ప్రగతికి పట్టణం కడదాం

Telangana: Transform Municipalities Into Model Town: KTR Tells Officials - Sakshi

అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌ పిలుపు  

పట్టణ ప్రగతి లక్ష్యాలను పూర్తి చేయాలని సూచన  

కరీంనగర్‌ కార్పొరేషన్, ఇల్లందు మున్సిపాలిటీలకు ప్రశంస  

మున్సిపల్‌ అధికారులు, మేయర్లు, చైర్‌పర్సన్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి లక్ష్యాలను పూర్తి చేస్తే తెలంగాణలోని ప్రతి పట్టణానికీ జాతీయస్థాయి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. గురువారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతినెలా స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమ లక్ష్యాలను అందుకునే దిశగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా సూచించారు. ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, వాటిని అమలు చేసిన పురపాలికలకు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల పురోగతి కోసం ప్రత్యేకంగా టీయూఎఫ్‌ఐసీడీ అనే సంస్థను ఏర్పా టు చేసిందని తెలిపారు. పట్టణ ప్రగతికి అదనంగా నిధులు సమకూరుస్తున్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక నిధులతో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, అయితే స్థానిక సంస్థల పరిధిలో ఉన్న పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్‌ దీపాలు, గ్రీనరీ నిర్వహణ వంటి కార్యక్రమాల పైన ఎక్కువ దృష్టి సారించాలని ఆదేశించారు.

అభివృద్ధిలో పట్టణాల్లోని పౌరులను కూడా భాగస్వాములు చేసేలా వారితో మమేకమై పనిచేయాలని కోరారు. రానున్న ఆరు నెలల్లో సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని, వాటితోపాటు ఇతర పెండింగ్‌ పనులపై దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  

రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదు..
స్థానిక సంస్థల వ్యవహారాల కోసం ప్రత్యేకంగా ఒక కలెక్టర్‌ స్థాయి అధికారిని నియమించడం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదని కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వ ఆలోచనలను అర్థం చేసుకుని అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. స్థానిక సంస్థలను పర్యవేక్షిస్తున్న అదనపు కలెక్టర్లు పట్టణాల ఆకస్మిక తనిఖీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇతర పట్టణాలతో పోటీపడి అభివృద్ధి దిశగా ముందుకు కదలాలన్నారు.

పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పురపాలనలో కరీంనగర్‌ కార్పొరేషన్‌తో పాటు ఇల్లందు వంటి పురపాలికలు వినూత్నంగా ముందుకు దూసుకుపోతున్నాయన్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌ కుమార్, సీడీఎంఏ డాక్టర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top