ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ‘ఉనికి’ పాట్లు..! ఎంపీ ఎన్నికల్లో పరిస్థితేంటో?

Is Revival Possible For Brs Party In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి గుదిబండగా మారిందా? గడచిన మూడు ఎన్నికల్లోనూ ఒక్కో సీటు మాత్రమే ఇక్కడ గెలవడానికి కారణం ఏంటి? జిల్లా ప్రజల్ని, నాయకుల్ని అంచనా వేయడంలో గులాబీ బాస్‌ ఫెయిల్ అయ్యారా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ను సమూలంగా ప్రక్షాళన చేయడం సాధ్యమేనా? జిల్లాలో కొత్త నాయకత్వం తయారవుతుందా? పార్టీకి వైభవం వస్తుందా? 

తెలంగాణలో  బీఆర్ఎస్ పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే అని రాజకీయాలు తెలిసిన ఎవరైనా చెబుతారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈ జిల్లాలో వచ్చే ఫలితాలు గులాబీ పార్టీని నిరాశకు గురిచేస్తున్నాయి. జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉంటే...ప్రతిసారి ఒక్క సీటు మాత్రమే గులాబీ పార్టీకి దక్కుతోంది.

దీంతో ఇతర పార్టీల తరపున గెలిచినవారిని చేర్చుకుని బలపడ్డామని గులాబీ పార్టీ నాయకత్వం ఇప్పటివరకు భావిస్తూ వచ్చింది. అయితే ఈసారి పరిస్థితి రివర్స్‌ అయింది. రాష్ట్రంలో అధికారం కూడా పోయింది. బీఆర్‌ఎస్‌లో బలమైన నేతలు కొందరు వెళ్లి కాంగ్రెస్‌లో చేరిపోవడంతో పార్టీ జిల్లాలో మరింత బలహీనంగా మారింది.

గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో ఒక్కో సీటే వచ్చినా రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. సింగిల్ సీటు రావడం..అదొక సెంటిమెంట్‌ అనుకున్నారు గులాబీ నేతలు. ఈసారి ఆ సెంటిమెంట్‌ పనిచేయలేదు. తాజా పరిణామాలతో ఈ జిల్లాలో బీఆర్‌ఎస్‌ని పూర్తిస్తాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఆ పార్టీ పెద్దలు. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా తయారైంది.

ప్రస్తుతం జిల్లాకు చెందినవారే రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలం పెంచుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పార్టీని, నాయకత్వాన్ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ ఖమ్మంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని అక్కడి నేతలు చెబుతున్నారు. ఇలానే వదిలిస్తే జిల్లాలో గులాబీ పార్టీ మరింత వీక్ అవ్వడం ఖాయం అంటున్నారు. 

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి కొరుకుడు పడటంలేదనే చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితిలో ఏమాత్రం మార్పురాలేదు. అందుకే కేసీఆర్, కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి కష్టపడితేనే జిల్లాలో బీఆర్ఎస్‌ ఉనికి చాటుకోగలదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీ గాడిన పెడతారో లేదో కాలమే నిర్ణయిస్తుంది. 

ఇదీచదవండి.. క్యాబినెట్‌ విస్తరణకు మహూర్తం ఫిక్స్‌..!

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top