మీరు సోంబేర్లు.. మీకు పోరాట పటిమ లేదు! 

TDP Leader Nara Lokesh Comments On People At Bandarupalli - Sakshi

వన్నెకుల క్షత్రియులనుద్దేశించి టీడీపీ నేత నారా లోకేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు 

రేణిగుంట(తిరుపతి జిల్లా): ‘మీరు సోంబేర్లు.. మీకు పోరాటపటిమ లేదు’ అంటూ వన్నెకుల క్షత్రియులపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి ఏర్పేడు మండలం కోబాక వరకు నారా లోకేశ్‌ పాదయాత్ర చేశారు. మార్గంమధ్యలో బండారుపల్లి సమీపంలో వన్నెకుల క్షత్రియుల సంఘం నేతలతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వ­హించారు.

లోకేశ్‌ మాట్లాడుతూ ‘మీరు సోంబేర్లు అబ్బా.. మీకు పోరాటపటిమ లేదు. గట్టిగా నిలదీసి సాధించుకునే మనస్తత్వం లేదు. మేం అధికారంలోకి వస్తే మీకు సామాజికంగా, రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే బాధ్యతను తీసుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులను నిర్మూలిస్తామని.. 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లోకేశ్‌ చెప్పారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా అన్ని పథకాలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కోతలు విధిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌ హ­యాంలో సైతం ఏనాడూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు పెండింగ్‌లో లేవన్నారు. అంతకుముందు శ్రీకాళహస్తిలో ముస్లిం, మైనార్టీ నాయకులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. సమావేశంలో టీడీపీ నేతలు బొజ్జల సుధీర్‌రెడ్డి, రెడ్డివారి గురవారెడ్డి, సత్ర­వాడ మునిరామయ్య పాల్గొన్నారు.
 
పాదయాత్రకు ప్రజా స్పందన కరువు.. 
లోకేశ్‌ పాదయాత్రకు శ్రీకాళహస్తి మండలంలో ప్రజా స్పందన కరువైంది. కొద్ది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తప్ప స్థానికులు కనిపించలేదు. వార్తల్లో నిలిచేందుకు లోకేశ్‌ ఇష్టారీతిన నిబంధనలను ఉల్లంఘించారు. తొండమాన్‌పురం వద్ద పోలీసులతో లోకేశ్‌ వాగ్వాదానికి దిగారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top