కేంద్రమే కొనాలి..

TRS MP Ranjith Reddy Criticized Central Govt Over Paddy Procurement - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం వద్ద ధాన్యం కొనేందుకు డబ్బులు లేవు: రంజిత్‌రెడ్డి 

బీజేపీ నాయకులు ప్రతీది రాజకీయం చేస్తున్నారని మండిపాటు 

రేపే ఢిల్లీలో వరి దీక్ష.. ఏర్పాట్లు వేగవంతం  

సాక్షి, న్యూఢిల్లీ:  ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సామరస్యంగా పరిష్కరించాలనుకున్నా.. కేంద్ర వైఖరి ఏమాత్రం మారలేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి విమర్శించారు. అందుకే కేంద్రంతో తేల్చుకొనేలా ఢిల్లీలో దీక్ష చేపట్టామన్నారు. ప్రస్తుతం యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనే పరిస్థితి ఏమాత్రం లేదని, కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు.

ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వరి దీక్ష ఏర్పాట్లను శనివారం టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేకే, నామా, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, ఇతర నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అహంకారంతో మాట్లాడారని.. ఇటీవల పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించారని రంజిత్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు.  

రైతుల కష్టాలను చూపేందుకే: కేకే 
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, రైతుల కష్టాలను చూపించడానికే ఢిల్లీలో ధర్నా చేపట్టామని ఎంపీ కె.కేశవరావు తెలిపారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ గొంతుపై కత్తిపెట్టి బాయిల్డ్‌ రైస్‌ పంపించొద్దని ఒప్పందం చేయించుకుందని ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటలు వచ్చేవరకు ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలన్నారు. 

ధాన్యం కొనేవరకు వదలం: నామా 
కేంద్రం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని, ధాన్యం కొనే వరకు కేంద్రాన్ని వదిలే ప్రసక్తి లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్‌కి తెలుసని, ధాన్యం సేకరణ కోసం చివరివరకు పోరాడుతామని చెప్పారు. రాష్ట్రప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. 

ఢిల్లీలో లొల్లికి రెడీ! 
యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే సేకరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 11న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అక్కడి తెలంగాణ భవన్‌లో కేసీఆర్, కేటీఆర్‌ సహా టీఆర్‌ఎస్‌ నాయకుల ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో వరి దీక్ష ప్రాంగణం ముస్తాబవుతోంది.

శనివారం దీక్షాస్థలాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీలతోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, మరికొందరు రాష్ట్ర నేతలు పరిశీలించారు. వేదిక, టెంట్లు, బారికేడ్లు, సీటింగ్, భోజనం, ఇతర వసతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఢిల్లీలో ‘ఒకే దేశం.. ఒకే ధాన్యం సేకరణ’అంటూ టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన హోర్డింగులు, పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top