ఒక అమాయకుడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు: వైఎస్‌ జగన్‌ | Police Harassment Shattered an Innocent Family Says YS Jagan | Sakshi
Sakshi News home page

ఒక అమాయకుడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు: వైఎస్‌ జగన్‌

Jul 2 2026 11:57 AM | Updated on Jul 2 2026 3:23 PM

Police Harassment Shattered an Innocent Family Says YS Jagan

సాక్షి, విజయవాడ: ఒక అమాయకుడ్ని అకారణంగా పోలీసులు హింసించారని, అది తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడితే కనీసం పట్టించుకునే స్థితిలో చంద్రబాబు లేరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసులనే రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారాయన. గురువారం విజయవాడలోని పేరుపోగు క్రాంతి కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడారు.

క్రాంతి కుమార్‌పై ఏ కేసులు లేవు. కార్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయినా పోలీసులు అతన్ని ఎందుకు పోలీస్‌ స్టేషన్‌కు పిలిచారు? ఎందుకు హింసించారు?. సీఐ నాగరాజు తనను వేధిస్తున్నాడంటూ.. అది తట్టుకోలేక పోతున్నానంటూ వీడియో తీసుకుని మరీ క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబాన్ని పోలీసులే చిన్నాభిన్నం చేశారు అని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు నెలలుగా పోలీసులు వేధిస్తున్నారని క్రాంతి తన వీడియోలో చెప్పాడు. ఆ మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు పెట్టాలని.. కానీ ఎందుకు అలా చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. కనీసం క్రాంతి కుటుంబం ఫిర్యాదు చేస్తే కేసు పెట్టలేదు. క్రాంతి కుటుంబానికి న్యాయపరంగా సహాయం చేస్తాం. ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటాం అని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

నెల వ్యవధిలోనే..
విజయవాడ నడిబొడ్డులోనే రెండు దారుణ ఘటనలు జరిగాయి. నెల వ్యవధిలో ఓ లాకప్‌డెత్‌(గాదె సాయికృష్ణ కేసు), పోలీసుల వేధింపులు తట్టుకోలేక మరొకరు మరణించారు(క్రాంతి కేసును ఉద్దేశించి..). సాయికృష్ణ కేసులో అతని తల్లి అర్జీని కూడా పోలీసులు పట్టించుకోని పరిస్థితి. ఏకంగా సీసీటీవీ ఫుటేజీనే మాయం చేశారు. సీసీ టీవీ ఫుటేజీ మాయమైపోతే బ్యాకప్‌ ఉండదా?. పద్ధతి ప్రకారమే స్టేషన్‌లో అరాచకాలు చేస్తున్నారు. సీఐని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని సీఎం రక్షిస్తున్నారని అని కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement