ముందు మీ రాష్ట్రాల్లో తగ్గించమనండి

PM Modi first Ask BJP Govts to Reduce Taxes on Petrol Diesel: Mallikarjun Kharge - Sakshi

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రో పన్నులు తగ్గించాలి

ప్రధానికి నరేంద్ర మోదీకి విపక్ష నేతల సలహా

మోదీ ద్వంద్వ వైఖరిపై మండిపాటు

న్యూఢిల్లీ: పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీల నాయకులు స్పందించారు. ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సుంకాలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీని డిమాండ్‌ చేశారు. 

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ముందుగా కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వాలను పెట్రోల్-డీజిల్‌పై పన్నులు తగ్గించమని అడగాలని అన్నారు. కేంద్రం అత్యధిక ఎక్సైజ్ సుంకం విధించి రూ. 27 లక్షల కోట్లు వసూలు చేసిందని, తప్పనిసరిగా రాష్ట్రాలకు సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష కోట్ల ఇంధన సబ్సిడీ ఇచ్చారని గుర్తు చేశారు. 

మా రాష్ట్రాలే దొరికాయా?
ఇంధనంపై పన్నులు తగ్గించాలని ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలను మాత్రమే ప్రధాని మోదీ ఉటంకిస్తున్నారని డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లేదా కర్ణాటక పన్నులు తగ్గించాలని ఆయన అనరని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సుంకాలు రాష్ట్రాలు వసూలు చేసే దానికంటే 3 రెట్లు ఎక్కువని ఆయన వెల్లడించారు. (చదవండి: పెట్రోల్‌ ధరలపై మోదీ కీలక వ్యాఖ‍్యలు)

ఏకీకృత విధానం కావాలి
కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన సమావేశాన్ని రాజకీయ సభలా ప్రధాని మోదీ మార్చేశారని జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా విమర్శించారు. కరోనా నియంత్రణకు గురించి తీసుకోవాల్సిన చర్యల కంటే.. పెట్రోల్-డీజిల్ పన్నుల గురించి ప్రధాని ఎక్కువగా మాట్లాడారని అన్నారు. పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి.. దేశవ్యాప్తంగా ఒకే ధర అమలయ్యేలా ఏకీకృత విధానం తీసుకురావాలని సూచించారు. (చదవండి: ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ మోదీకి లేఖ)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top