
సాక్షి,కాకినాడ జిల్లా: ‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు..’ ఏపీలో ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్లి మరీ మహిళలు, పిల్లలందరికీ ఈ వాగ్ధానమిచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లు మాట్లాడారు. యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా.. ‘‘మీకు పద్దెనిమిది వేలు’’ అని, వలంటీర్ల దగ్గరకు వెళ్లి ‘‘మీకు నెలకు పదివేలు ఖాయం’’ అంటూ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చారు. కానీ ఇప్పుడు కూటమి నేతలకు చెప్పిన మాటలకు చేసే చేతలకు అసలు పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
తాజాగా, హంసవరం జడ్పీ,మోడల్ స్కూల్స్‌లో మెగా పేరెంట్స్ సమావేశంలో రచ్చ జరిగింది. విద్యార్ధుల తల్లిదండ్రుల తరపున తల్లికి వందనంపై సర్పంచ్ మేరి అధికారులను ప్రశ్నించారు. చాలా మందికి తల్లికి వందనం రూ.8వేలే అందినట్లు చెప్పారు.తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. దీంతో మేరీ మాట్లాడుతుండగా..అధికారులు మైక్ కట్ చేశారు. కంగుతిన్న టీడీపీ నేతలు ప్రభుత్వం పరువుపోతుందంటూ మేరి చేతిలో మైకును లాక్కున్నారు.