కాషాయ గూటికి మాజీ సీఎం కుమారుడు!

MK Alagiri May form a political Against DMK - Sakshi

అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు

సాక్షి, చెన్నై : వరుస విజయాలతో ఉత్తరాన మంచి ఊపుమీద ఉన్న బీజేపీ.. దక్షిణాదిపై కన్నేసింది. ఇప్పటికే కర్ణా​టకలో కాషాయ జెండా ఎగరేసి.. మరింత విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఇలాంటి వ్యూహన్నే అమలు చేస్తోంది. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి సీనియర్‌ నేతలను కాషాయ గూటికి చేర్చుకుంటోంది. ఇక తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడుపై బీజేపీ నాయకత్వం మరింత దృష్టి సారించింది. ఇప్పటికే అధికార అన్నాడీఎంకేను తన గుప్పిట్లోకి తెచ్చుకున్న మోదీ-షా ద్వయం అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. 2021 ప్రతమార్థంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. డీఎంకే-కాంగ్రెస్‌ కూటమికి వ్యతిరేకంగా మిత్రలను దగ్గరకు చేర్చుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్‌, డీఎంకేల నుంచి నాయకులకు గాలం వేస్తోంది. దీనిలో భాగంగానే హస్తం పార్టీ సీనియర్‌ నేత ఖుష్బూను ఇటీవల బీజేపీలో చేర్చుకుంది. (అక్కడ గెలిస్తే.. అధికారం చేతికొచ్చినట్టే)

ముఖ్యంగా డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌కు చెక్‌ పెట్టాలను బీజేపీ నాయకత్వంలో తెరవెనుక వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే డీఎంకే బహిష్కృత నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు ఎంకే అళగిరికి గాలం వేస్తోంది. తమిళనాడు రాజకీయ వర్గాల ద్వారా వినిపిస్తున్న సమాచారం మేరకు.. ఇప్పటికే స్థానిక బీజేపీ నేతలు అళగిరితో భేటీ అయ్యారని, పార్టీ పెద్దల్ని కలిసేందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.  ఈనెల 21న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నట్లు కూడా తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. రానున్న ఎన్నికల్లో డీఎంకేకు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా ఓ పార్టీని సైతం నెలకొల్పుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు అళగిరి మద్దతుదారులు సైతం బీజేపీతో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కరుణానిధి మరణం అనంతరం డీఎంకే పగ్గాలు చేపట్టాలనుకున్న అళగిరికి స్టాలిన్‌ చెక్‌ పెట్టిన విషయం తెలిసిందే. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే అన్నపై వేటు వేశారు. డీఎంకేను పూర్తిగా తన కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి డీఎంకేకు అళగిరి దూరంగా ఉంటున్నారు. అయితే ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో.. మరోసారి క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయన మద్దతు దారులు డిమాండ్‌ చేస్తున్నారు. డీఎంకే నుంచి బహిష్కరించి అవమాన పరిచిన స్టాలిన్‌ను దెబ్బకొట్టాలని  ఆయన వర్గం కసితో ఉంది.  ఈ క్రమంలోనే బీజేపీకి దగ్గరయ్యేందుకు దారులు వెతుకుతున్నారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే అసెంబ్లీ ఎన్నికల నాటికి అళగిరి ఓ కొత్త పార్టీని స్థాపించి.. ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. లేకపోతే అమిత్‌ షాతో భేటీ అనంతరం బీజేపీలో చేరనున్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు సోదరుడి అడుగులను నిషితంగా పరిశీలిస్తున్న స్టాలిన్‌.. సీనియర్‌ నేతలతో మంతనాలు సైతం ప్రారంభించారు. అళగిరి వెంట ఉన్న డీఎంకే మద్దతుదారులను తనవైపుకు తిప్పుకునేందుకు దూతను పంపుతున్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top