నివసిస్తున్న చోటే ఇళ్లు | Indiramma Housing drive to cover core urban region: Telangana | Sakshi
Sakshi News home page

నివసిస్తున్న చోటే ఇళ్లు

Feb 18 2026 6:11 AM | Updated on Feb 18 2026 6:11 AM

Indiramma Housing drive to cover core urban region: Telangana

సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, అజహరుద్దీన్‌

నిరుపేదల కోసం ఇందిరమ్మ పథకం కింద భారీ భవన సముదాయాలు 

ఉపాధి పొందుతున్న ప్రాంతంలోనే నిర్మించి ఇవ్వాలని సర్కారు నిర్ణయం 

బస్తీ ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లక పోవడమే కారణం 

‘క్యూర్‌’ప్రాంతంపై మంత్రుల సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: బస్తీలు, మురికివాడల్లో ఇరుకు గదుల్లో జీవనం సాగిస్తున్న నిరుపేదలకు అదే ప్రాంతంలో భారీ భవన సముదాయాలు నిర్మించి ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ పథకం కిందనే ఆ ఇళ్లను నిర్మిస్తారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇదే తరహాలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకం కింద భారీ ఎత్తున నగరంలో గృహ సముదాయాలు నిర్మించింది. ఇందులో కొన్ని పూర్తి స్థాయిలో సది్వనియోగం అవుతుండగా, కొన్ని దూరంగా ఉన్నాయన్న ఉద్దేశంతో బస్తీ వాసులు వెళ్లేందుకు ఆసక్తి చూపక నిరుపయోగంగా ఉన్నాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని..లబ్ధిదారులు జీవనోపాధి పొందుతూ ఉంటున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద భారీ భవన సముదాయాలు నిర్మించి కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల (కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ–క్యూర్‌)పరిధిలోని మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్‌ కాలనీలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పూర్తి చేయటం, పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై మంగళవారం రాత్రి సచివాలయంలో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్‌ అజహరుద్దీన్‌లతో కలిసి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు.  

5 నుంచి 10 అంతస్తుల వరకు.. 
హైదరాబాద్‌లోని బస్తీల్లో జీవనం కొనసాగిస్తున్న పేదల కోసం గతంలో దూరంగా 42 వేల ఇళ్లను నిర్మించగా అందులో సగం మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్షేత్రస్ధాయి సర్వేలో తేలిందని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. చాలాచోట్ల లబ్దిదారుల ముసుగులో ఇతరులు చేరుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పేదలు జీవనోపాధి పొందుతున్న చోటనే వారికి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. ఐదు అంతస్తుల నుంచి పది అంతస్తుల మేర భారీ భవన సముదాయాలు నిర్మించి వారికి కేటాయించాలని నిర్ణయించారు. త్వరలో జరిగే కేబినెట్‌ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

10 రోజుల్లో నివేదికకు ఆదేశం 
క్యూర్‌ పరిధిలో ఇలాంటి లబ్ధిదారుల సంఖ్య, వారి ఆవాసానికి ఎన్ని భవనాలు నిర్మించాలి, అందుకు అవసరమయ్యే స్థలం తదితర వివరాలతో పదిరోజుల్లో నివేదిక అందజేయాలని మంత్రులు ఆదేశించారు. మురికివాడల్లో స్ధలం ఉన్నవారు అంగీకరిస్తే ఆ ప్రాంతంలో జీప్లస్‌ 5 అంతస్తుల్లో ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో నిర్మించిన ఇళ్లు కూలే స్థితికి చేరినందున, వాటిæ స్ధానంలో కూడా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే అంశాన్ని పరిశీలించారు. 3 కార్పొరేషన్ల పరిధిలో ఇళ్ల స్ధలాలు ఉన్న 28 వేల మంది లబి్ధదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.  

బోగస్‌ గుర్తింపు..అర్హులకు ఇళ్లు 
అసంపూర్తిగా ఉన్న, ఇప్పటికే పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు సంబంధించి మార్చి చివరి నాటికి లబి్ధదారులను ఎంపిక చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల లబి్ధదారులను గుర్తించి వారే వాటిని పూర్తి చేసుకోవడానికి వీలుగా అంతకుముందు ఖర్చు చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని మిగిలిన నిధులను మంజూరు చేయాలని నిర్ణయించారు. చాలాచోట్ల ఇళ్లు తీసుకుని అక్కడ నివాసం ఉండని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని, అలాగే బోగస్‌ లబ్ధిదారులను కూడా గుర్తించాలని ఆదేశించారు. అనర్హుల స్ధానంలో రాజకీయాలకు అతీతంగా సమీపంలో ఉన్న అర్హులైన పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు. డబుల్‌ బెడ్‌ రూం నివాస ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.  

విస్తీర్ణం సవరించుకోండి.. 
    గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారు, గత ప్రభుత్వం అమలులోకి తెచి్చన గృహలక్ష్మి పథకంలో ఇళ్లు పొందిన వారు, వాటిని ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసి ఉంటే వాటికి ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే 400 చ.అడుగులు–600 చ.అడుగుల మధ్యలోనే వాటి విస్తీర్ణం ఉండాలనే నిబంధన విధించింది. విస్తీర్ణం తక్కువ ఉంటే నిబంధన మేరకు పెంచుకోవాలని, ఎక్కువ ఉంటే, తగ్గించుకోవాలని పేర్కొంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ఇళ్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉంటే, మిగతా కిస్తీల మొత్తాన్ని విడుదల చేయనున్నట్టు పేర్కొంది. బేస్‌మెంట్‌ స్థాయిని మించి ఇల్లు నిర్మించి ఉంటే, దానికి బేస్‌మెంట్‌ కిస్తీ కాకుండా తదుపరి కిస్తీల మొత్తం విడుదల అవుతుందని తెలిపింది. గృహనిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్, ఆయా జిల్లాల కలెక్టర్లు, ముగ్గురు మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement