తెగని పంచాయితీ.. రెండ్రోజుల్లో తేలుస్తాం

Piyush Goyal Sensational Comments On TRS Ministers - Sakshi

వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రులతో పీయూష్‌ గోయల్‌ 

యాసంగిలో మాత్రం బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని పునరుద్ఘాటన 

అదనపు ధాన్యంపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరిన మంత్రులు

కిషన్‌రెడ్డి, సంజయ్‌ తప్పుదారి పట్టిస్తున్నారని రాష్ట్రమంత్రుల ఫిర్యాదు 

వ్యాగన్ల విషయమై రైల్వేమంత్రితో మాట్లాడిన గోయల్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలానికి సంబంధించి నిర్ణీత లక్ష్యానికి మించి అదనంగా వచ్చే ధాన్యాన్ని కూడా సేకరిస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌ రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందానికి హామీ ఇచ్చారు. అయితే అదనంగా ఎంతమేర ధాన్యాన్ని సేకరిస్తామన్నది ఒకట్రెండు రోజుల్లో అధికారులతో మాట్లాడి స్పష్టత ఇస్తామని చెప్పారు. యాసంగిలో మాత్రం బాయిల్డ్‌ రైస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకునేది లేదని కేంద్రమంత్రి పునరుద్ఘాటించారు.

అదనపు ధాన్యాన్నంతా సేకరించాలి 
ధాన్యం కొనుగోళ్ల అంశమై శనివారం సాయంత్రం ఢిల్లీకి వచ్చిన మంత్రుల బృందం నాలుగు రోజుల పడిగాపుల అనంతరం ఎట్టకేలకు మంగళవారం పార్లమెంటులో íపీయూష్‌ గోయల్‌ కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యింది. మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, నేతకాని వెంకటేశ్, బీబీ పాటిల్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలానికి సంబంధించి కేంద్రం విధించిన లక్ష్యం మేరకు 60 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చివరి దశలో ఉన్నందున అదనపు ధాన్యం సేకరణపై కేంద్రం లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరారు. మరో 10 నుంచి 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాల్లో ఉండగా, మరో 5 లక్షల టన్నుల పంట కోత దశలో ఉందని, ఈ అదనపు ధాన్యాన్నంతా సేకరించాలని కోరారు. దీనిపై స్పందించిన గోయల్, తాను ఈ విషయమై ఇదివరకే లోక్‌సభలో ప్రకటన చేశానని గుర్తు చేశారు. దీంతో తమకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని మంత్రులు కోరారు. 

చదవండి: పాలన చేతకాకపోతే తప్పుకోండి!

బియ్యం తరలింపులో రాష్ట్ర నిర్లక్ష్యం లేదు 
ఇదే సమయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి ఇవ్వాల్సిన బియ్యం విషయంలో రాష్ట్ర నిర్లక్ష్యం లేదని కేంద్రమంత్రికి మంత్రులు వివరణ ఇచ్చారు. మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని గోదాముల నుంచి తరలించడంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. గోదాములు ఖాళీ చేయాలని తమ అధికారులు పదేపదే లేఖలు రాశారంటూ వాటిని కేంద్ర మంత్రికి అందించారు.

రైల్వే వ్యాగన్లు కేటాయించకపోవడం వల్లే తరలింపు ఆలస్యమైందని గతంలో కేంద్ర రైల్వే మంత్రి తెలిపారని ఎంపీ నామా చెప్పగా, గోయల్‌ అప్పటికప్పుడు రైల్వే మంత్రితో మాట్లాడారు. వ్యాగన్లు కేటాయించి బియ్యాన్ని తరలించాలని కోరారు. అక్కడే ఉన్న అధికారులకు సైతం ఆదేశాలిచ్చారు. కాగా బియ్యం విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌లు కేంద్రానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని గోయల్‌కు రాష్ట్ర మంత్రులు ఫిర్యాదు చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top