సాక్షి, తాడేపల్లి: స్కిల్ కేసులో సాక్ష్యాలు బలంగా ఉన్నాయని.. చంద్రబాబే ఈ కేసులో ప్రధాన దోషి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఐడీ పక్కా ఆధారాలు సేకరించిందని.. రూ.372 కోట్లు పక్కదారి పట్టినట్టు సాక్ష్యాలు కూడా ఉన్నాయని.. అలాంటి కేసును కొట్టేయటం విడ్డూరం అని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘చంద్రబాబే తన కేసుకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం దారుణం. ప్రభుత్వంలో ఉండి మాఫీ చేసుకోవడం అభ్యంతరకరం. చంద్రబాబు కేసును ఎదుర్కొని తాను నిర్దోషినని నిరూపించుకోవాలి. అంతేగానీ ఇలా కేసును నీరు గార్చటం సబబు కాదు. దీనిపై మా పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తాం. రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు సర్వనాశనం చేశారు. అది నిరర్ధక ప్రాజెక్టు అయితే మా పార్టీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు?’’ అంటూ సతీష్‌రెడ్డి నిలదీశారు.
‘‘ప్రాజెక్టు సందర్శన చేస్తున్న నెల్లూరు నేతలను అడ్డుకోవడం ఎందుకు?. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుండి నీరు తీసుకెళ్తున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామంటున్న చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా?. వెలుగొండ ప్రాజెక్టుకు రూ.800 కోట్లు ఖర్చు చేస్తే ప్రకాశం జిల్లా సస్యశ్యామలమవుతుంది. కానీ చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు.
..రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంటే చంద్రబాబు అందరినీ తీసుకెళ్ళి చూపించాలి. 19వ తేదీ లోపల అందరినీ తీసుకెళ్లాలి. లేకపోతే మేమే స్వయంగా పరిశీలనకు వెళ్తాం. అక్కడ ఏమాత్రం పనులు జరుగుతున్నాయో ప్రపంచానికి తెలుపుతాం. కాంట్రాక్టర్ల నుండి 25-30 శాతం కమిషన్ తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వర రావుకు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఏం తెలుసు?. నీళ్ల విలువ గురించి ఏబీవీకి ఏం తెలుసు?. ఒకసారి ఆయన రాయలసీమ వచ్చి ప్రాజెక్టులను చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. రాయలసీమ లిఫ్టు నిరర్థకం అంటున్న చంద్రబాబే నిరర్థకం. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అక్కడి ప్రజలే తగిన బుద్ది చెప్తారు. నామమాత్రపు సీట్లు కూడా సాధించలేరు’’ అని సతీష్‌రెడ్డి అన్నారు.


