
కోల్‌కాతా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీల ప్రాబల్యం ఉన్న జంగీపూర్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని బీజేపీ రాజకీయ ఎత్తుగడగా ఉపయోగించుకుంటోంది. దీని వల్ల హిందువులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆమె అన్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల మొదటి, రెండో దశ ఓటింగ్ పూర్తయింది. ఈ దశలోనే బీజేపీ ఓటమి భయాన్ని పొందిందని మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఏదో ఒక అంశాన్ని ఉపయోగిస్తోంది. ఈసారి యూసీసీ గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇది ఒక వర్గానికి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.
బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేఖత ఏర్పడుతోందని మమతా బెనర్జీ అన్నారు. మొదటి రెండు దశల ఓటింగ్ తర్వాత ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన ఐదు దశల్లో కూడా బీజేపీ ఓటమిని చవి చూస్తుందని బెనర్జీ అన్నారు. ఎన్నికల తరువాత రాబోయే ఫలితాలే దీన్ని చెబుతాయని అన్నారు.