మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో బలపరీక్ష! స్పీకర్‌ను కలిసిన బీజేపీ

Rajasthan Assembly Floor Test Soon Bjp Meets Speaker - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో రాజకీయాలు మరోసారి వెడెక్కాయి. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని బీజేపీ నేతల బృందం మంగళవారం ఉదయం కలవడం చర్చనీయాంశమైంది. గత నెలలో రాజీనామా చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు స్పీకర్‌ను కోరినట్లు తెలుస్తోంది. వాళ్లందరి రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది.

బీజేపీ ఎ‍మ్మెల్యే రామ్‌లాల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత నెలలో రాజీనామాలు చేసినట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. స్పీకర్‌ ఈ రాజీనామాలపై ఏదో ఒకటి తేల్చాలని, ఆమోదిస్తున్నారో లేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారమే తాము ఈ డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

రాజస్థాన్ ప్రతిపక్షనేత గులాబ్ చంద్ కటారియా కూడా రాజస్థాన్‌లో రాజకీయ అస్థిరత నెలకొందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు.  రాజీనామా చేసిన మంత్రులకు ఇంకా ఆ హోదా ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ సంక్షోభం
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. అశోక్ గహ్లోత్ కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే సీఎం పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే సచిన్‌ పైలట్‌ను కొత్త ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తారని ప్రచారం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గహ్లోత్ వర్గంలోని 91 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశాన్ని బహిష్కరించి మరీ వేరుగా భేటీ అయ్యారు. అనంతరం రాజీనామా లేఖలను స్పీకర్‌కు సమర్పించినట్లు ప్రచారం జరిగింది. 

ఈ విషయంపైనే ఇప్పుడు బీజేపీ నేతలు స్పీకర్‌ను కలిశారు. ప్రస్తుతం గహ్లోత్ సర్కార్ మైనారిటీలో పడిందని, అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top