
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్.. పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీంతో, వారంతా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెప్పారు. మరోవైపు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం బీఆర్‌ఎస్ నుంచి గెలిచినా కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు తెలిపారు.
హిమాయత్ నగర్ డివిజన్‌లో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ నుంచి ఇంకా నోటీసులు రాలేదు. స్పీకర్ నుంచి నోటీసులు వచ్చిన ఎమ్మెల్యేలు దానికి తగ్గట్టు సమాధానం ఇస్తున్నారు. నాకు నోటీసులు వచ్చాక లీగల్ ఒపీనియన్ తీసుకొని సమాధానం ఇస్తాను. ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో దానం నాగేందర్ పేరు ప్రముఖంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గుర్తు మీద లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడంతో దానంపై వేటు పడటం ఖాయమన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికీ ఆయన స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడానికి ఇదే ప్రధాన కారణమన్న చర్చ జరుగుతోంది. దీంతో దానం నాగేందర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఆ స్థానానికి రాజీనామా చేస్తానని పట్టుపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్ సెగ్మెంట్‌కు రాజీనామా చేసి.. ఇప్పటికే ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని కోరుతున్నారనే చర్చ నడుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ బరిలో ఎవరిని నిలిపితే బాగుంటుందని.. అభ్యర్థి ఎంపిక కోసం హైకమాండ్ సర్వేల మీద సర్వేలు చేయిస్తురని సమాచారం. ఇక, ఏ సర్వేలో కూడా టికెట్ రేసులో ఉన్న నేతలు బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని రిపోర్ట్ వచ్చిందని తెలుస్తోంది.