కేటీఆర్‌ను విచారిస్తే నిజాలు తెలుస్తాయి

RS Praveen Kumar on the leak of TSPSC papers - Sakshi

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో సీఎం కేసీఆర్‌ కుటుంబానికి సంబంధం ఉందని తాను మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–1 సహా మిగిలిన పరీక్ష పేపర్ల లీకేజీలో ఐటీ శాఖకు ప్రత్యక్ష సంబంధం ఉందన్నట్లుగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు ఈ వ్యవహారంలో సంబంధం ఉందని ఆయన మాటల ద్వారానే తెలుస్తోందని, ఆయనను సిట్‌ విచారిస్తే నిజాలు తెలుస్తాయని అన్నారు.

మంగళవారం ఆయన బీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ కటాఫ్‌ మార్కుల వివరాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించకున్నా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో, సిరిసిల్లలో ఎంతమంది పరీక్ష రాస్తే ఎందరు క్వాలిఫై అయ్యారో కేటీఆర్‌ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు ఆ డేటా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డిగానీ, కమిషన్‌ సభ్యులుగానీ ఇచ్చారా అని అనుమానం వ్యక్తం చేశారు.

పేపర్ల కుంభకోణానికి తనకు సంబంధం లేదంటూనే టీఎస్‌పీఎస్సీ తరపున కేటీఆర్‌ వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులు మాత్రమే లీకేజీ అంశాలను వెల్లడించాల్సి ఉండగా, ఆ సంస్థ అధికార ప్రతినిధిగా కేటీఆర్‌ ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఆఫీస్‌ ఈ వ్యవహారంలో రిమోట్‌గా పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులకు నోటీసులు ఇస్తూ కేటీఆర్‌కు మాత్రం డేటా ఇస్తున్నారన్నారు.

పేపర్‌ లీకేజీపై చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కమిషన్‌ చైర్మన్, సభ్యుల హస్తం ఉందని ఆరోపించారు. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్‌ తారుమారు చేశారనే అనుమానం బలపడుతోందని, కీలకమైన సాక్ష్యాలను చెరిపివేశారనే అనుమానం కూడా కలుగుతోందన్నారు. 80 నుంచి 90 మార్కులుపైగా వచ్చిన వాళ్ల ఓఎంఆర్‌ షీట్లను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.   

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top