
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎస్పీని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కలిశారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి సంబంధించి కూడా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
అనంతరం సతీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇది పులివెందుల పౌరుషానికి సంబంధించిన ఎన్నిక. టీడీపీ నేతల ఆగడాలను అంతులేకుండా పోతోంది. దాడులకు పాల్పడుతూ మా శ్రేణులను రెచ్చగొడుతున్నారు. టీడీపీ దాడులకు భయపడేది లేదు. ఏ క్షణంలోనైనా మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. తర్వాత మా కేడర్‌ను అరెస్ట్ చేయొచ్చు. మాపై దాడులు చేసినా.. మా ప్రాణాలు లేకుండా పోయినా.. మా ఆడవాళ్లు ముందరుండి ఎన్నిక నడిపిస్తారు. పులివెందుల మహిళల చేతుల్లో ఎన్నిక బాధ్యత పెడుతున్నాం. గ్రామాల్లో మగాళ్లను తరిమేసినా మా ఆడవాళ్లు ఎన్నికను గెలిపిస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు సురేష్ కుమార్‌రెడ్డి, అమరేశ్వర రెడ్డిపై దాడి అమానుషమన్నారు. వివాహానికి వెళ్తున్న వీరిపై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారు. వారిని చంపాలని అధికార పార్టీ నాయకులకు చెందిన అనుచరులు దాడులు చేశారు. శాంతియుతంగా ఉన్న పులివెందులలో అరాచకాలు సృష్టిస్తున్నారు. పులివెందులలో భయాందోళనలకు గురి చేసేలా అల్లర్లు చేస్తున్నారు. దాడి చేసిన దుండగులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు’’ అంటూ సతీష్‌రెడ్డి మండిపడ్డారు.
‘‘ఇవాళ మళ్ళీ దాడులు చేసిన వాళ్లే ఉదయం రసూల్ అనే వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడికి ప్రయత్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చూడాలి. ఎటువంటి అల్లర్లకు ఆస్కారం లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులపై బైండోవర్ పెడతామని బెదిరిస్తున్నారు. టీడీపీ నాయకుల మాట విని దాడులు చేస్తే చూస్తూ ఊరుకుని కూర్చునే వారు లేరు. గత ప్రభుత్వ హయాంలో అన్ని ఎన్నికలు శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించారు. అనవసరమైన నిందలు, ఆరోపణలు చేస్తూ ప్రజలలో అపోహలు సృష్టిస్తున్నారు.

..2019 నుండి 24 వరకు జగన్ సీఎం గా ఉండగా ఎప్పుడూ ఇలా జరగలేదు. టీడీపీ నాయకులు స్వేచ్చగా తిరగలేదా?. రాంగోపాల్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడితే ఎక్కడైనా గొడవలు జరిగాయా?. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మద్యం స్కాం అంటూ విష ప్రచారం చేస్తున్నారు. వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అందరితో ఫోటోలు దిగారు. టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులతో అనేక ఫోటోలు ఉన్నాయి. కేవలం జగన్ తో ఫోటో దిగితే తమకు సంబంధించిన వ్యక్తి ఎలా అవుతాడు?. ఎల్లో మీడియా లో విష ప్రచారం తగదు. దుష్ప్రచారం తో ప్రజలను నమ్మించాలని చూస్తే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు స్వచ్ఛందంగా జగన్ పర్యటనకు తరలివస్తున్నారు’’ అని సతీష్‌రెడ్డి అన్నారు.