Manickam Tagore: మీకో దండం ఠాగూర్‌ బాబు.. మమ్మల్ని వదిలి వెళ్లండి!

Telangana Congress Leaders Complaint on Manickam Tagore - Sakshi

ఎవ్వరినీ నొప్పించకుండా.. కావాల్సిన పని జరిపించుకునేవాడే పార్టీ ఇన్‌చార్జ్‌. కానీ ఇక్కడి ఇన్‌చార్జ్‌ అందరి మీద కస్సు బుస్సులాడుతున్నారట. దీంతో పార్టీ నాయకులంతా ఈ ఇన్‌చార్జ్ మాకొద్దు. వెంటనే తీసేయమంటున్నారట. తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ మీద రాష్ట్ర నేతలకు అంత కోపం ఎందుకు వచ్చింది? 

కాంగ్రెస్‌లో ఇంఛార్జ్ అంటే మామూలు విషయం కాదు. తాను ఎంత చెబితే పార్టీలో అంత. ఒకప్పుడు గులాంనబీ అజాద్, ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ ఇలా.. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో ఎందరో సీనియర్ల కీ రోల్ పోషించారు. పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తే ఇంఛార్జ్ కలగజేసుకుని పరష్కరించేవారు. అయితే ఇప్పుడు టీ కాంగ్రెస్‌లో పరిస్థితి మారిపోయింది. ఇంఛార్జే సమస్యగా మారాడు అంటూ గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది. 

ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందరినీ సముదాయించాల్సిన నేతే కనిపించినవారందరి మీదా కస్సుబుస్సులాడితే ఇక పార్టీలో పనులు ఎలా చేస్తారంటూ ప్రశిస్తున్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలు ఉంటే పరిష్కారమయ్యేవిధంగా మాట్లాడాల్సిందిపోయి.. తానే ఆ వివాదాల్ని పెద్దవి చేస్తే పార్టీ ఎలా బలపడుతుందని కొందరు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: (గుడివాడలో టీడీపీ నేతల ఓవరాక్షన్‌.. చెప్పు చూపిస్తూ రెచ్చిపోయిన మాగంటి బాబు)

కొద్ది రోజుల క్రితం ఇంఛార్జ్ ఠాగూర్ అధ్యక్షతన గాంధీ భవన్‌లో జరుగుతున్న మీటింగ్‌కు.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు నేత వచ్చారట. రాష్ట్ర నాయకులకు ఢిల్లీ నుంచి వచ్చిన ఆ నేతను ఠాగూర్ పరిచయం చేస్తూ విమర్శించే విధంగా మాట్లాడారట. దీంతో అందరి ముందు నన్ను అవమానిస్తావా అంటూ ఆ నేత మీటింగ్ నుంచి బయటకు వచ్చి ఠాగూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారట. ఆ తర్వాత ఏఐసీసీ కార్యదర్శి వెళ్లి సదరు నేతను సముదాయిస్తే కానీ ఠాగూర్ రాజేసిన చిచ్చు చల్లారలేదు.

మునుగోడు ఉప ఎన్నికపై జరిగిన పార్టీ ముఖ్యనేతల మీటింగ్‌లో కూడా.. కాంగ్రెస్ గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తున్న నేతపై చమత్కార బాణాలు వేశారట ఠాగూర్. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ నేత ఠాగూర్ వ్యవహార శైలిని తప్పుపడుతూ మీటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయారట. ఆ తర్వాత ఒకరిద్దరు పార్టీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన పట్టించుకోకుండా ఆగ్రహంతో అక్కడి నుంచి నిష్క్రమించారట.  దీంతో సీరియస్‌గా జరుగుతున్న మీటింగ్‌లో ఠాగూర్ సెటైర్లు వేయడం ఏంటని గాంధీభవన్‌లో చర్చలు జరుగుతున్నాయట. అందరిని కలుపుకొని పోవాల్సిన ఇంఛార్జ్ ముఖ్య నేతలపై సెటైర్లు వేస్తే వారు ఊరుకుంటారా? అందుకే మాకొద్దు ఈ ఇంఛార్జ్ అంటూ హైకమాండ్‌ను కోరుతున్నారట.

చదవండి: (ఏలూరులో రెచ్చిపోయిన జనసేన కార్యకర్తలు.. ఇద్దరికి తీవ్రగాయాలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top