Ashok Gehlot: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా

Rajasthan CM Ashok Gehlot Announces Run For Congress President - Sakshi

కొచ్చి/జబల్పూర్‌: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని పార్టీ సీనియర్‌ నేత, రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు. తన తర్వాత రాజస్తాన్‌ సీఎం ఎవరన్నది కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అజయ్‌ మాకెన్‌ నిర్ణయిస్తారన్నారు. పార్టీలో ఇటీవల తెరపైకి వచ్చిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అంశంపై చర్చ అనవసరమన్నారు. గెహ్లాట్‌ శుక్రవారం మహారాష్ట్రలోని షిర్డీలో మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని రాహుల్‌ గాంధీ తనతో చెప్పారన్నారు. నామినేషన్‌ ఎప్పుడు దాఖలు చేయాలన్నది రాజస్తాన్‌ వెళ్లాక నిర్ణయించుకుంటానన్నారు. ఎన్నికలో పోటీ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమని, నూతన ప్రారంభానికి శ్రీకారం చుడతామని వ్యాఖ్యానించారు.  

ఫలితాల తర్వాత కలిసి నడవాల్సిందే.. 
కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ కూడా అధ్యక్ష పోస్టుకి పోటీ పడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, గెహ్లాట్‌ స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ మిత్రులు ఎవరైనా అధ్యక్ష పదవిని కోరుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఫలితాల తర్వాత అందరూ కలిసి నడవాల్సిందే. బ్లాక్, గ్రామం, జిల్లా స్థాయిల్లో పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఐక్యమత్యంగా పనిచేయాలి. కాంగ్రెస్‌ను బలమైన ప్రతిపక్షంగా మార్చుకోవాలి’’ అని ఉద్ఘాటించారు. దేశంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బలమైన ప్రతిపక్షం తప్పనిసరిగా అవసరమని గెహ్లాట్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడబోనని రాహుల్‌ గాంధీ ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే.  కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని పార్టీ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ కూడా తాజాగా తెలిపారు.

ఇదీ చదవండి: అతి త్వరలో సీఎంగా సచిన్ పైలట్.. హింట్ ఇచ్చిన మంత్రి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top