Petrol Prices: ‘వ్యాట్‌’ తగ్గిస్తేనే పెట్రో ఊరట

PM Narendra Modi Comments On Petrol Prices - Sakshi

ప్రధాని మోదీ స్పష్టీకరణ

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే  అధిక ధరలు

దేశ ప్రయోజనాల కోసం పన్ను తగ్గించండి

సీఎంలతో మోదీ వర్చువల్‌ భేటీ

కోవిడ్‌–19 తాజా పరిస్థితిపై సమీక్ష

న్యూఢిల్లీ/ముంబై/కోల్‌కతా: ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయని, అక్కడి ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) తగ్గించకపోవడమే ఇందుకు కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాన్య ప్రజలకు ఊరట కలిగించడానికి, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ తగ్గించాలని కోరారు. ప్రస్తుత ప్రపంచ సంక్షోభ సమయంలో సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ప్రధాని మోదీ బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో కోవిడ్‌–19 తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పెట్రో ధరల మోతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో ఎౖMð్సజ్‌ సుంకాలను తగ్గించిందని గుర్తుచేశారు. వ్యాట్‌ తగ్గించాలని కేంద్రం కోరినప్పటికీ కొన్ని రాష్ట్రాలు పెడచెవిన పెడుతున్నాయని, దీనివల్ల అక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆక్షేపించారు. మరికొన్ని రాష్ట్రాలు తమ విజ్ఞప్తిని మన్నించి, వ్యాట్‌ను తగ్గించాయని చెప్పారు.

సీఎంలను ప్రత్యేకంగా కోరుతున్నా..  
బీజేపీ పాలిత కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాయని వెల్లడించారు. దీనివల్ల రూ.వేల కోట్ల ఆదాయం నష్టపోతున్నప్పటికీ ప్రజలకు సాయం  చేయడం కోసం ముందుకొచ్చాయని ప్రశంసించారు. ప్రతిపక్ష పాలిత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో కొన్ని కారణాల వల్ల వ్యాట్‌ తగ్గించలేదన్నారు. అందువల్లే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ పెట్రోల్, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు. తాను ఎవరినీ విమర్శించడంలేదని, ప్రజల సంక్షేమం కోసం ఇప్పటికైనా వ్యాట్‌ మినహాయించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా విన్నవిస్తున్నానని చెప్పారు.

కలిసి పనిచేయాలి
ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మందగించిన భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించుకోవాలని ప్రధాని మోదీ చెప్పారు. సప్లైచైన్‌ తీవ్రంగా ప్రభావితం అవుతోందని, కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కరోనా సవాళ్లు ముగిసిపోలేదు
కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లు ఇంకా అంతం కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత రెండు వారాలుగా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్‌ అనేది అతిపెద్ద రక్షణ కవచమని తెలిపారు. పిల్లల్లో అర్హులైనవారందరికీ సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకోసం పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. కరోనాపై భారత్‌ సుదీర్ఘ యుద్ధం చేస్తోందని ప్రధానమంత్రి వివరించారు. కరోనాపై పోరాటంలో ముఖ్యమంత్రులు, అధికారులు, ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తల కృషిని ఆయన ప్రశంసించారు.

పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలి: కాంగ్రెస్‌
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.27 లక్షల కోట్లు ఆర్జించిందని, ఆ సొమ్మంతా ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేశారు. యూపీఏ సర్కారు హయాం కంటే మోదీ సర్కారు హయాంలో చమురుపై ఎక్సైస్‌ సుంకం ఎన్నో రెట్లు పెరిగిపోయిందన్నారు. ఈ సుంకాన్ని వెంటనే తగ్గించాలని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీట్‌ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను 2014 మే నెల నాటి స్థాయికి తగ్గించాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ విమర్శలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తిప్పికొట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ తగ్గించలేదని ధ్వజమెత్తారు.

రూ.1,500 కోట్లు వెచ్చించాం: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్, డీజిల్‌పై ప్రజలకు రాయితీ ఇస్తున్నామని, ఇందుకోసం గత మూడేళ్లలో రూ.1,500 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. పెట్రో ధరలపై ప్రధాని అవాస్తవాలు చెబుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కరోనాపై సమీక్షించడానికి నిర్వహించిన వర్చువల్‌ భేటీలో ప్రధానమంత్రి పెట్రోల్‌ ధరలపై మాట్లాడడం ఏమిటని మమత ఆక్షేపించారు. ఈ భేటీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు.

కేంద్రం రూ.26,500 కోట్లివ్వాలి: ఉద్ధవ్‌ థాకరే
కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌ ధరల పెరగుదలకు తాము బాధ్యత వహించబోమన్నారు. కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల్లో 38.3 శాతం, జీఎస్టీ వసూళ్లలో 15 శాతం మహారాష్ట్ర నుంచే వస్తున్నాయని తెలిపారు. తమ వాటా కింద రూ.26,500 కోట్లు రావాల్సి ఉన్నప్పటికీ కేంద్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. 

ఇది కూడా చదవండి: ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ మోదీకి లేఖ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top