
సత్తుపల్లి బహిరంగ సభలో అభివాదం చేస్తున్న షర్మిల. చిత్రంలో విజయమ్మ
సత్తుపల్లి: ‘దళిత ముఖ్యమంత్రి’మొదలు దళితబంధు వరకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చకుండా అన్నివర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండ లం తాళ్లమడ గ్రామం వద్ద వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంతోపాటు పైలాన్‌ను వైఎస్ విజయమ్మతో కలసి షర్మిల ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ ‘పాదయాత్రలో ఒకరోజు నాతో కలసి తిరగండి. ప్రజాసమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఇంటికెళ్లిపోతా. సమస్యలు కన్పిస్తే మరి కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేస్తారా?’అని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ‘ఆడింది ఆట.. పాడింది పాట’అన్నట్లు పాలిస్తూ మిగులు బడ్జెట్ ఉన్న తెలం గాణను రూ.4 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు. కనీసం రైతు రుణమాఫీకి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు డబ్బుల్లేవని చెబుతున్న కేసీఆర్ సీఎంగా ఎందుకు ఉన్నట్లో చెప్పాలన్నారు. ‘టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్ పార్టీ అయిందంట.. బీఆర్‌ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంద’ని పేర్కొన్నారు.
నా బిడ్డను ఆశీర్వదించండి : విజయమ్మ
‘షర్మిలమ్మకు మీరే బలం. మీ అందరిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని చూసుకుంటోంది. ఎర్రటి ఎండ, వాన, చలికి భయపడదు. రాజశేఖరరెడ్డి బిడ్డగా ప్రజాసేవ చేయటానికి వచ్చింది. నా బిడ్డను ఆశీర్వదించండి’అని విజయమ్మ కోరారు. మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖరరెడ్డి బిడ్డ గా వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తుందని తెలిపారు.
వైఎస్సార్ షర్మిలమ్మను యువరాణిలా చూసేవారని గుర్తుచేశారు. ‘నా బిడ్డలు, నేను ఈ గడ్డమీదకు వచ్చినప్పుడు మా కన్నీళ్లు తుడిచారు. మేం బతికున్నంత వరకు మీ కుటుంబాలకు రుణపడి ఉంటాం. మీకు నా బిడ్డ సేవ చేయటానికి వచ్చింది. రాజశేఖరరెడ్డికి మేం బంధువులైతే, మీరు ఆత్మబంధువులు. వైఎస్సార్ కనబడకపోతే ఎన్నో గుండెలు ఆగాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు.