్రాల చీఫ్ లను కూడా కొనసాగించాలనే రూల్ ఏమి లేదని...ఆ విధంగా పార్టీ నిబంధనలు కూడా ఏమి లేవని అంటున్నారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల అధ్యక్షులను మార్చక పోవచ్చనే టాక్ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

నడ్డా కు వర్తించిన సూత్రమే రాష్ట్రాల అధ్యక్షులకూ వర్తిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణలో కూడా ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ నే కొనసాగిస్తారని అంటున్నారు. ఆయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయిస్తే తప్ప అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు మార్చక పోవచ్చు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. బండి సంజయ్ మీద కమలం పార్టీ హైకమాండ్కు బాగా గురి ఏర్పడింది. ఆయన చేపడుతున్న కార్యక్రమాలు, బీఆర్ఎస్ మీదే చేస్తున్న పోరాటాలతో పలుసార్లు కేంద్ర నాయకత్వం ప్రశంసలు అందుకున్నారు. అందువల్ల బండిని మార్చాలనుకుంటే ఆయనకు తప్పకుండా ప్రమోషన్ లభిస్తుందని లేదంటే అధ్యక్ష పదవిలో కొనసాగుతారని ప్రచారం జరుగుతోంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం ఐదు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్ అక్కడే ఉండిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జాతీయ సమావేశాలు ముగిశాయి. కానీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం హైదరాబాద్ రాలేదు. హస్తినలో పార్టీ పెద్దలతో తన పదవి కాలం పొడిగింపుపై చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top