అది చంద్రబాబు భరోసా యాత్రే 

Shilpa Ravichandra Kishore Reddy On Pawan Kalyan Chandrababu - Sakshi

ఈ ప్యాకేజీ స్టార్‌ను దత్తపుత్రుడనక మరేమంటారు? 

పవన్‌ దృష్టిలో మహిళలంటే వాడుకుని వదిలేసే వస్తువులు 

అలాంటి వ్యక్తికి ఏ ఒక్క అక్కచెల్లెమ్మనూ ఓదార్చే అర్హత లేదు 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ధ్వజం 

సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు  పవన్‌ కల్యాణ్‌ చేస్తోంది చంద్రబాబు భరోసా యాత్ర అని అందరికీ స్పష్టంగా అర్థం అవుతోందని వైఎస్సార్‌సీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఎంత మంచి చేస్తోందో కనీస అవగాహన లేకుండా పవన్‌.. కౌలు రైతు భరోసా యాత్ర కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పడం చూస్తుంటే ఆయన చంద్రబాబుకు దత్తపుత్రుడు కాక మరేమవుతారని ప్రశ్నించారు.

రైతుల పేరుతో రాజకీయం చేస్తూ.. చంద్రబాబుకు లబ్ధి చేకూరుస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంలో తయరయ్యే స్క్రిప్ట్‌ మేరకు స్క్రీన్‌ప్లే, కథ, దర్శకత్వం సాగుతోందని.. వెరసి చంద్రబాబు ఆనే నిర్మాతకు అనుకూలంగా వపన్‌ కల్యాణ్‌ నటిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

చంద్రబాబు కోసమే తాను ఈ పని చేస్తున్నానని ప్యాకేజీ స్టార్‌ స్పష్టంగా చెప్పేశారన్నారు. ‘చంద్రబాబు అధికారంలోఉంటే... యాంటి ఇంకంబెన్సీ ఓటును, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చటానికి, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసి పోటీ చేయాలని మిగతా పార్టీలను కూడా సిద్ధం చేయటానికే పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ పెట్టారు.

చంద్రబాబుకు సొంత పుత్రుడు లోకేశ్‌పై నమ్మకంలేకనే.. దత్త పుత్రుడి వెంట పడుతున్నారు. బీజేపీ వెంట ఉన్న పవన్‌.. ఎప్పుడెప్పుడు చంద్రబాబు తోక పట్టుకోవాలా.. అని తహతహలాడుతున్నారు. రియల్‌ లైఫ్‌లో, పొలిటికల్‌ లైఫ్‌లో ఒక సిద్ధాంతం అంటూ లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇదీ క్యారెక్టర్‌ లేని ఈ ఆర్టిస్టు పరిస్థితి.

ఇవాళ చనిపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదుకుంది. మహిళలంటే వాడుకుని వదిలేసే వస్తువులుగా చూస్తున్న పవన్‌కల్యాణ్‌.. ఇవాళ ఏ ఒక్క అక్కచెల్లెమ్మను ఓదార్చడానికి అర్హుడు కాదు. అయినా చంద్రబాబుకు కానీ, పవన్‌కు కానీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర లేదు’ అని అన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top