పేదలకు లబ్ధి చేకూర్చడానికే ఓటీఎస్‌

Sajjala Ramakrishna Reddy call to YSRCP corporators and councilors in teleconference - Sakshi

చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారాలను తిప్పికొట్టండి

టెలీ కాన్ఫరెన్స్‌లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు సజ్జల పిలుపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు లబ్ధి కలగకుండా అడ్డుకోవాలనే కుట్రతోనే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్లో మీడియా అపోహలు సృష్టిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి మునిసిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో ఆదివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాలు, నగరాలలో భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు పొంది నిర్మించుకున్న ఇళ్లకు జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల పేదలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

పేదలకు సంపూర్ణ ఆస్తి హక్కు కల్పించే ఈ పథకాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రయత్నిస్తున్నాయన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సమయంలో ప్రతి జిల్లాలోనూ గృహ రుణం తీసుకున్న లబ్ధిదారులు వారి సమస్యలను ఏకరవు పెట్టుకున్నారని గుర్తు చేశారు. రుణాన్ని తీర్చినప్పటికి  డీ–ఫారం పట్టాల వల్ల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి, కుటుంబ సభ్యుల పేరిట బదిలీ చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. గృహం విలువ పెరిగినప్పటికీ విక్రయించుకోవాలంటే తక్కువ ధరకు తెగనమ్ముకోవాల్సి వస్తోందని వాపోయిన విషయాలను గుర్తు చేశారు.

అసైన్డ్‌ భూముల విలువ పెరిగినప్పటికీ ఆ భూముల బదలాయింపులో ఉన్న సమస్యల కారణంగా లబ్ధిదారులు వాటిని అనుభవించలేకపోతున్నారని పరిశీలనలో వెల్లడైందన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అసైన్డ్‌ భూములు కేటాయించిన పదేళ్ల తర్వాత లబ్ధిదారుల సొంతమయ్యేలా చట్ట సవరణ చేశామన్నారు. ఈ క్రమంలోనే  జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి రూపకల్పన చేశామని వివరించారు.

రుణ భారం వదిలించి శాశ్వత హక్కు కల్పించేందుకు..
పేదలకు వారి గృహాలపై శాశ్వత హక్కు కల్పించాలనే సదుద్దేశంతో ఆ గృహాలపై తీసుకున్న రుణంలో అసలు, వడ్డీ ఎంత ఉన్నప్పటికీ.. వాటిని నామమాత్రపు ఫీజులతో రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించామని వివరించారు. వాస్తవం ఇలా ఉంటే చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా పేదలను ప్రభుత్వం దోచుకుంటోందని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ పథకం వల్ల గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించిన 50 లక్షల గృహాలు, ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌ మంజూరు చేసిన 30 లక్షల ఇళ్లు వెరసి దాదాపు 80 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరితే ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉండవనే భయంతోనే ఓటీఎస్‌ పథకంపై విష ప్రచారానికి ఒడిగట్టారన్నారు. ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను జాగృతం చేయాలని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని సజ్జల పిలుపునిచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top