ప్రగతిభవన్‌లో పేపర్‌ లీకేజీ మూలాలు 

Sources of Paper Leakage in Pragati Bhavan says rs Praveen Kumar - Sakshi

‘నిరుద్యోగుల గోస’సమావేశంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, కోదండరాం ఆరోపణ 

నీళ్లు, నియామకాలు, నిధులు(ట్రిపుల్‌ ఎన్‌) కాస్తా లీకులు, లిక్కర్, లిఫ్ట్‌(ట్రిపుల్‌ ఎల్‌) మారిందని వ్యాఖ్య 

గెలుపు కేసీఆర్‌ పైసదో, మా పోరాట పటిమదో చూద్దామని సవాల్‌.. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో 

విచారణ జరిపించాలని డిమాండ్‌ 

లక్డీకాపూల్‌(హైదరాబాద్‌): టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు మూలాలు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ వద్ద ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌ కుటుంబసభ్యుల కనుసన్నల్లోనే ఈ లీకేజీ జరిగిందన్నారు. ‘టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీ– ప్రభుత్వ వైఫల్యం–నిరుద్యోగుల గోస’అనే అంశంపై మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యువజన సమితి, విద్యార్థి జన సమితి అధ్యక్షులు సలీం పాషా, సర్దార్‌ వినోద్‌ కుమార్‌ అధ్యక్షతన అఖిలపక్షాల రౌండ్‌టేబుల్‌ సమావేశంజరిగింది.

ఈ సందర్భంగా ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ నీళ్లు, నియామకాలు, నిధులు(ట్రిపుల్‌ ఎన్‌) కాస్తా లీకులు, లిక్కర్, లిఫ్ట్‌(ట్రిపుల్‌ ఎల్‌)గా మారిందని అన్నారు. పేపర్‌ లీకేజీ నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిరుద్యోగ అభ్యర్థులకు 50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులు ఆవేశపూరితంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కోరారు. 

కేసీఆర్‌ కాస్కో: కోదండరాం 
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ ఈ లీకేజీ వ్యవహా రం ఇద్దరు వ్యక్తుల సమస్య కాదని, పాలకులతో దీనికి సంబంధం ఉందని అన్నా రు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లీకేజీ ఘటనకు సీఎం కేసీఆర్‌దే నైతిక బాధ్యత అని అన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అరాచకాలపై ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

గెలుపు కేసీఆర్‌ పైసాదో, మా పోరాటపటిమదో చూద్దామని సవాల్‌ విసిరారు. ‘ఇక ఐక్యంగా ఉద్యమిస్తాం, కేసీఆర్‌ కాస్కో’అని హెచ్చరించారు. త్వరలో అన్ని పార్టీలతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ టీఎస్‌పీఎస్‌సీ రిక్రూట్మెంట్‌ తీరు ఇలా ఉంటే, మిగతా శాఖల్లో నియామకాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల పరీక్షలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు.

రాజకీయ ప్రమేయంలేని వారిని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా, సభ్యులుగా నియమించాలన్నారు. సమావేశంలో ప్రొ.హరగోపాల్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి, తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వినర్‌ అంబటి నాగన్న, టీజేఎస్‌ ఉపాధ్యక్షుడు పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్, బైరి రమేశ్, కాంగ్రెస్‌ నేతలు కిరణ్‌రెడ్డి, భూపతిరెడ్డి, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్, ఝాన్సీ, ప్రవీణ్, విద్యార్థి సంఘాల నేతలు మహేశ్,, నాగేశ్వర్‌రావు, పుట్ట లక్ష్మణ్, ఓయూ జేఏసీ నేతలు శ్రీహరి, దయాకర్, నిరుద్యోగుల సంఘం నేత నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top