సీఎంగా నితీష్‌.. ప్రశాంత్‌ కిషోర్‌ ఆసక్తికర ట్వీట్‌

Prashant Kishor Tweet On Nitish Kumar Over Oath - Sakshi

పట్నా : దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి రగిల్చిన బిహార్‌లో నేడు (సోమవారం) కీలక ఘట్టం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమిలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ.. జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం నితీష్‌తో పాటు 14 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్‌ రాజకీయాల్లో చాణిక్యుడిగా పేరొందిన నితీష్‌.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక సీఎంగా ఎన్నికైన నితీష్‌కు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఎన్డీయే పక్షాలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. (సోదరుడికి చెక్‌.. బీజేపీతో పొత్తుకు సై!)

ఈ క్రమంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ సైతం నితీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ఎన్నికై నితీష్‌ను అభినందిస్తూనే సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్‌ చేసిన ప్రశాంత్‌ కిషోర్‌ ‘బీజేపీ నామినేటేడ్‌ ముఖ్యమంత్రి నితీష్‌కు శుభాకాంక్షలు. సీఎంగా అలసిపోయి, రాజకీయంగా వెనుబడిన ముఖ్యమంత్రి (నితీష్‌) పాలనను భరించేందుకు బిహార్‌ ప్రజలు మరో కొనేళ్ల పాటు సిద్ధంగా ఉండాలి’ అంటూ ఆసక్తికరంగా ట్వీట్‌ చేశారు. (నితీష్‌ కుమార్‌ సీఎం కుర్చీకి ముప్పు!?)

కాగా గతంలో నితీష్‌ కుమార్‌కు మద్దతుగా నిలిచిన ప్రశాంత్‌ కిషోర్‌ గత ఏడాది ఆయనతో విభేదించిన విషయం తెలిసిందే. దీంతో జేడీయూ ఉపాధ్యక్ష పదవి నుంచి ప్రశాంత్‌ను తొలగిస్తూ నితీష్‌ కుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో కలిసి పోటీచేయాలన్న నితీష్‌ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్షాలకు మద్దతుగా ప్రచారం చేస్తారనుకున్న ప్రశాంత్‌.. మౌనంగా ఉన్నారు. ఎట్టకేలకు నాలుగు నెలల అనంతరం తొలిసారి నితీష్‌పై స్పందించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top