టీడీపీ-జనసేన పొత్తు.. టీడీపీ నేతల్లో కంగారెందుకు?.. ఏం జరగబోతోంది?

Tdp Janasena Alliance: Tension Among Tdp Candidates - Sakshi

తెలుగుదేశం-జనసేన పొత్తు వ్యవహారంలో చాలా చోట్ల టీడీపీ అభ్యర్ధుల్లో గుబులు రేపుతోంది. పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారేమోనని టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఓ నియోజకవర్గంలో టీడీపీ-జనసేన నేతలు వచ్చే  ఎన్నికల్లో  పోటీ చేయబోయేది నేనంటే నేనే అంటూ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే జనసేన అభ్యర్ధి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు రావడంతో టీడీపీ శ్రేణులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. జనసేనకే ఆ సీటు ఇస్తే వారికి సహకరించే ప్రసక్తే లేదని టీడీపీ శ్రేణులు భీష్మించుకుని ఉన్నాయంటున్నారు.

తణుకు నియోజక​వర్గం నుంచి రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీకి చెందిన ఆరిమిల్లి రాధాకృష్ణపై విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో  తిరిగి తణుకు నుంచే పోటీ చేయాలని ఆరిమిల్లి భావిస్తున్నారు. అయితే ఆ మధ్య వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తణుకు సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తణుకు నుండి తమ పార్టీ తరపున విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని ప్రకటించి సంచలనం సృష్టించారు. అది స్థానిక టీడీపీ నేతల్లో మంట పుట్టించింది. టీడీపీ-జనసేనల మధ్య పొత్తు అప్పటికి ఖరారు కాలేదు. పొత్తు పెట్టుకుంటాం అని అన్నా కూడా సీట్ల సర్దుబాటు కాలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా విడివాడ రామచంద్రరావు పేరు ప్రకటించడం ఏంటని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.

అయితే పవన్ అలా ప్రకటించిన క్షణం నుంచి వచ్చే ఎన్నికల్లో తణుకు నియోజక వర్గంలో టీడీపీ-జనసేనల తరపు అభ్యర్ధిని తానే అని  విడివాడ రామచంద్రరావు ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపు  టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి కూడా వచ్చే ఎన్నికల్లో  పోటీ చేయబోయేది తానే అని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం   మధ్యంతర బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయిన సందర్బంగా ఆయన విజయవాడ దాకా ర్యాలీగా వెళ్తూ తణుకు వద్ద ఆగారు. అక్కడ  జనసేన అభ్యర్ధి విడివాడ రామచంద్రరావు అమాంతం వచ్చి చంద్రబాబు  కాళ్లకు నమస్కరించేశారు. ఆయన్ను చంద్రబాబు కూడా ఆప్యాయంగా లేవదీసి భుజం తట్టారు.

టీడీపీ అభ్యర్ధి ఆరిమిల్లి కూడా చంద్రబాబుకు అభివందనం చేశారు కానీ విడివాడ రామచంద్రరావును రిసీవ్ చేసుకున్నంత సన్నిహితంగా ఆరిమిల్లిని చంద్రబాబు రిసీవ్ చేసుకోలేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. తణుకు సీటును  జనసేనకు కేటాయించేసినట్లే అని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారని చర్చించుకుంటున్నారు.

చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత తిరిగి ఆరిమిల్లి, విడివాడ ఎవరికి వారే రాబోయే ఎన్నికల్లో తణుకు సీటు నాదంటే నాదే అని తమ తమ శిబిరాల ద్వారా ప్రచారాలు చేయించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో.. ఏ ముగింపునిస్తుందో అని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు.
చదవండి: ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో పురందేశ్వరి’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top