దక్కని చోటు!

Shock To Former Corporators In TDP - Sakshi

టీడీపీలో 14 మంది మాజీ కార్పొరేటర్లకు షాక్‌ 

జనసేనతో లోపాయికారి  ఒప్పందం! 

సాక్షి, అమరావతి బ్యూరో: ఊహించినట్లుగానే కొందరు సిట్టింగ్‌లకు టీడీపీ షాక్‌ ఇచ్చింది. 14 స్థానాల్లో ఇతరులకు అవకాశం కల్పించింది. ఇందులో స్థానిక టీడీపీ నేతలు చెప్పినట్లుగా అభ్యర్థుల ఎంపిక చేయడం.. జనసేన పార్టీతో లోపాయికారీ ఒప్పందం నేపథ్యంలో మిగతా వారిని అధిష్టానం మార్చినట్లు తెలుస్తోంది. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పొత్తులతో సహా 64 డివిజన్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అందరికీ బీ–ఫారంలు కూడా అందజేసింది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 39 స్థానాల్లో విజయం సాధించింది.

14 మంది సిటింగ్‌లకు నో ఛాన్స్‌.. 
అభ్యర్థుల ఎంపికపై టీడీపీ భారీ కసరత్తు చేసింది. ప్రైవేటు ఏజెన్సీలతో సర్వేలు చేయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ, సీపీఐ కూటమిగా మొత్తం 64 డివిజన్లలో 57 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులను, 7 డివిజన్లలో సీపీఐ అభ్యర్థులను ప్రకటించగా.. 14 మంది సిట్టింగ్‌లకు ఛాన్స్‌ దక్కలేదు. వ్యూహాత్మకంగానే వారిని తప్పించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గాంధీనగర్‌ డివిజన్‌ నుంచి మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలుపొందిన ముప్పా వెంకటేశ్వరరావు డివిజన్ల పునర్విభజనలో ఈసారి ఆయన డివిజన్‌ బీసీకి రిజర్వ్‌ కావడంతో తాను ఎన్నికల బరిలో ఉండనని ముందే చెప్పారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఏడుగురు సిట్టింగ్‌లకు టికెట్టు ఇవ్వలేదు. అలాగే తూర్పు నియోజకవర్గంలో డివిజన్ల పునర్విభజనలో ఆరుగురు సిట్టింగ్‌ స్థానాల్లో రిజర్వేషన్లు మారడంతో వారికి ఇతర ప్రాంతాల్లో అవకాశం కల్పించ లేదు.

పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్‌ కార్పొరేటర్‌గా గత ఎన్నికల్లో గెలుపొంది కౌన్సిల్‌లో ఫ్లోర్‌లీడర్‌గా పనిచేసిన గుండారపు హరి బాబు, ఆయన కుమార్తె నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ టీడీపీ బి–ఫారం ఇవ్వలేదు. ఈ స్థానానికి ఎంపీ కేశినేని సూచించిన   అభ్యర్థికి బి–ఫారం ఇచ్చారు.  హరిబాబు చివరి నిమిషంలో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.  

గత మేయర్‌ కోనేరు శ్రీధర్‌ స్థానంలో ఎంపీ కేశినేని నాని కుమార్తె  శ్వేతను బరిలో  నిలిపారు.  
7వ డివిజన్‌ సిటింగ్‌ కార్పొరేటర్‌ జ్యోతి స్థానంలో శిరీషా గాంధీకి అవకాశం దక్కింది.  
2వ డివిజన్‌ కార్పొరేటర్‌ దేవినేని అపర్ణ ప్రస్తుతం 10వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తోంది. గతంలో అక్కడ ఉన్న సిట్టింగ్‌కు స్థానం కేటాయించలేదు.  
సిట్టింగ్‌ కార్పొరేటర్‌ వీరంకి డాంగే కుమారికి కాదని ఆమె స్థానంలో ముమ్మినేని ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టికెట్‌ కేటాయించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top