టీడీపీ యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం | Sakshi
Sakshi News home page

టీడీపీ యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం

Published Mon, Nov 20 2023 5:26 AM

Personal information of people in TDP app - Sakshi

సాక్షి, అమరావతి/రాజంపేట: ప్రజల వ్యక్తిగత సమాచా­రాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డదారుల్లో సేకరిస్తుండడం వివాదాస్పదంగా మారింది. ఓటర్ల వెరిఫికేషన్‌ నిర్వ­హిస్తున్నామంటూ ఇళ్లకు వెళ్లి యాప్‌లో వారి వ్యక్తిగత వివ­రాలు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం వారి ఫోన్‌ నెంబర్లు తీసుకుని దాని ద్వారా వచ్చే ఓటీపీని అడుగుతున్నారు.

ఓటీపీ నెంబర్‌ చెప్పకపోతే బలవంతంగా తెలుసుకునేందుకు బరితెగిస్తున్నారు. దీంతో గొడవలు జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఒక మహిళా టీడీపీ కార్యకర్త ఒక ఇంట్లోకి వెళ్లి వారి వివరాలు సేకరించి ఓటీపీ తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో టీడీపీ కార్యకర్తలు వారిపై దౌర్జన్యా­నికి తెగబడ్డారు. 

రెచ్చిపోతున్న టీడీపీ కార్యకర్తలు
అలాగే, ఇదే పట్టణంలోని ఆకుల వీధిలో కొందరు తెలుగు తమ్ముళ్లు ఓటర్ల వెరిఫికేషన్‌ పేరుతో సమాచారం సేకరిస్తూ ఎందుకని ప్రశ్నించిన వారిపై గొడవకు దిగి గందరగోళం సృష్టించారు. ఆ వీధిలోని ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్‌ పేరుతో ఆమె ఫోన్‌ నెంబర్, ఆధార్‌ కార్డు ఇతర వివరాలన్నీ తీసుకున్నారు. ఫోన్‌ నెంబర్‌ ద్వారా ఓటీపీ కూడా తీసుకోవడంతో ఇరుగుపొరుగు వాళ్లు అడ్డుకున్నారు.

ఓటీపీ నెంబర్‌తో మోసాలకు పాల్పడుతున్నారని, ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించగా టీడీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. ఈలోపు సమీపంలోనే ఉంటున్న రాజంపేట మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మర్రి రవి అక్కడికి రావడంతో టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ప్రజలకు ఇష్టంలేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎలా యాప్‌లో నమోదు చేస్తారని అడిగినందుకు వారు గొడవకు దిగారు. సమాచారం తెలుసుకుని పోలీసులు రావడంతో టీడీపీ కార్యకర్తలు మాటమార్చి వైఎస్సార్‌సీపీ నేత రవిపై రకరకాల ఫిర్యాదులు చేశారు.

దీనిపై పోలీసులు లోతుగా ఆరా తీయగా.. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం కింద టీడీపీ కార్యకర్తలు ప్రజల పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తేలింది. ప్రజల ఫోన్‌ నెంబర్లను యాప్‌కి అనుసంధానం చేసుకుని దాని ద్వారా వారి వివరాలు తెలుసుకుంటున్నట్లు స్పష్టమైంది. కానీ, ఆ విషయం చెప్పకుండా తాము తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ఓటర్ల వెరిఫికేషన్‌ కోసం వచ్చామని చెబుతూ ఇళ్లల్లోకి వెళ్లి వివరాలు సేకరిస్తూ ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. 

అడ్డంగా బుక్కవడంతో వీరంగం..
టీడీపీ తమ్ముళ్లు అడ్డంగా దొరికిపోవడంతో దీనిని జీర్ణించుకోలేక వారు ఆదివారం వీరంగం సృష్టించారు. అక్కడి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయుడు స్వయంగా రాజంపేట, నందలూరు మండలాల నుంచి కార్యకర్తలను సమీకరించి ఆకుల వీధికి వెళ్లారు. అక్కడ మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ ఇంటి వద్ద కవ్వింపు చర్యలకు దిగారు.

విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు రావడంతో వారిని సైతం తోసేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు.. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే ఓటర్ల వెరిఫికేషన్‌ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుండడంతో గొడవలు జరుగుతున్నాయి. ఎవరైనా సమాచారం చెప్పడానికి నిరాకరిస్తే వారిపై ఆ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్నారు.

Advertisement
Advertisement