నన్ను జైలుకు పంపుతారా?.. ఐటీ దాడులపై పొంగులేటి రియాక్షన్‌

Ponguleti Srinivasa Reddy Responded To It Raids - Sakshi

సాక్షి, ఖమ్మం​ జిల్లా: పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూరల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పొంగులేటి క్యాంపు కార్యాలయం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆర్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. శ్రీనివాసరెడ్డి నామినేషన్‌కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. తన నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందించారు.

శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలను దూరంగా పంపించడంతో పోలీసులు డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాగా, నామినేషన్‌ దాఖలు అనంతరం సాక్షి టీవీతో మాట్లాడిన పొంగులేటి.. తన ఇంటిపై జరుగుతున్న ఐటీ సోదాలపై స్పందించారు. ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి నా ఇళ్లు, బంధువుల ఇళ్లపై, సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నా బంధువులు, మిత్రులు  32 ఇళ్లపై 400 మంది అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు’’ అని తెలిపారు.

నామినేషన్ వేస్తానని తెలిసి ఐటీ అధికారులు వచ్చారు. నన్ను నామినేషన్ వేయడానికి వెళ్లకూడదన్నారు.  ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న 10వేల మంది కార్యకర్తలు, నాయకులు నా ఇంటికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుందని రాష్ట్రంలోని ఆపద్ధర్మ, కేంద్ర ప్రభుత్వాలు భయపడ్డాయి. అందుకే నాకు నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్‌ భయపడుతున్నారు’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు.

‘‘కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే బీఆరెస్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం. ఏ వ్యక్తి ఎప్పుడైనా, ఎక్కడైనా నామినేషన్ వేయవచ్చు. ఐటీ అధికారులకు సహకరిస్తాను. నియోజకవర్గంలో పర్యటిస్తాను. నా ఆస్తులను సీజ్ చేస్తారా? నన్ను జైలుకు పంపుతారా.? నన్ను ఏం చేసినా వెనుకడుగు వేయను. ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: పొలిటికల్‌ గేమ్‌.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top