సొంతూరికి వచ్చేదెలా!? | War has become a curse for the Telugu people living in the Gulf countries | Sakshi
Sakshi News home page

సొంతూరికి వచ్చేదెలా!?

Mar 20 2026 2:46 AM | Updated on Mar 20 2026 2:46 AM

War has become a curse for the Telugu people living in the Gulf countries

మూతపడిన కువైట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు

గల్ఫ్‌ దేశాల్లోని ప్రవాసాంధ్రుల వేదన   

యుద్ధ మేఘాల మాటున కువైట్‌లో యాతన

విమానాశ్రయం మూత..  

రూ.10 వేల టికెట్‌ ధర ఇప్పుడు రూ.1.30 లక్షల నుంచి రూ.3 లక్షలు 

తల్లి చివరి చూపునకు నోచుకోని వైనం.. పండుగలకు రాలేక బిక్కుబిక్కు 

పట్టించుకోని టీడీపీ కూటమి ప్రభుత్వం 

విమానయాన శాఖ మంత్రి సొంత రాష్ట్రమైనా తప్పని తిప్పలు

రాజంపేట: పశ్చిమాసియాలో ఇరాన్‌–అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్‌ దేశాల్లోని తెలుగువారి పాలిట శాపంగా మారాయి. ముఖ్యంగా కువైట్‌లోని ‘ఖసీమా’ విమానాశ్రయం మూసివేయడంతో ఉమ్మడి కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు చెందిన వేలాది మంది ప్రవాసాంధ్రులు అక్కడ చిక్కుకుపోయారు. 

యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దుకావడంతో, ప్రత్యామ్నాయ మార్గాల్లో స్వదేశానికి రావాలంటే సామాన్యులకు టికెట్‌ ధరలు అందనంత ఎత్తుకు చేరాయి. గతంలో రూ.10 వేలకు లభించే టికెట్‌ ప్రస్తుతం రూ.1.30 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పలుకుతుండడంతో పేద కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

వీసాల వెతలు..  
కువైట్‌ నుంచి నేరుగా విమానాలు లేకపోవడంతో సౌదీ అరేబియా మీదుగా వచ్చేందుకు ప్రయత్ని­స్తున్న వారికి అక్కడి రాయబార కార్యాలయం చేతులెత్తేసింది. విజిట్‌ వీసా హోల్డర్లు, అత్యవసర ప్రయాణికులు సొంత ఖర్చులతోనే టికెట్లు బుక్‌ చేసుకోవాలని, వీసా జారీపై ఎలాంటి హామీలేదని తేల్చిచెప్పింది. వీసా జారీ అనేది సౌదీ ప్రభుత్వ ప్రత్యేక హక్కు అని తెలపడంతో ప్రవాసాంధ్రులు అద్దె గదులకు పరిమితమై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

గుండె కోత మిగిల్చిన యుద్ధం.. 
యుద్ధ వాతావరణం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రాజంపేటకు చెందిన మర్రి కళ్యాణ్‌ తన తల్లి మరణిస్తే కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయారు. ఇప్పుడు రావాలన్నా శ్రీలంక మీదుగా లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తోంది. అలాగే, భార్య ప్రసవానికి వెళ్లాలనుకున్న రాజంపేట రమణ, ఏటా రంజాన్‌కు ఊరికి వచ్చే నందలూరు మస్తాన్‌ వంటి వేలాది మంది ఈసారి పండుగలకు దూరమయ్యారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం..
రాష్ట్రానికి చెందిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగు వారిని ఆదుకోవడంలో విఫలమయ్యారని బాధితులు మండిపడుతున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనే ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేశారని.. ఇప్పుడు యుద్ధ వాతావరణంలో కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రవాసాంధ్రులు ప్రశ్నిస్తున్నారు. 

ఇలాంటి దుర్భర పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.. 
నేను చాలా కాలంగా కువైట్‌లో ఉన్నాను. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుర్భర పరిస్థితిని చూడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎలాంటి ఆంక్షలు, ఆర్థిక భారం లేకుండా ప్రవాసాంధ్రులను భారత్‌కు తీసుకురావాలి. ప్రత్యేక విమాన సర్వీసులను వెంటనే ప్రారంభించాలి. – మేడా మనోహర్‌రెడ్డి, గుండ్లూరు, రాజంపేట 

మంత్రి ఉన్నా ప్రయోజనం లేదు.. 
మా తమ్ముడు తన తల్లి అంత్యక్రియలకు కూడా రాలేకపోవడం బాధాకరం. రామ్మోహన్‌ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నా ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేయలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని రాయితీ ధరకు విమాన ప్రయాణం కల్పించాలి.  – మర్రి రవికుమార్, వైస్‌చైర్మన్, రాజంపేట మున్సిపాలిటీ 

Advertisement
 
Advertisement
Advertisement