నేటి జేపీ నడ్డా పర్యటన రద్దు: 8న తెలంగాణకు ప్రధాని మోదీ!

Prime Minister Narendra Modi will visit the state on April 8 - Sakshi

అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశం... పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు హాజరు! 

నేటి నడ్డా పర్యటన రద్దు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రదానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 8న రాష్ట్రానికి రానున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సికింద్రాబాద్‌–తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తారని, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని తెలిపాయి. శంకుస్థాపన కార్యక్రమం గతంలో రెండుసార్లు వాయిదా పడడంతో దీనిని అధికారికంగా ప్రకటించే విషయంలో రైల్వే, ఇతర అధికారులు ఆచితూచి స్పందిస్తున్నారు.

పార్టీ నేతలు మాత్రం మోదీ కార్యక్రమం ఖరారైనట్టే చెబుతున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలోనూ ప్రధాని ప్రసంగిస్తారని అంటున్నారు. సభకు ఏర్పాట్లు, ప్రధాని పర్యటన విజయవంతం చేయడంపై అంతర్గతంగా పార్టీలో కసరత్తు సాగుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేస్తామనే ధీమాను మోదీ వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని, పార్టీ కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందని, అధికారంలోకి వచ్చేందుకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మోదీ రాష్ట్ర పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడిందని రాష్ట్ర ముఖ్య నేతలు చెబుతున్నారు.  

అన్నీ వర్చువల్‌గానే.. 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన రద్దయింది. శుక్రవారం సంగారెడ్డిలో జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభానికి నడ్డా రావాల్సి ఉంది. కానీ పర్యటన రద్దు కావడంతో ఢిల్లీ నుంచే వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్‌ జిల్లా పార్టీ కార్యాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలను కూడా నడ్డా వర్చువల్‌గానే ప్రారంభిస్తారు. అక్కడి నుంచే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

సంగారెడ్డిలో జరిగే కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌ చుగ్, సునీల్‌ బన్సల్‌ తదితరులు హాజరుకానున్నారు. ఇలావుండగా సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జిల సమావేశం జరుగుతుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top