నితీష్‌ కుమార్‌ సీఎం కుర్చీకి ముప్పు!?

Nitish Kumar May Not Survive Full Time CM To Bihar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నితీష్‌ కుమార్‌ ఈ రోజు (సోమవారం) సాయంత్రం బిహార్‌‌ ముఖ్యమంత్రిగా ఏడవ సారి పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగినట్లయితే బిహార్‌ రాష్ట్రానికి అత్యధిక కాలంపాటు కొనసాగిన ముఖ్యమంత్రిగా కొత్త చరిత్రను సష్టిస్తారు. ఓ రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడం అన్నది మామూలు విషయం కాదు. అందున అగ్రవర్ణ కులం నుంచో లేదా రాష్ట్రంలో ప్రాబల్యం ఎక్కువగా ఉన్న యాదవ కుటుంబం నుంచి కాకుండా ఓ కుర్మి సామాజిక వర్గానికి చెందిన నితీష్‌ కుమార్‌ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం మామూలు విషయం కాదు. బిహార్ రాష్ట్ర జనాభాలో కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న కుర్మీ కమ్యూనిటీ నుంచి ఈ స్థాయికి నితీష్‌ ఎదగడమే ఓ గొప్ప విషయం.

నితీష్‌ కుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న జేడీయూ రాష్ట్ర ఎన్నికల్లో ఎన్నడూ కూడా తనంతట తాను మెజారిటీ సీట్లను సాధించలేదు. ఈసారి సీట్లు, ఓట్ల శాతం మరింత తగ్గిపోయింది. ఆ పార్టీకి ఈసారి 15.4 శాతం ఓట్లతో కేవలం 43 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. గత ఎన్నికల్లో 71 సీట్లను సాధించింది. ఈసారి జనతాదళ్‌కంటే బీజేపీకి అదనంగా 30 సీట్లు రావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఈసారి ముఖ్యమంత్రి పదవి నుంచి నితీష్‌ కుమార్‌ తప్పించి ఆ స్థానంలో బీజేపీ సీనియర్‌ నాయకులకు ప్రాతినిథ్యం కల్పిస్తారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా బిహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కూడా ఆ ప్రచారానికి తోడ్పడగా, అందుకనుగుణంగా నితీష్‌ కుమార్‌ శకం ముగిసట్లేనంటూ బీజేపీ సీనియర్‌ నాయకులు కూడా వ్యాఖ్యానాలు చేశారు. అందుకు భయపడో, మరెందుకోగానీ ఇదే తన చివరి ఎన్నికలంటూ ప్రచారం చేయడం ద్వారా ప్రజల సానుభూతిని పొందేందుకు నితీష్‌ ప్రయత్నించారు. ఏదయితేనేం, అతిపెద్ద పార్టీలుగా బిహార్లో ఆవిర్భవించిన బీజేపీ, ఆర్జేడీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేటన్ని సీట్లు సాధించలేక పోయాయి. మిత్రపక్షాలతో కలసి బీజీపీకి ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ లభించింది. బీజీపీ తాను సొంతంగా కాకుండా నితీష్‌ కుమార్‌నే ముఖ్యమంత్రిగా కొనసాగించాలనే తెలివైన నిర్ణయం తీసుకుంది.

నితీష్‌ కాదంటే ఆయన ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటిమికి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రభుత్వంలో చేరే అవకాశం స్పష్టంగా ఉండింది. దాన్ని అడ్డుకోవడంలో భాగంగానే బీజేపీకి నితీష్‌ను సీఎంగా చేయక తప్పలేదు. అయినంత మాత్రాన ఐదేళ్లపాటు నితీష్‌ను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించే ఉద్దేశం బీజేపీ అధిష్టానంకు లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. నితీష్‌ను సీఎం పదవి నుంచి తప్పించినా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నుంచి ముప్పు ఉండకుండా ఉండేందుకు ఆ పార్టీల నుంచే కాకుండా, నితీష్‌ పార్టీ నుంచి సభ్యుల వలసను బీజేపీ స్వీకరిస్తుందని, తద్వారా తానే అధికార పగ్గాలు స్వయంగా స్వీకరించే పరిస్థితిని సష్టించుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక నితీష్‌ పూర్తికాలం సీఎం పదవిలో కొనసాగరన్నది వారి వాదన.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top