
- పెద్దన్నపై బాలయ్య కామెంట్లు
- కింది స్థాయిలో రగిలిపోతున్న ఫ్యాన్స్
- అయినా చప్పుడు చేయని నాగబాబు, పవన్
ఏపీ శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్లు రాష్ట్రంలో.. ఇంకా చెప్పాలంటే తెలుగువారు ఉన్న అన్ని ప్రాంతాల్లో చర్చకు తెర లేపాయి. చిరంజీవిని అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమాత్రం గౌరవించలేదని.. సినీ పరిశ్రమ సమస్యలను కష్టాలను వైఎస్ జగన్ పట్టించుకోలేదని ఇంకా ఏవేవో మాట్లాడుతూ చిరంజీవి తన స్థాయి దిగి మరి వైఎస్ జగన్ వద్ద మోకరిల్లారు అన్నట్లుగా బాలకృష్ణ మాట్లాడారు.
బాలకృష్ణ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు కానీ ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడి వివాదాలకు విద్వేషాలకు నిప్పు రాజేస్తుంటారు. ఈ అంశంపై నిన్ననే మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘమైన వివరణ ఇస్తూ అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకుని విందుకు ఆహ్వానించి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నీ కూలకుషంగా విని వాటి పరిష్కారానికి తోడ్పాటును అందించారు అంటూ ఓ లేఖ విడుదల చేశారు.
వాస్తవానికి చట్ట సభలో లేని వ్యక్తుల గురించి సభలో మాట్లాడకూడదు అన్నది నిబంధన. కానీ బాలకృష్ణ నోటి దురుసు, అహంకారంతో చిరంజీవిని మెగాస్టార్ అభిమానులు అందరిని గాయపరిచేలా నోటికి వచ్చినట్లు మాట్లాడేసి వెళ్లిపోయారు. ఈ అంశంపై మెగాస్టార్ అభిమానులు సోషల్ మీడియాలో అక్కడక్కడ పోస్టులు పెడుతున్నప్పటికీ చిరంజీవి తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఇద్దరు చట్టసభలో సభ్యులు అయినప్పటికీ ఎవరు దానిపై ఏమాత్రం స్పందించకపోవడం వారి బానిసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని కాపు సామాజిక వర్గం నుంచి ఆవేదన వెల్లువెత్తుతుంది.
తన అన్నను ఎందుకు పనికిరాని వాడిగా బాలకృష్ణ కామెంట్ చేసినా... పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఇద్దరూ వినీ వినట్లు ఊరుకున్నారు. వాస్తవానికి గతంలో కూడా మెగాస్టార్ అభిమానులందరినీ బాలకృష్ణ అలగా జనం అంటూ కామెంట్ చేశారు.. దీనిపై కూడా అప్పట్లో మెగా ఫ్యాన్స్ స్పందించారు తప్పితే మెగా బ్రదర్స్ ఎవరు? కనీసం తమ అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ సభల్లో మాట్లాడుతూ తన తల్లిని దూషించిన తెలుగుదేశం పార్టీతో మళ్ళీ కలుస్తానా అంటూ ప్రజలనే ప్రశ్నించారు. కానీ మళ్లీ అదే పార్టీతో చేతులు కలిపి ఇంకో 15 ఏళ్లపాటు తెలుగుదేశంతో పొత్తులో ఉంటాను అని ప్రకటన చేయడం పవన్ కళ్యాణ్ అసమర్థతను వ్యక్తం చేస్తుందని మెగా ఫ్యాన్స్ లోలోన ఆవేదన చెందుతున్నారు.
తమ కుటుంబ పెద్ద అయినా మెగాస్టార్ చిరంజీవి విషయంలో బాలకృష్ణ చేసిన లేకి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ నాగబాబులను కనీసం కదిలించకపోవడం వారి దౌర్భాగ్యాన్ని సూచిస్తుందని కాపు యువతతో పాటు మెగా అభిమానులు సైతం లోలోన బాధపడుతున్నారు. ఇంత గోల జరుగుతున్న నాగబాబు కనీసం మాట్లాడకపోగా బిగ్ బాస్.. ఆట వంటి టీవీ కార్యక్రమాల గురించి కామెంట్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని.. నాగబాబుకు పవన్ కళ్యాణ్‌కు ఈ పదవులు ఆటవిడుపు లాంటివి అనే భావన కలిగిస్తున్నారని ఫ్యాన్స్ లో వినిపిస్తోంది.
రాజకీయంగా పదవులు వస్తే చాలు.. ప్రోటోకాల్ ఇతర సౌకర్యాలు వస్తే చాలు అనుకొని ఇద్దరు అన్నదమ్ములు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప పెద్దన్నయ్య చిరంజీవికి చట్టసభలో బాలకృష్ణ చేసిన అవమానం గురించి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం వారి రాజకీయ అవకాశవాదానికి నిర్వచనం అన్నట్లుగా అభిమానులు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని కాపు నేతలు భావిస్తున్నారు. బాలకృష్ణకు మొదటి నుంచి కూడా మెగాస్టార్ అభిమానులు.. చిరంజీవి కుటుంబం అంటే చిన్న చూపు ఉన్నది. పలు సందర్భాల్లో బాలకృష్ణ తన దుగ్ధను .. అహంకారాన్ని బయటకు వెలిబుచ్చారు. ఈసారి ఏకంగా చట్టసభలోనే బాలకృష్ణ అలా మాట్లాడడం మెగా అభిమానులను తీవ్రంగా కలిసి వేస్తుంది. కానీ దీనిపై మెగా కుటుంబం నుంచి కనీసం స్పందన రాకపోవడం వారిని మరింతగా బాధిస్తోంది.
సిమ్మాదిరప్పన్న