వివాదాస్పదమవుతున్న ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు
అధికార పార్టీకి చెందినవారివి పెంచి.. విపక్ష పార్టీలకు చెందినవారివి తగ్గించారంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల ఆరోపణ
న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న వైనం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజ నీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహా రం వివాదాస్పదమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని కాలేజీలకు ఫీజులు తగ్గిస్తూ, మరికొన్ని కాలేజీ లకు పెంచుతూ రూపొందించిన ప్రతిపాదనలు పలు ఆరోపణలకు దారి తీస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ ఆర్‌సీ) నిర్ణయాలకు విరుద్ధంగా ఉన్నాయని కాలేజీల యాజమా న్యాలు ఆరోపిస్తున్నాయి. ఫీజు లను రాజకీయ కోణంలో చూశారని, స్వతంత్ర ప్రతిపత్తి గల ఎఫ్‌ఆర్‌సీని లెక్కజేయలేదని అంటున్నాయి. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
ప్రతీ మూడేళ్లకోసారి కాలేజీల ఫీజులను ఎఫ్‌ఆర్‌సీ సమీక్షిస్తుంది. 2025–28 సంవత్సరానికి సంబంధించి అన్ని కాలేజీల ఆడిట్ నివేదికలను ఎఫ్‌ఆర్‌సీ పరిశీలించి ఫీజుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి గత ఏడాది పంపింది. దీనిపై సంతృప్తి చెందని ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు మార్గదర్శకాలు రూపొందించింది. దీని ఆధారంగా మరోసారి కాలేజీ యాజమాన్యాలతో ఎఫ్‌ఆర్‌సీ చర్చించి గత డిసెంబర్‌లో కొత్త ఫీజుల ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. వాస్తవానికి 2025–26 విద్యా సంవత్సరం నుంచే కొత్త ఫీజులు అమలు కావాల్సి ఉంది. ఇది జరగకపోవడంతో కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. తాజాగా ఫీజులు నిర్ధారణ చేస్తూ ప్రభుత్వం కోర్టుకు నివేదిక సమర్పించింది.
70 కాలేజీల్లో పాతవే...
రాష్ట్రంలో 157 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో 70 కాలేజీల్లో పాత ఫీజులే ఉంచారు. 63 కాలేజీల్లో ఫీజులు పెంచారు. 19 కాలేజీల్లో ఫీజులకు కోత పెట్టారు. ఐదు కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలను ఎఫ్‌ఆర్‌సీ ముందు పెట్టలేదు. ఇవి మూత పడినట్టుగా భావిస్తున్నారు. అయితే, అధికార పార్టీకి చెందినవారి కాలేజీల ఫీజులను పెంచి.. విపక్ష పార్టీకి చెందినవారి ఫీజులు తగ్గించారని సంఘాల నాయకులు చెబుతున్నారు.


