
ఇరగవరం/సాక్షి, అమరావతి: గతంలో టీడీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలంలోని రేలంగి శివారు గమళ్లపాడులో తణుకు నియోజకవర్గ బీజేపీ నాయకులు శనివారం ఏర్పాటు చేసిన వన సమారాధన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రూ.7,200 కోట్లు తీసుకుని చంద్రబాబు అమరావతిలో నాలుగు తాత్కాలిక భవనాలు కట్టారని దుయ్యబట్టారు. గతంలో టీడీపీ హయాంలో కాపులకు ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులిచ్చినా వారికి డీఎస్పీని బదిలీ చేసే అధికారం కూడా ఇవ్వలేదన్నారు.
రోడ్లకు మరమ్మతుల కోసం బీజేపీ ఆందోళనలు
రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ శనివారం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.