అంతర్మథనం: గోడ మీద టీడీపీ తమ్ముళ్లు..!

Some TDP Leaders Preparing To Join YSRCP In Chittoor District - Sakshi

అధినేత తీరుతో విసిగిపోయిన టీడీపీ శ్రేణులు

కోలుకోలేని దెబ్బతీసిన తొలివిడత ఫలితాలు

మలివిడతపై వదిలేసుకున్న ఆశలు

చిత్తూరులో రాజీనామా చేసిన నేతలు

వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సన్నాహాలు 

‘మా నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలం గడిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నగదు బదిలీ లాంటి పథకాలతో హడావుడి చేశారు. అయితే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీరు ఇందుకు భిన్నంగా ఉంది. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ నెరవేర్చేస్తున్నారు. అందుకే చంద్రబాబు పనిగట్టుకుని దుష్ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదు’. 
– టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి వ్యాఖ్య 

జిల్లాలో టీడీపీ వరస ఓటములతో కుదేలవుతోంది. భవిష్యత్‌పై ఆశలు సన్నగిల్లడంతో తమ్ముళ్ల వ్యవహారశైలిలో మార్పు వస్తోంది. పట్టున్న పల్లెలు కూడా జారిపోవడంతో మనోధైర్యం దెబ్బతింటోంది. చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే వారిలో సైతం అంతర్మథనం మొదలైంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీకి గుడ్‌బై చెప్పే వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. పెద్దసంఖ్యలో నేతలు రాజీనామా బాటపట్టడంతో అధినాయకత్వం ఆందోళన చెందుతోంది. వైఎస్సార్‌సీపీలో చేరికలు పెరగడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.

సాక్షి, తిరుపతి : జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి టీడీపీ శ్రేణుల్లో మార్పు కనిపిస్తోంది. అధినేత చంద్రబాబు తీరుతో కార్యకర్తలు విసిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం వృథా అని నిర్ణయానికి వస్తున్నారు. కొందరు తటస్థంగా ఉండటానికి ఇష్టపడుతుంటే.. మరి కొందరు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. చిత్తూరులో గురువారం కొందరు టీడీపీ జిల్లా, మండల నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. మరి కొందరు పార్టీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజక వర్గం విషయానికి వస్తే. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో అధికశాతం ఇప్పటికే వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న శాంతిపురం, గుడుపల్లె నాయకులు కూడా ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, కుప్పం నియోజక వర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి భరత్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు.

కుప్పంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల్లో స్థానికులు టీడీపీకి గట్టి షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ నుంచి ఇప్పటికే ముఖ్యమైన నాయకులు ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీకి కంచుకోటగా ఉన్న రామచంద్రాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌ చేశారు. మొత్తం 10 పంచాయతీల్లోనూ విజయం సాధించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి పనితీరుకు రామచంద్రాపురం మండలంలోని పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

అనూహ్య మార్పులు 
పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక జిల్లా రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనన్నట్లు మేధావులు విశ్లేషిస్తున్నారు.  పుంగనూరు, తంబళ్లపల్లె పరిధిలో టీడీపీ ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోయింది. తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, పలమనేరు పరిధిలోని అన్ని మండలాల్లోనూ పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల తర్వాత మిగిలిన టీడీపీ నాయకులు కూడా  పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక తర్వాత మరి కొన్ని వలసలు ఉండే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం తీరుతో విసిగి పోయిన తమ్ముళ్లు గోడ దూకేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
(చదవండి: ‘దిక్కుమాలిన టీడీపీకి అది అలవాటే..’)
ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం!    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top