
మూడవసారీ నిలువునా మోసం చేశారు
చీరాల మున్సిపల్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో పొత్తూరి ఆవేదన
పార్టీకీ, కౌన్సిలర్ పదవికి రాజీనామా ప్రకటన
సాక్షి, చీరాల: ‘తెలుగుదేశం పార్టీని నమ్మి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరితే చివరకు నన్ను నిలువునా మోసం చేసి చంపేశారు. మూడు సార్లు నాకు అన్యాయమే జరిగింది. చివరి వరకు ఆశ పెట్టుకున్న చైర్మన్ పదవి కల్పించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఏదైనా విషం ఇచ్చి చంపేయచ్చుగా బాబు గారూ..!’ బాపట్ల జిల్లా, చీరాల మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య ఆవేదనా పూరిత వ్యాఖ్యలివి.
వివరాల్లోకి వెళితే, మే 14న చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన అనంతరం, బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్ స్థానానికి పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, మామిడాల రాములు పేర్లు బలంగా వినిపించాయి. ఎన్నికకు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేయగా, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు. అధిష్టాన నిర్ణయం మేరకు సాంబశివరావు పేరును చైర్మన్‌గా ఎంపీ ప్రతిపాదించగా, ఆయన ఎన్నికయ్యారు.
అప్పటి వరకు తనకే ఆ అవకాశం దక్కుతుందని గంపెడు ఆశతో ఉన్న సుబ్బయ్యకు తీవ్ర పరాభవం ఎదురైంది. వెంటనే ఆయన కౌన్సిల్ హాలు నుంచి కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సామాజికవర్గానికి 16 వేల ఓట్లు ఉన్నాయని, 83 శాతం ఓట్లు వేయించి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించామన్నారు. గతంలోనూ రెండు సార్లు తనకు చైర్మన్ పదవి విషయంలో అన్యాయం జరిగిందన్నారు. 14 రకాల ఆస్తులుంటే పార్టీ కోసం 12 అమ్ముకుని ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానన్నారు. అమ్ముకోవడానికి ఇక మిగిలింది కిడ్నీలు, లివర్ మాత్రమేనని వాపోయారు.
వైఎస్సార్‌సీపీని కాదనుకొని వస్తే.. ఇంత అన్యాయమా?
వైఎస్సార్‌సీపీని కాదనుకొని టీడీపీలో చేరితే ఇంత అన్యాయం చేస్తారనుకోలేదని పొత్తూరి వాపోయారు. తాను ఇక పార్టీలో ఉండలేనని పేర్కొంటూ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానన్నారు.