కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కేంద్రమంత్రి నిర్మలా

Union Minister Nirmala Sitharaman Lashes Out KCR At Jubilee Hills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని దుయ్యట్టారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని మండిపడ్డారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మధురానగర్‌లో నిర్వహించిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బంగారు తెలంగాణను కేసీఆర్‌ అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ఒక్క ప్రాజెక్టు కూడా సరిగా పూర్తి చేయలేదని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు.

తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు.  కుటుంబ పాలనా, అవినీతికి పాల్పడిన ప్రభుత్వం మనకు కావాలా? అని నిలదీశారు  బీఆర్ఎస్  ప్రజలకు పనికొచ్చే  పనులు చేయడం లేదని అన్నారు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా.. కేసీఆర్,  పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించకుండా.. బీజేపీపై దురదజల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు.

కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని విపక్ష నేతలు సైతం కొనియాడుతున్నారని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా.. భవిష్యత్తులో రాష్ట్రాలపై భారం పడకుండా కేంద్రం ప్రభుత్వాన్ని నడిపిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పాలసీ వల్ల హైదరాబాద్‌కు మంచి కంపెనీలు వస్తున్నాయని. రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top