
సాక్షి, అమరావతి : ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసిరావాలి.. ప్రజా ఉద్యమం రావాలి.. దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు శుక్రవారం అన్న మాటలివి. వీటిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో నానాటికీ బలపడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఒంటరిగా ఎదుర్కోవడం తనవల్ల కాదని చంద్రబాబు చేతులెత్తేసినట్లు స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన పొత్తుల జిత్తులను చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం అమలుచేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పర్యటనలో.. ‘జనసేన పొత్తును టీడీపీ కోరుకుంటోంది.. కానీ, అటు వైపు నుంచి కూడా ప్రతిపాదన రావాలి కదా’.. అని చంద్రబాబు పవన్ కళ్యాణ్‌కు సంకేతం ఇచ్చారని వారు గుర్తుచేస్తున్నారు. దీనికి బదులుగా.. జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు.. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాం’ అని పవన్ ప్రకటించారని.. పనిలో పనిగా ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాం అని కూడా తెలిపారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కానీ, టీడీపీతో పొత్తుకు అర్రులు చాస్తుండడంపై జనసేన శ్రేణులు భిన్నస్వరాలు వ్యక్తంచేయడంతో.. ‘హద్దు దాటొద్దు.. అన్నీ ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నా’ అంటూ పవన్ స్పష్టంచేశారు. దీంతో.. తమకు మిత్రపక్షంగా ఉంటూ.. పవన్ టీడీపీకి స్నేహహస్తం అందిస్తుండడంతో ‘టీడీపీ, వైఎస్సార్‌సీపీకి సమదూరం పాటించడమే’ తమ విధానమని బీజేపీ నేతలు సోము వీర్రాజు, సునీల్ దేవేధర్ స్పష్టంచేశారు.
క్షణాల్లో స్పందించిన జనసేన..
ఇక జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ చెప్పిన మాటలనే శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలోనూ చంద్రబాబు వల్లె వేశారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ టీడీపీ అధినేత వ్యాఖ్యలపై క్షణాల్లో స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటమే తమ విధానమని పవన్ కళ్యాణ్ ఆదిలోనే స్పష్టం చేశారని.. టీడీపీతో పొత్తుపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఈ మొత్తం క్రమాన్ని పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు ముందుకు రచించుకున్న ప్రణాళికతో ముసుగులు వీడుతున్నాయని.. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ ఒక్కటవుతున్నారని చెబుతున్నారు. మరోవైపు.. టీడీపీ–జనసేన పొత్తుపై పవన్ ఆదివారం స్పష్టతనిచ్చే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆది నుంచి టీడీపీది పొత్తుల బాటే..
నిజానికి.. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. అటు ప్రభుత్వాన్ని, ఇటు టీడీపీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు.. నాటి నుంచి నేటి వరకూ జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీచేసి గెలిచిన దాఖలాల్లేవు. ప్రతీసారీ పొత్తుల బాటే పట్టారు.
- 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలతో జట్టుకట్టగా 1999 ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టింది.
- వాజ్‌పేయిపై సానుభూతితో 1999 ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ.. 2004 ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తును కొనసాగించింది.
- కానీ, 2004 ఎన్నికల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో టీడీపీ కొట్టుకుపోయింది. దాంతో.. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రాత్మక తప్పిదమని.. ఎప్పటికీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని చంద్రబాబు శపథం చేశారు.
- ఇక 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, సీపీఐతో మహాకూటమి ఏర్పాటుచేసిన చంద్రబాబు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనాన్ని తట్టుకోలేక ఘోరంగా ఓడిపోయారు.
- ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యంకాదనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధినేత.. 2014 ఎన్నికల్లో బీజేపీతో నడిచారు. దత్తపుత్రుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ–బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతిచ్చేలా చంద్రబాబు చక్రం తిప్పారు.
- 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలన్న కాంక్షతో.. బీజేపీకి కటీఫ్ చెప్పారు. జనసేన, బీఎస్పీ, సీపీఐ ఓ కూటమిగా పోటీచేసేలా చంద్రబాబు పథకం పన్నారు. కానీ.. వైఎస్ జగన్ ప్రభంజనంలో టీడీపీకి చావుదెబ్బ తగిలింది.
- అక్కడితో ఆగక.. 2019 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దత్తపుత్రుడు పవన్ చేరువయ్యేలా చంద్రబాబు స్కెచ్‌వేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్పించి.. వారి ద్వారా బీజేపీకి చేరువ య్యేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.