‘ఎక్కడో తొడలు కొడితే నాయకులు కాలేరు’

సాక్షి, వన్‌టౌన్ (విజయ వాడ పశ్చిమ): ఎక్కడో తొడలు కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరని టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. బుధవారం విజయవాడ పాతబస్తీలోని టీడీపీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవంలో ఆయన పాల్గొని మాటాడారు. టీడీపీలో కమర్షియల్ నాయకులను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు.
మీడియా నుంచి కాదు.. ప్రజల్లో నుంచే నాయకులు వస్తారని చెప్పారు. తానే గొప్ప అని వెళ్లే వారికి ప్రజల్లో పరాభవం తప్పదంటూ ఇతర నాయకులకు చురకలు అంటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, పార్టీ నాయకులు రాజు సోలంకి, ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సీనియర్ నేత నాగుల్ మీరా హాజరు కాలేదు.