షర్మిల పార్టీపై రేపే నిర్ణయమా?

Sharmila Key Announcement About YSRTP On YSR Death Anniversary - Sakshi

గురువారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీని కలిసిన వైఎస్‌ షర్మిల రేపు(శనివారం) కీలక నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం. రెండేళ్లుగా తాను చేసిన పోరాటాలను ఈ సందర్భంగా షర్మిల సోనియాకు వివరించినట్టు YSRTP వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఓ ట్వీట్‌ను కూడా పార్టీ చేసింది. 

తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి ఏ నిర్ణయం అయినా తీసుకుంటామని ఇప్పటికే సంకేతాలిచ్చింది షర్మిల. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా YSRTPని విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ వర్థంతి సందర్భంగా రేపే పార్టీ విలీనం చేస్తుందని కొందరు చెబుతున్నారు. అయితే రాహుల్ గాంధీ షెడ్యుల్ బిజీగా ఉండటంతో విలీనం ప్రక్రియ వాయిదా పడవచ్చని మరికొందరు చెబుతున్నారు. తాను తెలంగాణను ఎంచుకున్నానని, తెలంగాణలోనే రాజకీయం చేస్తానని ఇటీవల కాంగ్రెస్‌ అధిష్టానానికి షర్మిల స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే షర్మిల రాజకీయ భవిష్యత్‌పై సోనియా హామీ ఇచ్చినట్టు, జాతీయస్థాయిలో ఓ కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
చదవండి: గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించా: సీఎం కేసీఆర్‌

షర్మిలతో చర్చలకు సంబంధించి ఆపరేషన్‌ అంతా బెంగుళూరు కేంద్రంగా డీకే శివకుమార్ చేపట్టినట్టు కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. షర్మిల రావడం ఇష్టం లేని నాయకులతో చర్చించే బాధ్యత కూడా శివకుమార్‌కే పార్టీ అప్పగించినట్టు సమాచారం. ఇప్పటికే పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో శివకుమార్‌ చర్చించిన్నట్టు సమాచారం. ఈ చర్చల్లో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నట్టు తెలిసింది. ఈ సమావేశం కోసమే రేవంత్‌ రెడ్డి బెంగళూరు వెళ్లారని సమాచారం.  

అయితే మొదటి నుంచి తెలంగాణలో షర్మిల రాజకీయానికి విముఖత చూపుతున్న రేవంత్ రెడ్డి.. తన అభ్యంతరాలను ఈ సమావేశంలో తెలిపినట్లు కనిపిస్తోంది. అవసరమైతే ఎన్నికల తర్వాత షర్మిలను చేర్చుకోవాలని అధిష్టానానికి సూచించిట్టు సమాచారం. ఎన్నికలకు ముందే చేర్చుకుంటే కేసీఆర్‌కు అస్త్రంగా మారొచ్చని, పైగా తాను పాలేరులో పోటీ చేస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించిందని రేవంత్‌ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. అసలు షర్మిలకు చెక్ పెట్టేందుకే తుమ్మలను రేవంత్ తెరపైకి తెచ్చినట్టు కాంగ్రెస్‌లో ప్రచారం ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top