ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు ఎంత వ్యయం అవుతోంది?ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 94 నుంచి 98 శాతం వ్యయం అవుతోందని ,సంక్షేమ స్కీములకు అప్పులు తెస్తున్నామని ఆర్ధిక పరిస్థితి శ్వేతపత్రం విడుదల సందర్భంగా చెప్పారు. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన పడుతున్నారు. వారి సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. వీరిలో కొందరు టీడీపీ అనుకూల నేతలు కూడా ఉండడం గమనార్హం.ప్రస్తుతం ఏపీ ఎన్‌జీవోల గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అద్యక్షుడుగా ఉన్న అలపర్తి విద్యాసాగర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి కాదని అంటారు. కాని ఆయన సైతం చంద్రబాబు అసత్యపు లెక్కలు చెప్పారని అంటున్నారు.
చంద్రబాబు చెప్పేదానిలో నిజం ఉంటే, ఈ నేతలు ఇంత ధైర్యంగా ఖండించగలుగుతారా అన్నది చర్చ. చంద్రబాబు లెక్కల్లో ఎక్కువ సందర్భాలలో నిర్దిష్టత అన్నది ఉండదు. అందువల్ల ఆయన చెప్పేదానిలో సత్యం ఎంత ఉంది?అసత్యం ఎంత ఉంది అన్నది తేల్చడం అంత తేలికకాదు. మొత్తం ప్రభుత్వ లెక్కలన్నీ పరిశీలించి ఒక అవగాహనకు రావల్సి ఉంటుంది. అందువల్లే ఉద్యోగ సంఘాల నేతలు అన్నిటిని సరిపోల్చుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంంది. విద్యాసాగర్ చెబుతున్నదాని ప్రకారం 30 నుంచి 35 శాతమే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలతో వంచిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరింత వివరంగా ఈ అంశంపై మాట్లాడారు. 2025లో ప్రభుత్వం వ్యయం చేసిన 2.26 లక్షల కోట్లలో 37.4 శాతం మాత్రమే ఉద్యోగులకు అయిన ఖర్చు అని ఆయన చెప్పారు.
ప్రభుత్వానికి వచ్చే పన్నుల రాబడిలో 59శాతం,ఇతర రాబడి కూడా కలిపితే 49 శాతం మాత్రమే ఉద్యోగులకు పెడుతన్న ఖర్చు అని ఆయన వివరించారు. ఈ రెండేళ్లలో 41వేల మంది రిటైరైతే,వచ్చే ఐదేళ్లలో లక్షన్నర మందికి పైగా రిటైర్ కాబోతున్నారని, అదే సమయంలో కొత్త రిక్రూట్ మెంట్ జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో సంపద సృష్టించి హామీలు నెరవేర్చుతామని చంద్రబాబు అన్నారని, ఉద్యోగులకు పలు వరాలు ప్రకటించారని,జాబ్ కాలెండర్ ఇస్తామన్నారని,కాని ఇప్పుడేమో డబ్బంతా ఉద్యోగులకే అయిపోతోందని ప్రచారం చేస్తున్నారని వలిశెట్టి దామోదర్ అనే మరో ఉద్యోగ సంఘ నేత పేర్కొన్నారు.
గతంలో ఉద్యోగుల నేతగా ఉండి,ప్రభుత్వ ఆగ్రహానికి గురైన మరో ప్రముఖుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని, ఉద్యోగులకు 30వేల కోట్ల బకాయిలు చెల్లించామని ఆయన అనడం అసత్యమని అన్నారు. ఉద్యోగుల జీతాల ఖర్చు 35 నుంచి నలభై శాతమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికి 50 వేల కోట్ల మేర ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ పడిందని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం చర్చలు జరిపి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పినా, ఆచరణలో జరగడం లేదని ఈ నేతలంతా అంటున్నారు. మరో వైపు గ్రామ,వార్డు సచివాలయుద్యోగుల బాధలు ఇంకో విధంగా ఉన్నాయి. వారు సభలు పెట్టుకుని ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
తమపై పనిభారం పెంచడమేకాకుండా,తమ 22 డిమాండ్లను పక్కనబెట్టిందని వారు ధర్నా చేశారు. కరపత్రాలు పంచడానికి తమను ఇంటింటికి వెళ్లమంటున్నారని,సర్వేల పేరుతో విసిగిస్తున్నారని ,ఆ క్రమంలో తాము ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కుంటున్నామని చెబుతున్నారు.ఇవన్ని చూస్తుంటే ప్రభుత్వంలో ఉద్యోగులలో దాదాపు ఎవరూ సంతోషంగా లేరనిపిస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి,కీలక మంత్రి ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్‌లలో తిరుగుతూ కోట్లు వ్యయం చేస్తున్నారని,మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రం ప్రజలలో చెడు అభిప్రాయం కలిగించడానికి యత్నిస్తున్నారని వారు ధ్వజమెత్తుతున్నారు.వీరు చెప్పే విషయాలలో చాలావరకు వాస్తవాలు ఉండవచ్చు.ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని చెప్పడం ద్వారా కొత్తగా పిఆర్సి వేయలేమని, ఇంటెరిమ్ రిలీఫ్ ఇవ్వలేమని చంద్రబాబు సంకేతం పంపినట్లయిందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి ఇష్టారాజ్యంగా వ్యయం చేస్తున్న వైనాన్ని ఉద్యోగులు కూడా గమనిస్తున్నారు. ఏకంగా నాలుగు భవనాల అద్దాలకు 2500 కోట్లు ,రీడిజైనింగ్ కన్సల్టెన్సీకి అదనంగా 206 కోట్లు, హైకోర్టు వెలుపల సుందరీకరణకు 540కోట్లు ..ఇలా మితిమీరి ఖర్చు చేసే ప్రభుత్వం ఉద్యోగుల వద్దకు వచ్చేసరికి ఆదాయం అంతా జీతాలకే సరిపోతోందని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడానికేనన్నది వారి భావన.ఉద్యోగ సంఘాల నేతలపై కూడా రెడ్ బుక్ ప్రయోగం చేయకపోలేదు. అయినా వెంకట్రామిరెడ్డి వంటివారు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ,జనసేన కలిసి ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టోలో ఉద్యోగులకు ఏమి హామీలు ఇచ్చారో గమనించండి. ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్టిస్తామని ఒక సెంటిమెంట్ ను రెచ్చగొట్టే యత్నం చేశారు.కాని ఇప్పుడేమో అవమానించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన ఉద్యోగులలో కలుగుతోంది.జగన్ ప్రభుత్వం జిపిఎస్ తీసుకువచ్చి ఒక పరిష్కారాన్ని కనుగొనే యత్నం చేస్తే, చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు దానిపై దుష్ప్రచారం చేశారు.
తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్,జిపిఎస్ విధానాలను పునఃసమీక్షించి పరిష్కారం చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆ ఊసే తేవడం లేదు. మెరుగైన పీఆర్సీ,ఐఆర్. వెంటనే ప్రకటిస్తామని మానిఫెస్టోలో చెప్పినా అతీగతీ లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైరైనవారికి మొదటి తేదీనే జీతాలు పెన్షన్ ఇస్తామని,వారికి రావల్సిన బకాయిలు చెల్లిస్తామని వాగ్దానం చేశారు. కాని చంద్రబాబు ఈ విషయంలో చెబుతున్న లెక్కలు తప్పని ఉద్యోగ నేతలు విమర్శిస్తున్నారు. వలంటీర్ల గౌరవ వేతనాన్ని ఐదువేల నుంచి పదివేలు చేస్తామని చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు దేవుళ్ల సాక్షిగా ప్రకటించారు కాని, అసలు మొత్తం వ్యవస్థనే లేకుండా చేయడం మోసం కాదా అన్నది వారి ప్రశ్నగా ఉంది. ఈ నేపధ్యంలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి సన్నద్దమవుతున్నాయి.
అయితే ఏదో రకంగా వారిని భయపెట్టో, మభ్యపెట్టో వారి ఉద్యమానికి ప్రభుత్వపరంగా అడ్డుకట్ట వేసే యత్నం జరుగుతుంది. విశేషం ఏమిటంటే ఎల్లో మీడియా ద్వారా మాత్రం ఉద్యోగులకు ఏదో చాలా జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. గత జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఉద్యోగులను ఎన్నిరకాలుగా రెచ్చగొట్టాలో అన్ని విదాలుగా టీడీపీ,జనసేనలతో పాటు ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా రెచ్చగొట్టాయి. ఇప్పుడు అదేమీడియా ఉద్యోగులను మభ్యపెట్టే పనిలో పడింది. ప్రభుత్వ ఉద్యోగులు గత జగన్ టైమ్ లో తమ టైమ్ ప్రకారం డ్యూటీ చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు జనాన్ని పోగు చేసే పనే ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. ఇప్పటికైనా పాలేవో,నీళ్లేవో ఉద్యోగులు గమనించారా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


