‘స్కిల్‌’ స్కామ్‌ సమయంలో నేను ఆ శాఖ మంత్రి కాదు 

TDP Leader Kinjarapu Atchannaidu On Skill Development Scam - Sakshi

నాకు ఒక్క రూపాయి ఇచ్చారని నిరూపిస్తే పీక కోసుకుంటా  

అప్పటి మంత్రి వర్గంలో చర్చించాకే తుది నిర్ణయం 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 

మహారాణిపేట (విశాఖ దక్షిణ): స్కిల్‌ స్కామ్‌ సమయంలో తాను సంబంధిత శాఖ మంత్రిని కాదని, తొలుత విద్యా శాఖ పరిధిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఉండేదని, ఆ తర్వాత కార్మిక శాఖతో అనుసంధానం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఈ ప్రాజెక్టు వల్ల ఒక్క రూపాయి వచ్చిందని నిరూపిస్తే పీక కోసుకుంటానని చెప్పారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పటి మంత్రివర్గంలో ఎంతో మంది చదువుకున్న వారు ఉన్నారని, తాను.. చంద్రబాబు కలిసి ఏదో మాయ చేశామని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ‘రెండేళ్ల క్రితం కేసు పెట్టారు. అప్పడు నా పేరు గాని, చంద్రబాబు పేరుగాని లేదు. మరి చంద్రబాబును ఎలా అరెస్టు చేశారు? తెలుగుదేశం హయాంలో కేబినెట్‌లో చర్చించాకే తుది నిర్ణయం తీసుకున్నాం.

ఈ ప్రాజెక్టు వల్ల ఎంతో మంది యువకులకు లబ్ధి చేకూరింది. సీఐడీ చెబుతున్నట్టుగా రూ.371 కోట్ల అవినీతి అనేది ఒక ఊహ. ఆ రోజు ఈ ప్రాజెక్టును అమలు చేసిన అజేయ కల్లం, ప్రేమ చంద్రారెడ్డి పేర్లు ఎందుకు ప్రస్తావించలేదు. 409 సెక్షన్‌ ఎందుకు పెట్టారో తెలియదు. ఇది రాజకీయ కక్ష’ అని అన్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించే హక్కు పవన్‌ కళ్యాణ్‌కు లేదా?’ అని ప్రశ్నించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top